నల్ల జాతీయుల ఆవేదన ఇప్పటిది కాదు..

1565లోనే అమెరికాలోని ఫ్లోరిడాలో స్పానీష్‌ కాలనీల్లో ఆఫ్రికన్లు బానిసలుగా ఉన్నారని చరిత్రకారులు చెబుతున్నారు. దానిపై స్పష్టమైన సమాచారం లేదు. కానీ 1619లో ఆఫ్రికన్లు బానిసలుగా అమెరికాలో అడుగుపెట్టారు. డచ్‌ షిప్‌లో 20 మంది ఆఫ్రికన్లను ఇంగ్లిష్‌ కాలనిస్టులు వర్జినియాకు తీసుకొచ్చారు. వారిని తమ వద్దే బానిసలుగా

Updated : 12 Jun 2020 10:52 IST

అధికారం ఉందనో.. జాత్యహంకారంతోనో ఒకరి గొంతు నొక్కాలని చూస్తే.. లక్షల గొంతులు గళమెత్తుతాయని జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఘటన మరోసారి రుజువు చేసింది. ఇలాంటి జాత్యహంకారం ప్రదర్శించే ఘటనలు అమెరికాలో అప్పుడప్పుడు వెలుగు చూస్తుంటాయి. తాజాగా ఆఫ్రికన్‌ అమెరికన్‌ అయిన జార్జ్‌ఫ్లాయిడ్‌ మెడపై ఓ అమెరికన్‌ పోలీసు కాలుపెట్టి నొక్కడంతో అతడు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఘటన సమయంలో ఫ్లాయిడ్‌ అన్న ఆఖరి మాట ‘ఐ కాంట్‌ బ్రీత్‌’ పదాలే నినాదంగా మారి ప్రస్తుతం అగ్రరాజ్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. జాత్యహంకారం నశించాలని ఉద్యమకారులు పోరాటం చేస్తున్నారు. ఈ ఆందోళన.. ఆవేదన ఇప్పటిది కాదు. కొన్ని శతాబ్దాల బానిసత్వ జీవితాలు వారివి. దాని నుంచి విముక్తి లభించినా వారి వారసులు జాత్యహంకారాన్ని ఎదుర్కొంటూ అమెరికాలోనే జీవిస్తున్నారు. ఎన్నో ఉద్యమాల అనంతరం అమెరికా పౌరసత్వం సాధించిన ఈ ఆఫ్రికన్‌లు అమెరికాకు ఎప్పుడొచ్చారు? ఎలా వచ్చారు? అసలు అమెరికా చరిత్రలో ఆఫ్రికన్ల పాత్ర ఏంటి? ఓ సారి చూద్దాం..

రావడమే బానిసలుగా..

1565లోనే అమెరికాలోని ఫ్లోరిడాలో స్పానీష్‌ కాలనీల్లో ఆఫ్రికన్లు బానిసలుగా ఉన్నారని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. కానీ, 1619 నుంచి ఆఫ్రికన్ల బానిసత్వం మొదలైంది. ఇంగ్లిష్‌ కాలనిస్టులు 20 మంది ఆఫ్రికన్లను డచ్‌ షిప్‌లో వర్జినియాకు తీసుకొచ్చారు. వారిని తమ వద్దే బానిసలుగా పెట్టుకున్నారు. ఆ తర్వాత వీరి సంఖ్య క్రమంగా పెరిగింది. ఆఫ్రికా నుంచి మనుషులను తీసుకురావడం.. అమెరికాలోని పరిశ్రమల్లో.. అధికారుల ఇళ్లలో బానిసలుగా వెట్టిచాకిరి చేయించడం ఇదో రకం వ్యాపారంలా మారిపోయింది. 1641లో మసాచూసెట్స్‌ బానిసత్వాన్ని చట్టంగా మార్చింది. దీన్నే  అమెరికా మొత్తం పాటించింది. అంతేకాదు.. ఆఫ్రికన్‌ అబ్బాయిలను శ్వేతజాతి అమ్మాయిలు వివాహం చేసుకోవడాన్ని నిషేధిస్తూ మేరిల్యాండ్‌ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ఒకవైపు బానిసత్వాన్ని పటిష్ఠం చేస్తూ చట్టాలు తీసుకొస్తుంటే.. అమెరికాకు ఆఫ్రికన్ల రాక మరింత పెరుగుతూ వచ్చింది. అమెరికాలో పెరుగుతున్న బానిసల ద్వారా ఎలాంటి ఇబ్బందులు రాకూడదని అక్కడి ప్రభుత్వాలు స్లేవ్‌ కోడ్స్‌ పేరుతో చట్టాలను తీసుకొచ్చాయి. ఈ చట్టాలతో యజమానులకు ఆఫ్రికన్ల మీద పూర్తి నియంత్రణ ఉంటుంది. ఈ చట్టం ప్రకారం.. యాజమానులకు ఆఫ్రికన్‌ బానిసలు ఓ ఆస్తిలాంటి వారు. వీరిని కొనుగోలు చేయొచ్చు.. అమ్ముకోవచ్చు. 

స్వాతంత్ర్య పోరాటంలో భాగమైనా..

అదే సమయంలో బ్రిటీష్‌ పాలనపై అమెరికన్లు పోరాటం చేస్తున్నారు. వారి ఉద్యమాల్లో ఆఫ్రికన్లు సైతం పాలుపంచుకున్నారు. స్వాతంత్ర్య కోసం పోరాటం చేశారు. ఎట్టకేలకు 1776లో అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చింది. పోరాటంలో తోడుగా నిలిచిన ఆఫ్రికన్లకు బానిసత్వం నుంచి విముక్తి కల్పించాలని ఉత్తర రాష్ట్రాలు భావించాయి. దీంతో  18వ శతాబ్దం ముగిసే సరికి అక్కడ దాదాపుగా బానిసత్వం ముగిసింది. అయితే దక్షిణ రాష్ట్రాల్లో మాత్రం ఆఫ్రికన్ల బానిసత్వం మరింత పెరిగింది. దక్షిణ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఏర్పడ్డ పొగాకు, పత్తి పరిశ్రమల్లో ఈ ఆఫ్రికన్లతో పనిచేయించేవారు. దీంతో 1790 నాటికి అమెరికాలో ఆఫ్రికన్ల సంఖ్య 7.66లక్షలకు చేరింది. 1807లో అప్పటి అమెరికా అధ్యక్షుడు థామస్‌ జెఫర్సన్‌ ఆఫ్రికన్లను అమెరికాకు తీసుకురావడాన్ని నిషేధిస్తూ చట్టం తీసుకొచ్చారు. అయినా అది అమలుకాకపోగా.. పరిశ్రమల్లో పనిచేసేందుకు కార్మికుల పేరుతో వారిని తీసుకురావడం.. స్లేవ్‌ బ్రిడీంగ్‌ ద్వారా.. అంటే ఆఫ్రికన్‌ మహిళలకు చిన్నవయసులోనే వివాహం చేసి.. పిల్లలను కనిపించడం తద్వారా అమెరికాలోనే ఆఫ్రికన్‌ బానిసల సంఖ్య పెంచడం మొదలుపెట్టారు. దీంతో 1850 నాటికి దక్షిణ రాష్ట్రాల్లో 95శాతం మంది అమెరికన్‌ ఆఫ్రికన్లు బానిసలుగా స్థిరపడ్డారు. 

ఉద్యమాలు మొదలు..

బానిసత్వంపై 1830 నుంచి ఉద్యమాలు మొదలయ్యాయి. అయినా ఎప్పటికప్పుడు వాటిని ప్రభుత్వాలు అణిచివేస్తూ ఉండేవి. కొందరు ఆఫ్రికన్లు దక్షిణ రాష్ట్రాల నుంచి ఉత్తర రాష్ట్రాలకు అండర్‌గ్రౌండ్‌ రైలురోడ్డు మార్గంలో పారిపోయారు. కొందరు ఆఫ్రికన్‌ అమెరికన్లు న్యాయపోరాటానికి ప్రయత్నించారు. అయితే 1857లో అమెరికా సుప్రీంకోర్టు నల్లజాతీయులకు అమెరికా పౌరసత్వం ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఉద్యమాలు మరింత వేడెక్కాయి. 

అమెరికా అంతర్యుద్ధం

అమెరికా 16వ అధ్యక్షుడిగా ఎన్నికైన అబ్రహం లింకన్‌ దేశంలో బానిసత్వాన్ని నిర్మూలించాలని భావించారు. ఉత్తర రాష్ట్రాలు ఇందుకు మద్దతు తెలపగా.. దక్షిణ రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇక్కడ పరిశ్రమలు ఉండటం.. వాటిలో ఆఫ్రికన్లే బానిసలుగా పనిచేస్తుండటంతో బానిసత్వ చట్టాలు కొనసాగించాలని దక్షిణ రాష్ట్రాలు నాయకులు నిర్ణయించారు. అబ్రహం లింకన్‌ నిర్ణయాన్ని వ్యతిరేస్తూ దక్షిణ రాష్ట్రాల్లోని సౌత్‌ కరోలినా, మిస్సిసిపి, ఫ్లోరిడా, అలబమా, జార్జియా, లూసియానా టెక్సాస్‌లు యూఎస్‌ నుంచి వేరుపడి ‘కాన్ఫడరేట్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా’గా ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఈ కూటమిలోకి వర్జీనియా, ఆర్కాన్సస్‌,  టెన్నెసీ, నార్త్‌ కరోలినా కూడా చేరాయి. వెంటనే ఉత్తర‌ రాష్ట్రాలు యుద్ధం ప్రకటించాయి. 1861 ఏప్రిల్‌ 12న అంతర్యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో 1863 జనవరి 1న అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్‌ అమెరికాలో ఆఫ్రికన్లను బానిసత్వం నుంచి విముక్తి కల్పిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఉత్తర రాష్ట్రాల్లో బానిసత్వం నుంచి విముక్తి పొందిన నల్లజాతీయులు.. దక్షిణ రాష్ట్రాల్లో నుంచి పారిపోయి వచ్చిన వాళ్లు కలిసి దాదాపు 1.60లక్షల మంది ఆఫ్రికన్లు సైన్యంలో చేరి కాన్ఫడరేట్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికాపై జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. 1865 మే 9న యుద్ధం ముగిసింది. ఈ అంతర్యుద్ధంలో ఉత్తర రాష్ట్రాలే విజయం సాధించాయి. అదే ఏడాది 13వ రాజ్యాంగ సవరణ ద్వారా బానిసత్వాన్ని రద్దు చేశారు. దీంతో 40లక్షల మంది ఆఫ్రికన్ అమెరికన్లు బానిసత్వం నుంచి స్వేచ్ఛ పొందారు. ఆ తర్వాత కాన్ఫడరేట్‌ స్టేట్స్‌ యూఎస్‌లో భాగమయ్యాయి. ఓటమిని జీర్ణించుకోలేని, బానిసత్వ చట్టాలకే మద్దతు పలికిన నటుడు జాన్‌ వికిస్‌ బూత్‌ అబ్రహం లింకన్‌ను హత్య చేశాడు.

మళ్లీ ఉద్యమాలు.. పౌరసత్వం

అంతర్యుద్ధం తర్వాత అమెరికా ప్రభుత్వం దేశ పునర్నిర్మాణం పేరుతో కార్యక్రమం చేపట్టింది. కాన్ఫడరేట్‌ స్టేట్స్‌ను యూఎస్‌లో కలుపుకోవడంతోపాటు బానిసత్వం నుంచి విముక్తి పొందిన అమెరికన్‌ ఆఫ్రికన్లకు సమాజంలో గుర్తింపు లభించేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, దక్షిణ రాష్ట్రాలు నల్లజాతీయుల స్వతంత్రతను కట్టడి చేసేందుకు, తక్కువ వేతనానికి పనిచేసేలా బ్లాక్‌ కోడ్స్‌ అమలుచేశాయి. వీటికి వ్యతిరేకంగా ఆఫ్రికన్‌ అమెరికన్లు ఉద్యమాలు చేయడంతో 1866లో సివిల్‌ రైట్స్‌ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం.. అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కరి పౌర హక్కులకు, స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తామని ప్రకటించారు. విచిత్రమేమిటంటే.. ఈ చట్టాన్ని అప్పటి దేశాధ్యక్షుడు అండ్రూ జాన్సస్‌ ఆమోదించలేదు. అయినా.. చట్టసభల్లో అత్యధికులు ఈ బిల్లుకు మద్దతు పలకడంతో అధ్యక్షుడు సంతకం లేకుండానే బిల్లు చట్టంగా మారింది. ఆ తర్వాత 1868లో 14వ రాజ్యాంగ సవరణతో ఆఫ్రికన్‌ అమెరికన్లకు అమెరికా పౌరసత్వం.. 1870లో 15వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆఫ్రికన్ అమెరికన్లకు ఓటు హక్కు కల్పించారు. 

వివక్షలు..ఉన్నత శిఖరాలు

ఇంత చేసి అమెరికా సమాజంలో పౌరులుగా గుర్తింపు పొందిన ఆఫ్రికన్‌ అమెరికన్లు జాత్యహంకారాన్ని ఎదుర్కొవల్సి వచ్చింది. చదువు, ఉద్యోగాల్లో వీరిపై వివక్ష చూపేవారు. ఇక దక్షిణ అమెరికా వ్యాప్తంగా నల్లజాతీయులు, శ్వేతజాతీయులకు.. పాఠశాలలు, రోడ్లు, హోటళ్లు ఇలా అన్ని సేవలు వేర్వేరుగా ఉండేవి. ఈ క్రమంలో నల్లజాతీయుల కోసం అమెరికా ప్రభుత్వం పలు చట్టాలను తీసుకొచ్చింది. దీంతో ప్రభుత్వం ఇచ్చిన రక్షణ, హక్కులతో కొందరు ఆఫ్రికన్‌ అమెరికన్లు ఉన్నత శిఖరాలు అధిరోహించారు. ఆఫ్రికన్‌-అమెరికన్‌ అయిన బరాక్‌ ఒబామా ఏకంగా అమెరికా అధ్యక్షుడయ్యాడు. హాలీవుడ్‌లో ఎంతో మంది ఆఫ్రికన్‌ అమెరికన్లు స్టార్‌ నటులయ్యారు. వీరి ఉన్నతిని తట్టుకోలేక.. తమకు పోటీ వస్తున్నారని అక్కసుతో ఇప్పటికీ నల్లజాతీయులపై తరచూ దాడులు జరుగుతుంటాయి. నాలుగు శతాబ్దాల పోరాటంలో చట్టాల పరంగా ఎన్నో విజయాలు సాధించిన ఆఫ్రికన్‌ అమెరికన్లు జాత్యహంకారంపై మాత్రం విజయం సాధించలేకపోతున్నారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు