గర్భిణీని అనుమతించని అపార్ట్‌మెంట్‌వాసులు

వందే భారత్‌ విమానంలో దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ గర్భిణిని.. అపార్టుమెంట్‌వాసులు అనుమతించకపోవడంతో ఆమె కడుపులోనే బిడ్డను కోల్పోయారు. కరోనా వైరస్‌ భయంతో చోటుచేసుకున్న...

Published : 30 May 2020 02:56 IST

కడుపులోనే బిడ్డను కోల్పోయిన బాధితురాలు

మంగళూరు: వందే భారత్‌ విమానంలో దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ గర్భిణీని.. అపార్టుమెంట్‌వాసులు అనుమతించకపోవడంతో ఆమె కడుపులోనే బిడ్డను కోల్పోయారు. కరోనా వైరస్‌ భయంతో చోటుచేసుకున్న ఈ హృదయవిదారక ఘటన కర్ణాటకలోని మంగళూరులో తాజాగా చోటుచేసుకుంది. మే 12న బాధితురాలు దుబాయ్‌ నుంచి మంగళూరు చేరుకోగా.. అధికారులు ఆమెను ఓ క్వారెంటైన్‌ కేంద్రానికి తరలించారు. అక్కడ మూడ్రోజులు ఉంచి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆమెకు నెగిటివ్‌ రావడంతో హోమ్‌ క్వారెంటైన్‌ ముద్ర వేసి ఇంటికి పంపించారు. ఈ నేపథ్యంలో ఆమె ఇంటి వద్దకు చేరుకున్నాక అపార్ట్‌మెంట్‌ వాసులు అనుమతించలేదు. ఆ తర్వాత స్థానిక ఆస్పత్రుల్లోనూ ఎవరూ చేర్చుకోలేదు. కొద్దిరోజుల తర్వాత కడుపులోనే బిడ్డను కోల్పోవాల్సి వచ్చింది. 

ఈ ఘటనపై స్పందించిన మంగళూరు కమిషనర్‌ ఆమె నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌ సభ్యులకు నోటీసులిచ్చారు. ఆ గర్భిణీని ఎందుకు అనుమతించలేదో వివరణ ఇవ్వాలని కోరారు. బాధిత మహిళ ఇంట్లోకి వెళ్లేందుకు ఎవరూ అడ్డుకోలేరని కమిషనర్‌ స్పష్టం చేశారు. బాధితురాలు తొలుత క్వారెంటైన్‌ కేంద్రం నుంచి ఇంటికి వచ్చినప్పుడు అపార్ట్‌మెంట్‌ వాసులు అనుమతించలేదని, ఆ సమయంలో తాము ఏం చేయలేకపోయామని ఆమె బంధువు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత ఆమెను స్థానిక ఆస్పత్రుల్లోనూ చేర్చుకోలేదని, వైద్య సేవలు కూడా అందించలేదని వాపోయారు. చివరికి బాధితురాలిని ఓ హోటల్‌కు తరలించగా.. అక్కడ ఆమె హైపర్‌టెన్షన్‌కు గురైనట్లు పేర్కొన్నారు. తర్వాత ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించడంతో అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని