
వరవరరావు విషయంలో జోక్యం చేసుకోవాలి
కిషన్ రెడ్డిని కోరిన వరవరరావు కుమార్తెలు
హైదరాబాద్: ముంబయిలోని తలోజా జైలులో అనారోగ్యంతో బాధపడుతున్న విరసం నేత వరవరరావుకు వెంటనే బెయిల్ మంజూరు చేయాలని ఆయన కుమార్తెలు అనల, పవన కోరారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వరవరరావు మూడు రోజులుగా అనారోగ్యంతో ఉంటే.. జైలు అధికారులు ముంబయి జేజే ఆసుపత్రికి తరలించినట్లు తెలిసిందన్నారు. దీనికి సంబంధించి జైలు అధికారులు కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే జైలులో కరోనాతో ఓ ఖైదీ మృతి చెందారని.. అయినా జైలులో పరిశుభ్రత చర్యలు తీసుకోవట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 17 గంటల పాటు ఒకే బారక్‌లో 30 మంది ఖైదీలను ఉంచుతున్నారని, జైలులో సరైన సౌకర్యాలు లేవని వరవరరావు కుమార్తెలు వివరించారు.
బీమా కొరేగావ్ కేసులో వరవరరావుపై పలు ఆరోపణలు చేస్తూ అరెస్టు చేశారని, బెయిల్ కోసం దరఖాస్తు చేస్తే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) వ్యతిరేకిస్తోందని తెలిపారు. ఈ విషయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి జోక్యం చేసుకుని బెయిల్ మంజూరయ్యేలా చూడాలని వరవరరావు కుమార్తెలు కోరారు.