భారత్‌లో పడిపోయిన ‘కరోనా వైరస్‌’

వైరస్‌ సమాచారం శోధించి శోధించి విసిగిపోయిన ప్రజలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నారు! గూగుల్‌ శోధనలో కొన్ని వారాలుగా అగ్రస్థానంలో ఉన్న ‘కరోనావైరస్’ స్థానం పడిపోవడమే ఇందుకు కారణం. మే నెలలో నెటిజన్లు మళ్లీ సినిమాలు, వాతావరణం వంటి అంశాలను ఎక్కువగా వెతికారు....

Published : 08 Jun 2020 17:15 IST

 సినిమాలు, వాతావరణం పైకి మళ్లిన నెటిజన్ల ఆసక్తి

ముంబయి: కరోనా వైరస్‌ సమాచారం శోధించి శోధించి విసిగిపోయిన ప్రజలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నారు! గూగుల్‌ శోధనలో కొన్ని వారాలుగా అగ్రస్థానంలో ఉన్న ‘కరోనావైరస్’ స్థానం పడిపోవడమే ఇందుకు కారణం. మే నెలలో నెటిజన్లు మళ్లీ సినిమాలు, వాతావరణం వంటి అంశాలను ఎక్కువగా వెతికారు.

గూగుల్‌ ట్రెండ్స్‌ ప్రకారం ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో ‘కరోనా వైరస్‌’ సెర్చ్‌ వాల్యూమ్‌ సగానికి సగం తగ్గింది. ఏకంగా 12వ స్థానానికి పడిపోయింది. సినిమాలు, అర్థాలు, వార్తలు, వాతావరణం వంటి అంశాల గురించి భారత ప్రజలు ఎక్కువగా వెతుకుతున్నారని గూగుల్‌ తెలిపింది. ఇది కొవిడ్‌-19కు ముందు నాటి పరిస్థితిని సూచిస్తోందని వెల్లడించింది.

టోర్నమెంట్లు ఏమీ లేకపోవడంతో క్రికెట్‌ ఇంకా దిగువ స్థాయిలోనే ఉంది. నెటిజన్లు ‘క్రికెట్‌’ కన్నా ఐదు రెట్లు ఎక్కువగా కరోనా వైరస్‌ గురించి శోధించడమే ఇందుకు ఉదాహరణ. మొత్తం మీద మే నెల్లో ‘లాక్‌డౌన్‌4.0’ గురించి ఎక్కువగా వెతికారు. ఆ తర్వాతి స్థానంలో ‘ఈద్‌ ముబారక్‌’ నిలిచింది.

‘కరోనా వైరస్‌కు సంబంధించిన వ్యాధి ఏది?’, ‘లక్షణాలు కనిపించిన వారు కరోనా వైరస్‌ను వ్యాప్తి చేస్తారా?’, ‘మే17 తర్వాత లాక్‌డౌన్‌ను పొడగిస్తారా?’ వంటి ప్రశ్నలకు నెటిజన్లు ఎక్కువగా సమాధానాలు వెతికారని గూగుల్‌ తెలిపింది. ‘కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ జోన్స్‌ దిల్లీ’ వాల్యూమ్‌ 1800 రెట్లు పెరగ్గా ‘ఇటలీ కరోనావైరస్‌ వ్యాక్సిన్‌’ వాల్యూమ్‌ 750 రెట్లు పెరిగింది.

కరోనా వైరస్‌కు సంబంధించి టాప్‌ ట్రెండింగ్‌ అంశంగా ‘వ్యాక్సిన్‌’ నిలిచింది. మేలో దీని వాల్యూమ్‌ 190% పెరిగింది. కరోనాకు సంబంధించి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గోవా, మేఘాలయా, చండీగఢ్‌, త్రిపురను శోధించారు. కేంద్ర ప్రభుత్వం మార్చి 25 నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను అమలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దానిని పొడగించారు. మే 4-17 మధ్య మూడు, మే 18-31 వరకు నాలుగో దశ అమలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని