ఏనుగు ఘటన మరువకముందే..

పేలుడు పదార్థాలతో నిండిన పండును తిని మృతిచెందిన ఏనుగు ఘటన మరవకముందే కేరళలో మరో ఘటన చోటుచేసుకుంది.  మానవుని దుశ్చర్యకు ఓ శునకం..

Published : 10 Jun 2020 01:14 IST

శునకం మూతి చుట్టూ టేపు చుట్టిన వైనం

తిరువనంతపురం: పేలుడు పదార్థాలతో నిండిన పండును తిని మృతిచెందిన ఏనుగు ఘటన మరవకముందే కేరళలో మరో ఘటన చోటుచేసుకుంది.  మానవుని దుశ్చర్యకు ఓ శునకం కొన్ని రోజులపాటు నరకం అనుభవించింది. కొందరు ఆకతాయిలు మూడేళ్ల శునకం మూతి చుట్టూ టేపు చుట్టి వదిలేశారు. టేపు బలంగా చుట్టడంతో ఆ ప్రాంతం మొత్తం పుండు ఏర్పడి శునకం విలవిల్లాడింది. దయనీయ స్థితిలో ఉన్న కుక్కను రక్షించిన కొందరు జంతు సంక్షేమ సేవకులు టేపును తొలగించి ఆసుపత్రికి తరలించారు. మూతి చుట్టూ అనేక పొరలతో టేపును చుట్టడంతో చర్మం కోసుకుపోయి ముఖంమీది ఎముక బయటకు వచ్చేసింది. ఆహారం కానీ నీరు కానీ తీసుకోలేని స్థితిలో త్రిస్సూర్‌జిల్లా ఒల్లూర్‌ ప్రాంతంలోని వీధుల వెంట తిరుగుతున్న కుక్కను గమనించిన జంతు సంక్షేమ సేవకులు దానిని కాపాడేందుకు ప్రయత్నించగా అది వారికి సహకరించిందంటే ఎంతటి బాధతో విలవిల్లాడిందో అర్థం చేసుకోవచ్చు. టేపును తొలగించిన వెంటనే దాదాపు రెండు లీటర్ల నీరు తాగింది. శునకం మెడలో కాలర్ చుట్టి ఉండటంతో దానిని పెంపుడు జంతువుగానే భావిస్తున్నారు. కాగా విషయం తెలుసుకున్న ఓ వ్యక్తి దానిని పెంచుకునేందుకు ముందుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని