
ఏపీ ఇంటర్ ఫలితాలు: సాంకేతిక సమస్యలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ శుక్రవారం విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఈసారి ఒకే దఫాలో విడుదల చేశారు. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి ఫలితాలను ఆన్‌లైన్‌లోనే విడుదల చేసింది. దీంతో మార్కులను చూసుకుందామని ప్రయత్నించిన విద్యార్థులకు నిరీక్షణ తప్పడం లేదు. సాయంత్రం 4గంటలకు ఫలితాలను విడుదల చేయగా, 5గంటలకు కూడా ఫలితాలు అందుబాటులోకి రాలేదు. సాంకేతిక సమస్య కారణంగా ఫలితాల కోసం నిరీక్షణ తప్పడం లేదు. ఒకేసారి ప్రథమ, ద్వితీయ ఇంటర్ ఫలితాలు విడుదల చేయడం, అదీ ఆన్‌లైన్‌లో విడుదల చేయడంతో సర్వర్‌లు మొరాయించాయి. ‘ఈ సేవలు అందుబాటులో లేవు’ అన్న సందేశం కనిపించింది. దీంతో పరీక్ష ఫలితాల విషయంలో ప్రభుత్వ ఏర్పాట్లపై విద్యార్థులు, తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళన వద్దు
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల విడుదలలో సాంకేతిక సమస్య తలెత్తడంపై బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ స్పందించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురికావొద్దని కోరింది. ఒకేసారి ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు విడుదల చేయడంతో ఫలితాల సర్వర్‌పై ప్రభావం పడిందని, సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపింది.