జీహెచ్‌ఎంసీ మినహా ‘పది’ పరీక్షలకు ఓకే

కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా వాయిదా పడిన పదో తరగతి పరీక్షల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠ వీడింది. జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని ...

Updated : 06 Jun 2020 17:43 IST

హైదరాబాద్: కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా వాయిదా పడిన పదో తరగతి పరీక్షల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠ వీడింది. జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పరీక్షలను నిర్వహించుకోవచ్చని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించింది. అయితే జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు అనుమతించాలని ఆదేశించింది. సప్లిమెంటరీ ఉత్తీర్ణులను కూడా రెగ్యులర్‌గా గుర్తించాలని ప్రభుత్వానికి ఆదేశించింది.

కరోనా కేసులున్నప్పటికీ పరీక్షలు నిర్వహించేందుకుగానూ జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాల్లో జాగ్రత్తలు తీసుకున్నామని.. పరీక్షల నిర్వహణకు అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. ‘ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కరోనాతో ఎవరైనా విద్యార్థి మరణిస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? పరీక్షా కేంద్రాలున్న ప్రాంతాలు కంటైన్‌మెంట్‌ జోన్లుగా మారితే ఏం చేస్తారు’ అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా తీవ్రత దృష్ట్యా విద్యార్థులను ప్రమాదంలోకి నెట్టలేమని.. పరీక్షల కన్నా విద్యార్థుల జీవితాలే ముఖ్యమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ మినహా అన్ని జిల్లాల్లో పరీక్షల నిర్వహణకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఇవాళ ఉదయం పదో తరగతి పరీక్షలపై విచారించిన హైకోర్టు పరీక్షలు లేకుండా గ్రేడింగ్‌ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. అయితే రాష్ట్రంలో వేర్వేరుగా పరీక్షలు నిర్వహించడం కష్టమని, ప్రశ్నా పత్రాలు మళ్లీ మళ్లీ తయారు చేయడం ఇబ్బందని అడ్వొకేట్‌ జనరల్‌ ప్రసాద్‌ కోర్టుకు తెలిపారు. విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా లేక సాంకేతిక అంశాలు ముఖ్యమా? అని కోర్టు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా తీర్పుతో పరీక్షల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని