అమరవీరుల స్తూపం వద్ద సీఎం నివాళి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించారు. హోం మంత్రి...

Updated : 02 Jun 2020 13:37 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించారు. హోం మంత్రి మహమూద్‌ అలీ, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ తదితరులు అమరవీరులకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు.

గన్‌ పార్క్‌ వద్ద కార్యక్రమం ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు రాష్ట్ర ఆవిర్భావ, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి ఆరోగ్యంతో సంపూర్ణ జీవితం గడపాలని సీఎం ఆకాంక్షించారు. అనంతరం కేసీఆర్‌కు గవర్నర్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్‌ మాట్లాడుతూ.. తన పుట్టినరోజు, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఒకే రోజు రావడం ఆనందంగా ఉందన్నారు. జూన్‌ రెండో తేదీన పుట్టిన తాను అదే తేదీన పుట్టిన తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్‌గా రావడం విధిరాత అని తమిళిసై వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణకు సంబంధించిన పలు అంశాలు ఇరువురి మధ్య ప్రస్తావనకు వచ్చాయి. భారత స్వాతంత్ర్యం తర్వాత అంత సుదీర్ఘ కాలం జరిగిన ఉద్యమంగా తెలంగాణ ఉద్యమం చరిత్రలో నిలుస్తుందని ఈ సందర్భంగా గవర్నర్‌ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. వారి త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రమని చెప్పారు. 

తెలంగాణ భవన్‌లో...

తెలంగాణ భవన్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. రాజ్యసభ సభ్యుడు కేశవరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని