చైనా×భారత్‌: అమూల్‌ ట్విటర్‌ బ్లాక్‌

గుజరాత్‌లోని పాల ఉత్పత్తుల సంస్థ అమూల్‌ ట్విటర్‌ ఖాతాను బ్లాక్‌ చేయడం వివాదంగా మారింది. ‘చైనా ఉత్పత్తులను బహిష్కరించాలి’ ....

Published : 07 Jun 2020 01:43 IST

ముంబయి: గుజరాత్‌లోని పాల ఉత్పత్తుల సంస్థ అమూల్‌ ట్విటర్‌ ఖాతాను బ్లాక్‌ చేయడం వివాదంగా మారింది. ‘చైనా ఉత్పత్తులను బహిష్కరించాలి’ అనే అర్థంతో ఒక కార్టూన్‌ను అమూల్‌ ట్వీట్‌ చేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఈ ఖాతాను ట్విటర్‌ బ్లాక్‌ చేయడం విమర్శలకు తావిచ్చింది. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌కు దారితీసింది.

అమూల్‌ సంస్థ ప్రతి రోజూ ఒక కార్టూన్‌ను విడుదల చేసే సంగతి తెలిసింది. అదే విధంగా గురువారం రాత్రి ‘డ్రాగన్‌ నుంచి బయటపడండి?’ అనే ట్యాగ్‌లైన్‌తో ‘స్వావలంబన భారత్‌’కు మద్దతుగా కార్టూన్‌ను ప్రదర్శించింది. అందులో ‘అమూల్‌.. మేడిన్‌ ఇండియా’ అనీ ఉంది. దీనిని పోస్ట్‌ చేశాక ట్విటర్‌ తమ ఖాతాను నిలిపివేసిందని జీసీఎంఎంఎఫ్‌ ఎండీ ఆర్‌ఎస్‌ సోధి అన్నారు.

‘మా ట్విటర్‌ ఖాతాను ఎందుకు బ్లాక్‌ చేశారో తెలియదు. ట్విటర్‌ నుంచి మాకు ఎలాంటి అధికారిక నోటీసు రాలేదు. ఎవరికీ వ్యతిరేకంగా అమూల్‌ ప్రచారం చేయదు. 55 ఏళ్లుగా మేం కార్టూన్లు ప్రచురిస్తున్నాం. సాధారణ అంశాలు, ప్రస్తుతం ప్రజల భావోద్వేగాలను అనుసరించి హాస్య ధోరణిలో వీటిని ఇస్తుంటాం. జూన్‌ 4 రాత్రి యాడ్‌ ఏజెన్సీ ఈ కార్టూన్‌ను పోస్ట్‌ చేశాక ఖాతా నిలిపివేశారని తెలిసింది. రీ యాక్టివేషన్‌ చేయాలని కోరాక పునరుద్ధరించారు. ఎందుకు బ్లాక్‌ చేశారో చెప్పాలని అడగ్గా అధికారికంగా ఏమీ చెప్పలేదు’ అని సోధి అన్నారు.

ఈ విషయం బయటకు వచ్చాక అమూల్‌కు మద్దతుగా నెటిజన్లు వేల సంఖ్యలో ట్వీట్లు చేశారు. ట్విటర్‌ తీరును ఎండగట్టారు. భారత్‌ పట్ల ట్విటర్‌ వివక్ష పూరితంగా ప్రవర్తిస్తోందని విమర్శించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని