నెలలు నిండిన గర్భిణి 100కిమీ నడక..

లాక్‌డౌన్‌ వేళ వలసకార్మికుల తరలింపునకు ప్రభుత్వం శ్రామిక్‌ రైళ్లు ఏర్పాటు చేసినా కొందరు మాత్రం కాలినడకనే పయనిస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాల బారిన పడి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు...

Updated : 24 May 2020 10:56 IST

పుట్టిన వెంటనే శిశువు కన్నుమూత

అంబాలా: లాక్‌డౌన్‌ వేళ వలసకార్మికుల తరలింపునకు ప్రభుత్వం శ్రామిక్‌ రైళ్లు ఏర్పాటు చేసినా అందులో రిజర్వేషన్‌ దొరక్క కొందరు కాలినడకనే సొంతూళ్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాల బారిన పడి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా నెలలు నిండిన ఓ గర్భిణి భర్తతో పాటు సొంతూరుకు వెళ్లేందుకు సిద్ధమై.. 100కిమీలకు పైగా కాలినడక సాగించింది. మార్గమధ్యలో ఆడబిడ్డకు జన్మనివ్వగా పుట్టిన కాసేపటికే పసిపాప కన్నుమూసింది. తొలి సంతానం పుట్టిన వెంటనే మృతిచెందడంతో ఆ దంపతుల బాధ వర్ణనాతీతంగా మారింది.  

బిహార్‌కు చెందిన జతిన్‌ రామ్‌, బిందియా దంపతులు పంజాబ్‌లోని లుథియానాలో వలసకార్మికులుగా పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ వేళ ఉపాధి కోల్పోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ గతవారం బిహార్‌లోని సొంతూరుకు వెళ్లాలనుకున్నారు. శ్రామిక్‌ రైళ్లలో రిజర్వేషన్‌ దొరకకపోవడంతో అంబాలా వరకు నడిచి వెళ్లాలని నిశ్చయించుకొని ప్రయాణం సాగించారు. అప్పటికే బిందియా నెలలు నిండిన గర్భిణి. బుధవారం వారు హరియాణాలోని అంబాలా చేరుకోగానే ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. పోలీసుల సాయంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా పాప పుట్టింది. కాసేపటికే చిన్నారి మృతిచెందడంతో ఆ దంపతుల రోదనలు మిన్నంటాయి. చివరికి, అంబాలాలోనే అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం స్థానిక ఎన్జీవో ఒకటి వారికి ఆహారం, వసతి కల్పించింది. శ్రామిక్‌ రైలులో క్షేమంగా సొంతూరుకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తామని సంస్థ చెప్పింది. 

లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోవడంతో తమ వద్ద తగినంత డబ్బు లేదని, ఈ నేపథ్యంలోనే శ్రామిక్‌ రైళ్లలో రిజర్వేషన్‌ దొరక్కపోవడంతో అంబాలా వరకు కాలినడక సాగించాలనుకున్నట్లు రామ్‌ చెప్పాడు. అలా అయినా, తదుపరి ప్రయాణానికి కాసింత డబ్బు ఆదా అవుతుందని భావించినట్లు తెలిపాడు. అందుకే 100 కిమీలకుపైగా నడిచి వచ్చామని రామ్‌ పేర్కొన్నాడు. తన భార్యకు సరైన పోషకాహారం అందకపోడంతో ఆమె ఆరోగ్యం క్షీణించిందని చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని