ఐఐటీ మద్రాస్‌ నెం.1

దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో ఐఐటీ మద్రాస్‌ టాప్‌లో నిలిచింది. ఇంజినీరింగ్‌ విభాగంతో పాటు దాదాపు అన్ని విభాగాల్లోనూ ఐఐటీ మద్రాస్‌ తొలిస్థానంలో నిలబడింది. రెండో స్థానంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌-బెంగళూరు నిలవగా మూడవ స్థానంలో ఐఐటీ దిల్లీ నిలిచింది.

Published : 11 Jun 2020 18:39 IST

ఉన్నత విద్యాసంస్థల ర్యాంకులు ప్రకటించిన హెచ్‌ఆర్‌డీ

దిల్లీ: దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో ఐఐటీ మద్రాస్‌ అత్యుత్తమ విద్యా సంస్థగా కొనసాగుతోంది. తాజాగా కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ ప్రకటించిన ర్యాంక్‌లలో ఐఐటీ మద్రాస్‌ దేశంలో నెం.1 స్థానంలో నిలిచింది. ఇంజినీరింగ్‌ విభాగంతో పాటు దాదాపు అన్ని విభాగాల్లోనూ ఐఐటీ మద్రాస్‌ తొలిస్థానంలో నిలబడింది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌-బెంగళూరులు, ఐఐటీ దిల్లీలు రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి. ఐఐటీ హైదరాబాద్‌కు 17వ ర్యాంక్‌ వచ్చింది. ఇంజినీరింగ్‌ విభాగంలో ఐఐటీ మద్రాస్‌ తొలిస్థానంలో ఉండగా ఐఐటీ దిల్లీ. ఐఐటీ బాంబే తరువాతి స్థానాల్లో ఉన్నాయి.

ఇక యూనివర్సిటీ విభాగాల్లో బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ సైన్స్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ రెండవ స్థానంలో నిలవగా బెనారస్‌ హిందూ యూనివర్సిటీ మూడవ స్థానంలో నిలిచాయి. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం 15వ ర్యాంకు సాధించింది. ఇక విశాఖపట్నంలో ఉన్న ఆంధ్రా యూనివర్సిటీకి 36వ ర్యాంకు, వరంగల్‌ ఎన్‌ఐటీకి 46 ర్యాంకు, కెఎల్‌ యూనివర్సిటీ 70వ ర్యాంకు సాధించాయి. మేనేజిమెంట్‌ విభాగంలో ఐఐఎం తొలి ర్యాంకు సాధించింది. మెడికల్‌ విభాగంలో దిల్లీ ఎయిమ్స్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. గత మూడు సంవత్సరాలుగా ఎయిమ్స్‌ తొలి స్థానంలో కొనసాగుతోంది.

మొత్తం పది విభాగాలకు సంబంధించిన ర్యాంకులను కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోక్రియాల్ నిశాంక్ వెల్లడించారు. యూనివర్సిటీ, ఇంజినీరింగ్‌, మేనేజిమెంట్‌, ఫార్మసీ, కాలేజీ, మెడికల్‌, లా, ఆర్కిటెక్చర్‌, డెంటల్‌, ఓవర్‌ ఆల్‌ విభాగాల్లో విడివిడిగా ర్యాంకులను ప్రకటించింది. ఇలా అన్ని అంశాలు కలిపి ఉన్నత విద్యా సంస్థలకు 100 ర్యాంకులు ప్రకటించింది.

దేశంలోని నేషనల్‌ ఇన్‌స్టిస్ట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ ప్రకారం కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ ర్యాంకింగ్స్‌ విడుదల చేసింది. ఏప్రిల్‌ నెలలోనే ఈ ర్యాంకులు వెల్లడి కావాల్సి ఉండగా కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా ఈ ప్రకటన ఆలస్యం అయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని