జగన్నాథ రథయాత్ర: ఈసారి లాగేదెవరు?

భారత్‌లో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక పూరీ జగన్నాథ రథయాత్ర. దేవతలంతా కదలివస్తారని నమ్మి ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు యాత్రకు తరలి వస్తుంటారు....

Published : 12 Jun 2020 00:59 IST

పూరీ: భారత్‌లో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక పూరీ జగన్నాథ రథయాత్ర. అయితే ఈ నెల 23న జరగాల్సిన పూరీ జగన్నాథ రథయాత్ర నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో లక్షలమంది తరలివచ్చే జగన్నాథ యాత్ర ఈ ఏడాది యథావిధిగా ఉంటుందా? ఒక వేళ ఉంటే ఎలా నిర్వహిస్తారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, యాత్రను యథావిధిగా నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు చెబుతున్నా.. లక్షల మంది రాక నేపథ్యంలో కరోనా ప్రబలే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. 

ఇదిలా ఉండగా దశాబ్దాల సంస్కృతిని ఆపేదిలేదని ఆలయ అర్చకులు, నిర్వాహకులు అంటున్నారు. ఆలయ నిర్వహణను పర్యవేక్షిస్తున్న దైతపతి సేవకులు 18వ శతాబ్దంలో తీవ్రమైన కరవు వచ్చినప్పుడు కూడా రథయాత్రను ఆపలేదని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. భక్తులు లేకుండా తామే రథయాత్రను నిర్వహిస్తామని అన్నారు. కానీ, భక్తులు లేకుండా రథాన్ని లాగేదెవరు? అనే ప్రశ్నలు తలెత్తుతుండగా.. తమ కుటుంబంలోని 36మంది నియోగులు రథాన్ని లాగుతారని దైతపతి సేవకులు తెలిపారు. అయితే రథయాత్ర నిర్వహణపై ఒడిశా ప్రభుత్వం నిర్ణయమే కీలకంగా మారనుంది. ఆలయ అధికారులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే తాము నడుచుకుంటామని తెలిపారు.

రథయాత్రపై సందిగ్ధత నెలకొన్నప్పటికీ అందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. రథయాత్రలో వినియోగించే మూడు రథాల తయారీని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. సుమారు 200మంది జగన్నాథుడి రథాన్ని నిర్మించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ముందు జాగ్రత్తగా వీరితో పాటు 754మంది ఆలయ ఉద్యోగులు, దైతపతి సేవకులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగటివ్ అని తేలింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని