ఆమె హ్యాండ్‌ బ్యాగ్‌లో బాంబ్‌ ఉంది

అప్పుడప్పుడు ఎయిర్‌పోర్టుల్లోనూ, బస్టాపుల్లోనూ బాంబ్‌ ఉందంటూ ఆకతాయిల నుంచి ఫోన్‌కాల్స్‌ రావడం చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఓ వ్యక్తి తన భార్య తనతో గొడవపడి వదిలి వెళ్లిపోతుండడంతో

Published : 05 Jun 2020 02:07 IST

- భార్యపై కోపంతో ఓ భర్త నిర్వాకం

దిల్లీ: అప్పుడప్పుడు ఎయిర్‌పోర్టుల్లోనూ, బస్టాపుల్లోనూ బాంబు‌ ఉందంటూ ఆకతాయిల నుంచి ఫోన్‌కాల్స్‌ రావడం చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఓ వ్యక్తి తన భార్య గొడవపడి వదిలి వెళ్లిపోతుండటంతో భరించలేక ఆమె బాంబులతో ఎయిర్‌పోర్టుకు వచ్చిందంటూ పోలీసులకు ఫోన్‌ చేశాడు. గురుగ్రామ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే మంగళవారం సాయంత్రం 5:45కు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కాల్‌సెంటర్‌కు ఓ అజ్ఞాతవ్యక్తి ఫోన్‌ చేశాడు. ఓ మహిళ తన హ్యాండ్‌బ్యాగ్‌లో బాంబులతో దిల్లీ నుంచి భువనేశ్వర్‌ వెళ్లే విమానం ఎక్కేందుకు సిద్ధంగా ఉందని ఆ ఫోన్‌కాల్‌ సారాంశం.

దీంతో ఉలిక్కిపడిన వారు విమానాశ్రయ భద్రతాసిబ్బందికి సమాచారం అందించారు. వారితో పాటు కేంద్ర పారిశ్రామిక భద్రతా సిబ్బంది, బాంబ్ స్క్యాడ్‌ కూడా అక్కడకు చేరుకున్నారు. టెర్మినల్‌ 3 వద్ద విమానం కోసం ఎదురుచూస్తున్న సదరు మహిళను పక్కకు తీసుకెళ్లి ఆమె బ్యాగును క్షుణ్ణంగా పరిశీలించారు. ఆమె బ్యాగులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించుకున్నాక ఊపిరి పీల్చుకున్నారు. ఏవైనా విస్పోటన పదార్థాలు ఉంటే ప్రాథమిక తనిఖీల్లోనే గుర్తిస్తామని, అయినప్పటికి ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో ఆమెను టెర్మినల్‌ వద్ద మరోసారి తనిఖీ చేశామని సిబ్బంది వివరణ ఇచ్చారు. విచారణలో ఆ ఫోన్‌కాల్‌ చేసింది సదరు మహిళ భర్తేనని, ఆమె అతనితో గొడవ పడి వెళ్లిపోతుండమే ఇందుకు కారణమని తేలింది. దీంతో విమానాశ్రయ సిబ్బంది అతనిపై గురుగ్రామ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని