ఎక్కువమందికి ఉండే ఫోబియాలేంటో తెలుసా? 

ప్రతి ఒక్కరికి కొన్ని భయాలు ఉంటాయి. మనిషి లోపల ఎక్కడో ఆ భయాలు నాటుకుపోయి.. సందర్భాన్ని బట్టి బయటతాయి. ఎంత ధైర్యవంతులైనా శునకాలను చూస్తే భయపడేవారుంటారు. కొందరు నలుగురి మధ్యకు రావడానికి, మాట్లాడటానికి

Updated : 23 Aug 2021 15:12 IST

ప్రతి ఒక్కరికి కొన్ని భయాలుంటాయి. మనిషి లోపల ఎక్కడో ఆ భయాలు నాటుకుపోయి.. సందర్భాన్ని బట్టి బయటపడతాయి. ఎంత ధైర్యవంతులైనా నలుగురి మధ్యకు రావడానికి, మాట్లాడటానికి జంకేవాళ్లుంటారు. మరికొందరు పిడుగు శబ్దం వినిపిస్తే గజగజ వణికిపోతారు. ఇవే కాదు ఇలాంటి భయాలు చాలా ఉన్నాయి. వీటిని ఫోబియా అంటారు. భయానికి శాస్త్రీయ నామమే ఫోబియా. ప్రపంచవ్యాప్తంగా చాలా మందిలో సాధారణంగా పది రకాల ఫోబియాలు ఉంటాయట. అవేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.

అరాక్నో ఫోబియా

సాలె పురుగును చూసి చాలామంది భయపడుతుంటారు. అరాక్నిడ్‌ ఫ్యామిలీకి చెందిన పురుగులను చూసినా భయమేస్తుంటుంది. అందుకే ఈ భయాన్ని అరాక్నో ఫోబియా అంటారు. ఈ ఫోబియా ఉన్నవారు సాలె పురుగులను నేరుగానే కాదు.. వాటి చిత్రాన్ని చూసినా భయపడి పోతుంటారు. నిజానికి ఎక్కువ శాతం సాలె పురుగులు ప్రమాదకరమైనవి కావు. అయినా చాలామంది వాటిని చూడగానే జంకుతారు. నిజానికి ఈ భయం ఆదిమానువులుగా ఉన్నప్పట్నుంచి ఉంది. ఎందుకంటే ఆ కాలంలో సాలె పురుగులను దగ్గరకు రాకుండా ఎలా వెళ్లగొట్టాలో తెలియక వాటిని చూసి మనుషులు భయపడిపోయేవాళ్లట. అలా ఆ భయం మనిషిలో నాటుకుపోయిందని నిపుణులు చెబుతున్నారు. 

 

ఒపిడియో ఫోబియా

పామును చూడగానే ఎవరు భయపడరు చెప్పండి.. ఆ భయాన్నే ఒపిడియో ఫోబియా అని పిలుస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉంటుంది. పాము కరిస్తే విషమెక్కి చనిపోతామన్నా ఆలోచనే.. ఈ భయాన్ని పెంచుతుందట. సంస్కృతి, వ్యక్తిగత అనుభవాలు కూడా ఈ ఫోబియా రావడానికి కారణమవుతాయట.

 

అక్రో ఫోబియా

విహారయాత్రలకు వెళ్లిన సందర్భాల్లో ఎత్తైన ప్రదేశాలకు వెళ్లడానికి భయపడే వారిని, లోతైన ప్రాంతాలను చూసి దడుచుకునే వారిని మీరు గమనించే ఉంటారు. అలాంటి వారికి అక్రో ఫోబియా ఉందని అర్థం. సాధారణంగా ఇలాంటి ప్రాంతాలను చూసి ఎవరైనా కాస్త జంకుతారు. అది సర్వసాధారణం. కానీ ఈ అక్రో ఫోబియా ఉన్నవాళ్లు ఆ ప్రాంతాలకు వెళ్తే తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన చెంది అస్వస్థతకు గురవుతారు.

 

ఏరో ఫోబియా

ఒక్కసారైన విమాన ప్రయాణం చేయాలన్నది చాలా మందికి ఓ కల. కానీ అదే విమానం ఎక్కాలంటే భయపడేవాళ్లూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా విమానం ఎక్కాలంటే భయపడేవారి సంఖ్య అధికంగా ఉందట. ఒక్క అమెరికాలోనే దాదాపు 40 శాతం మంది విమానం ఎక్కేందుకు భయపడుతున్నారట. విమాన ప్రమాదాలు ఈ భయాన్ని పెంచడానికి ఓ కారణం కావొచ్చు. ఒకవేళ ఈ ఏరో ఫోబియా ఉన్నవాళ్లు విమానం ఎక్కితే గుండె వేగంగా కొట్టుకోవడం, వణుకు రావడంతోపాటు మానసికంగా ఆందోళనకు గురవుతారట. 

 

కైనో ఫోబియా

శునకాన్ని చూడగానే భయపడి పారిపోయే వ్యక్తులు నిత్యం కనిపిస్తుంటారు. శునకాలు గుంపులుగా కనిపించినా.. మొరగడం మొదలుపెట్టినా ఎంతటి కండల వీరుడైన భయపడి పోవాల్సిందే. ఇలా శునకాన్ని చూసి భయపడటాన్నే కైనో ఫోబియా అంటారు. చిన్నతనంలో శునకం కరవడం లేదా వెంటపడటం వంటి సంఘటనలు జరిగి ఉంటే... అవి మనిషి మెదడులో ముద్రపడిపోయి భయంగా మారిపోతుందట. 

 

ఆస్ట్రా ఫోబియా

పిడుగు శబ్దం వినిపించగానే అర్జునా.. ఫల్గుణా అనుకోవాలని పెద్దలు చెబుతుంటారు. అలా అనుకుంటే ఆ పిడుగులు మన మీద పడవని నమ్మకం. ఈ నమ్మకమేమో కానీ... ఉరుములు, పిడుగులు శబ్దం వింటేనే కొందరు వణికిపోతుంటారు. దీనిని ఆస్ట్రా ఫోబియా అంటారు. ఈ ఫోబియా ఉన్నవాళ్లు పిడుగులు తమ మీద పడతాయేమోనని ఆందోళన చెందుతారు. వెంటనే తలదాచుకోవడానికి స్థలం వెతుకుతారు. ఈ క్రమంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. 

 

ట్రైపనో ఫోబియా

చిన్నపిల్లలు ఇంజక్షన్‌ చేయించుకోవడానికి భయపడటం సాధారణ విషయమే.. కానీ కొందరు పెద్దవాళ్లూ ఇంజక్షన్‌ తీసుకోవడానికి భయపడతారు. దీనిని ట్రైపనో ఫోబియా అంటారట. ఈ ఫోబియా ఉన్నవాళ్లు ఇంజక్షన్‌కు భయపడి డాక్టర్‌ దగ్గరకు వెళ్లడానికి కూడా ఇష్టపడరు. ప్రపంచవ్యాప్తంగా 30 శాతం మంది ఈ ఫోబియాను కలిగి ఉన్నారట. 

 

సోషియో ఫోబియా

కొంతమంది సమాజంలో కలివిడిగా ఉండలేరు. తమచుట్టూ ఓ గిరి గీసుకొని బతికేస్తుంటారు. పార్టీలు, సమావేశాలు వంటి ఎక్కువమంది ఉండే ప్రాంతాలకు వెళ్లడానికి అసలు ఇష్టపడరు. ఈ సోషియో ఫోబియా ఉన్నవాళ్లు ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా తమనే గమనిస్తున్నారేమో, తమ గురించే మాట్లాడుకుంటున్నారెమోనని అనుకుంటారు. మనుషుల మధ్య నిలబడటమే అవమానకరంగా భావిస్తారు. ఈ క్రమంలో ఎదుటివాళ్ల ముందు ఏదైనా పని చేయాల్సి వస్తే.. తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన ఫోబియాగా గుర్తించాలి. ఇలాంటి సమస్య ఉన్నవారికి చికిత్స అవసరం.

 

నియో ఫోబియా

చాలా మందికి కొత్త ప్రదేశాలు.. కొత్త విషయాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కొత్తదనాన్ని చాలా బాగా ఎంజాయ్‌ చేస్తారు. కానీ, నియో ఫోబియా ఉన్నవాళ్లు కొత్త విషయాలను అసలు స్వీకరించలేరు. కొత్త ప్రదేశాలకు వెళ్లడానికి, కొత్త విషయం నేర్చుకోవడానికి, కొత్త మనుషులతో మాట్లాడటానికి ఇష్టపడరు. 

 

కొనియో ఫోబియా

మహానుభావుడు సినిమా చూసే ఉంటారు కదా.. అందులో హీరోకి ఓసీడీ (అబ్సేసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌) ఉంటుంది. అపరిశుభ్రత అంటే హీరోకి అసలు నచ్చదు. కొనియో ఫోబియానే ఆ ఓసీడీకి దారితీయోచ్చు. ఈ ఫోబియా ఉన్నవాళ్లు దుమ్ము, ధూళీ, సూక్ష్మక్రిములను చూస్తే భయపడతారు. క్రిములు ఎక్కడ తమకు అంటుకుంటాయోనని ఇతరులతో కరచాలనం చేయడానికి, వారితో దగ్గర నిల్చొని మాట్లాడానికి  వీళ్లు ఇష్టపడరు. ప్రతి చోటు శుభ్రంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఇప్పుడు కరోనా కారణంగా అందరూ ఇలానే ఉంటున్నారనుకోండి. అంటే ఒక విధంగా ఫోబియా మంచే చేస్తోంది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని