తేమ తగ్గితే కరోనా కాటు!

వాతావరణంలోని తేమకు, కరోనా వ్యాప్తికి లంకె ఉందంటున్నారు ఆస్ట్రేలియా పరిశోధకులు. వాతావరణంలోని తేమ ఒక శాతం తగ్గినప్పుడు కొవిడ్‌-19 కేసులు ఆరు శాతం మేర పెరిగే......

Published : 03 Jun 2020 01:59 IST

కొవిడ్‌ సీజనల్‌ వ్యాధిగా మారొచ్చు
ఆస్ట్రేలియా పరిశోధకుల వెల్లడి

మెల్‌బోర్న్‌: వాతావరణంలోని తేమకు, కరోనా వ్యాప్తికి లంకె ఉందంటున్నారు ఆస్ట్రేలియా పరిశోధకులు. వాతావరణంలోని తేమ ఒక శాతం తగ్గినప్పుడు కొవిడ్‌-19 కేసులు ఆరు శాతం మేర పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. స్థానిక వాతావరణం కరోనా వైరస్‌ వ్యాప్తికి ఎలా కారణమవుతుందనే  అంశంపై జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ట్రాన్స్‌బౌండరీ అండ్‌ ఎమర్జింగ్‌ డిసీజెస్‌ అనే జర్నల్‌లో ఈ పరిశోధన ప్రచురితమైంది. దక్షిణార్థగోళంలో వైరస్‌కు, వాతావరణానికి గల సంబంధాన్ని ఇందులో పేర్కొన్నారు. అలాగే, కరోనా కూడా కాలానుగుణ (సీజనల్‌) వ్యాధి కాగలదని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

సీజనల్‌గా వాతావరణంలో తేమ శాతం తగ్గినప్పుడు ఈ వైరస్‌ తిరిగి పుంజుకొనే అవకాశం ఉందని సహ పరిశోధకుడు, యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీలో ఎపిడమాలజిస్ట్‌ మైకెల్‌ వార్డ్‌ తెలిపారు. చలికాలం కొవిడ్‌-19 కాలం కాగలదని పేర్కొన్నారు. దక్షిణార్థగోళంలో చలికాలం మొదలైతే వాతావరణంలోని తేమకు, కొవిడ్‌ వ్యాప్తికి గల సంబంధాన్ని అంచనా వేయడానికి వీలు పడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 2002-03లో చైనా, హాంకాంగ్‌లో విస్తరించిన సార్స్‌-కోవ్‌, అలాగే సౌదీ అరేబియాలో సంభవించిన మెర్స్‌-కోవ్‌ సమయంలో అక్కడి వాతావరణ పరిస్థితులకు, వైరస్‌ వ్యాప్తికి గల సంబంధంపై వచ్చిన పరిశోధనలను ఉదహరించారు. చైనాలో ఇటీవల సంభవించిన కరోనా వ్యాప్తికి, వీటికి మధ్య సంబంధంపై వచ్చిన మరో పరిశోధనను సైతం ఉదహరించారు.

తేమతో ఉన్న లంకె ఇదీ..

గాలి ద్వారా వ్యాపించే వైరస్‌ల విస్తరణకు తక్కువ తేమ ఎలా కారణం అనే అంశాన్ని పరిశోధకులు వివరించారు. గాలిలో తేమ తగ్గినప్పుడు గాలి పొడిగా మారి మనిషి నుంచి వెలువడే తుంపర్లు చిన్నవిగా మారుతాయి. మనం తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే ఆ తుంపర్లు చిన్నగా మారి గాలిలో ఎక్కువ సేపు నిలవగలవని పరిశోధకులు పేర్కొన్నారు. దీంతో ఇతరులకు వైరస్‌ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. అదే తేమ ఎక్కువగా ఉంటే తుంపర్లు పెద్దవిగా, బరువుగా ఉండి వెంటనే నేలపైకి చేరే అవకాశం ఉంటుందని తెలిపారు.

పరిశోధన ఇలా..

ఫిబ్రవరి 26 నుంచి మార్చి 31 మధ్య సైంటిస్టులు సిడ్నీ పరిసర ప్రాంతాల్లో 749 మంది కరోనా బాధితులపై ఈ పరిశోధన జరిపారు. బాధితుల నుంచి వారి పోస్టల్‌ పిన్‌కోడ్‌లను తీసుకున్నారు. వారి చిరునామా ఆధారంగా అక్కడి స్థానిక వాతావరణ కేంద్రంలోని ఉష్ణోగ్రత, తేమ, వర్షపాతం వంటి వివరాలతో సరిపోల్చారు. దీని ఆధారంగా తక్కువ తేమ ఉన్నప్పుడు ఈ వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటోందని తేల్చారు. కాబట్టి, రాబోయే శీతకాలంలో ఆస్ట్రేలియా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందరు. ఆస్ట్రేలియాలో సాధారణంగా తక్కువ తేమ శాతం ఆగస్టులో నమోదు అవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో కేసుల సంఖ్య తగ్గినప్పటికీ పొంచి ఉన్న ముప్పు విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వార్డ్‌ హెచ్చరించారు. చలికాలంలో కరోనాకు అనుకూలంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో నిరంతర పర్యవేక్షణ, పెద్ద ఎత్తున టెస్టింగులు చేపట్టడం ఒక్కటే ముందున్న మార్గమని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని