వలస కూలీల కోసం కేంద్రం కొత్త పథకం 

లాక్‌డౌన్‌ అమలులో భాగంగా ఉపాధి కోల్పోయి తమ స్వస్థలాలకు చేరుకున్న వలస కూలీలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం...

Published : 08 Jun 2020 19:57 IST

దిల్లీ: లాక్‌డౌన్‌ అమలులో భాగంగా ఉపాధి కోల్పోయి తమ స్వస్థలాలకు చేరుకున్న వలస కూలీలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా వలస కూలీలకు వారి సొంత రాష్ట్రాల్లోనే ఉపాధి కల్పించనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వలస కూలీలు అధికంగా ఉన్న 116 జిల్లాల జాబితాను సిద్ధం చేసి వారికి ఎలాంటి పనులు కల్పించాలనే దానిపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఈజీఏ), ఆత్మ నిర్భర భారత్‌ అభియాన్‌ ద్వారా వారికి ఉపాధి కల్పించనున్నారు. అలానే జన్‌ ధన్‌ యోజన, కిసాన్‌ కళ్యాణ్ యోజన, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్‌, పీఎం ఆవాస్‌ యోజన పథకాలను కూడా ఇందుకు ఉపయోగించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ప్రధాని కార్యాలయం అన్ని మంత్రిత్వశాఖల నుంచి నివేదికలు సేకరించినట్లు వెల్లడించారు. మొత్తం 116 జిల్లాలు రాష్ట్రాల వారీగా బిహార్‌ - 32, ఉత్తరప్రదేశ్‌ - 31, మధ్యప్రదేశ్‌ - 24, రాజస్థాన్‌ - 22, ఒడిశా - 4, ఝార్ఖండ్ - 3 ఉన్నాయి. ప్రభుత్వ వర్గాలు ఆయా జిల్లాల్లో వలస కూలీలను గుర్తించే పనిలో నిమగ్నమయినట్లు తెలిపారు.

కరోనా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ అమలు చేయడంతో దేశవ్యాప్తంగా పరిశ్రమలు, వ్యాపార, నిర్మాణ రంగ సంస్థలు మూతపడ్డాయి. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వలస కూలీలు వారి స్వంత గ్రామాలకు పయనమయ్యారు. దీంతో వారిని ఆదుకోవడంలో కేంద్రం విఫలమయిందని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. ప్రభుత్వం ప్రత్యేక శ్రామిక రైళ్లు ఏర్పాటు చేసి వారిని తరలించే ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో సొంత ప్రాంతాలకు చేరుకున్న వలస  కార్మికులు, కూలీలను ఆదుకునే దిశగా కేంద్రం ఈ కార్యచరణ సిద్ధం చేసినట్లు సమాచారం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు