‘సైక్లింగ్‌ గర్ల్‌’ జ్యోతికి సూపర్‌-30 ఆఫర్‌

లాక్‌డౌన్‌ వేళ అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని సైకిల్‌పై ఎక్కించుకొని 1200 కి.మీల దూరంలో ఉన్న తన స్వగ్రామానికి.......

Published : 28 May 2020 14:53 IST

దిల్లీ: లాక్‌డౌన్‌ వేళ అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని సైకిల్‌పై ఎక్కించుకొని 1200 కి.మీల దూరంలో ఉన్న తన స్వగ్రామానికి తీసుకెళ్లిన బాలిక జ్యోతి కుమారికి ప్రపంచ వ్యాప్తంగా సానుభూతి వెల్లువెత్తుతోంది.  ఆమె దయనీయగాథకు పట్నాలోని ప్రముఖ ఐఐటీ శిక్షణా సంస్థ సూపర్‌ 30 వ్యవస్థాపకుడు ఆనంద్‌కుమార్‌ చలించిపోయారు. అంతేకాకుండా ఆమెకు ఓ గొప్ప అవకాశం కల్పించేందుకు ముందుకొచ్చారు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న ఈ బాలిక భవిష్యత్తులో ఐఐటీకి సన్నద్ధమవ్వాలనుకుంటే తమ శిక్షణా సంస్థ ఆమెకు ఆహ్వానం పలుకుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. అంతేకాదు, తన సోదరుడైన ప్రణవ్‌ను ఆ కుటుంబం వద్దకు పంపి ఈ విషయాన్ని తెలియజేశారు. జ్యోతి నివాసానికి తన సోదరుడు వెళ్లిన ఫొటోను ఆనంద్‌కుమార్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. 

మరోవైపు, గత వారంలోనే లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) ఈ బాలిక విద్యనభ్యసించేందుకు అవసరమైన సాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఆమె ఏం చదవాలనుకున్నా తామే ఖర్చులు భరిస్తామని తెలిపింది. దీనిపై బాలిక తండ్రి మోహన్‌ పాసవాన్‌ ఓ ఛానల్‌లో మాట్లాడుతూ.. తన కుమార్తెకు జీవితాంతం రుణపడి ఉంటానని భావోద్వేగానికి గురయ్యారు. 

ఎవరీ జ్యోతి కుమారి?

బిహార్‌లోని దర్భంగ జిల్లా సిర్హులీకి చెందిన బాలిక తండ్రి మోహన్‌ హరియాణాలోని గురుగ్రామ్‌లో ఆటోడ్రైవర్‌గా పనిచేసేవాడు. అయితే, ఈ ఏడాది జనవరిలో ప్రమాదానికి గురై.. అక్కడే చికిత్స పొందుతున్నాడు. అదే సమయంలో లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో కుమార్తెతో పాటు గురుగ్రామ్‌లోనే చిక్కుకున్నాడు. మరోవైపు ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా యజమాని నుంచి ఒత్తిడి మొదలైంది. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం మోహన్‌ తన దగ్గరున్న చివరి రూ.500 కుమార్తెకు ఇచ్చి సరకులు తెమ్మన్నాడు. గురుగ్రామ్‌లో ఉంటే తమకు కష్టాలు తప్పవని గ్రహించిన జ్యోతి.. సరకులకు బదులుగా ఓ పాత సైకిల్‌ కొనుగోలు చేసింది. దానిపై తండ్రిని ఎక్కించుకుని దాదాపు 1,200 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిర్హులీకి తీసుకొచ్చిన ఈ హృదయ విదారక ఘటన ఎంతో మందిని కదిలించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని