ఆ పోలీసుల కర్కశత్వానికి మూలం స్లేవ్‌ పాట్రోల్!

జార్జిడ్‌ ఫ్లాయిడ్‌.. మొన్నటి వరకు ఎవరికి తెలియని పేరు. కానీ ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా నల్లజాతీయులపై చూపుతున్న వివక్షకు సాక్ష్యంగా మారాడు. శ్వేతజాతి పోలీసుల కర్కశత్వానికి బలైంది ఫ్లాయడ్ మాత్రమే కాదు.. ఎంతో మంది అమాయక ఆఫ్రికన్‌ అమెరికన్లు పోలీసుల చేతుల్లో

Updated : 20 Jun 2020 13:12 IST

జార్జ్‌ ఫ్లాయిడ్‌ మొన్నటి వరకు ఎవరికి తెలియని పేరు.. ప్రస్తుతం ఆయన మృతితో అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. శ్వేతజాతి పోలీసులు జాత్యహంకారంతోనే ఫ్లాయిడ్‌ను బలితీసుకున్నారని సాటి ఆఫ్రికన్‌ అమెరికన్లు విమర్శిస్తున్నారు. ఫ్లాయిడ్‌ ఘటన తర్వాత కూడా పోలీసుల కాల్పుల్లో ఓ నల్లజాతీయుడు‌ మృతి చెందాడు. ఇలాంటి ఘటనల్లో కొన్నిసార్లు పోలీసులు తప్పు చేసినా ఎలాంటి శిక్షలు పడట్లేదు. ఇలా చట్టాలను అడ్డుపెట్టుకొని శ్వేతజాతి పోలీసులు కొనసాగిస్తున్న దాడులకు మూలాలు 18వ శతాబ్దం ప్రారంభంలో మొదలయ్యాయని చరిత్రకారులు చెబుతున్నారు. బానిసల గస్తీ దళాలు(స్లేవ్‌ పాట్రోల్) పేరుతో ఏర్పడ్డ ఓ వ్యవస్థే.. ఇప్పుడు నల్లజాతీయులపై పోలీసులు చేస్తున్న దాడులకు పునాదైందట.

బానిసల గస్తీ దళాలు అంటే..

17వ శతాబ్దం ప్రారంభంలో ఆఫ్రికా నుంచి అనేక మంది అమెరికాకు వలస రావడం మొదలుకాగా.. శతాబ్దం ముగిసే నాటికి అమెరికాలో ఆఫ్రికన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక యూఎస్‌ దక్షిణ రాష్ట్రాల్లో పారిశ్రామికీకరణలో భాగంగా ఆఫ్రికన్లను బానిసలుగా చేసి పనిచేయించుకునేవారు. అయితే వెట్టి చాకిరి చేయలేక కొందరు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా.. మరికొందరు ఎదురు తిరగాలని యత్నించేవారు. వీరిని నియంత్రించడం కోసం దక్షిణ కరోలినాలో 1704లో తొలిసారి బానిసల గస్తీ దళాల(స్లేవ్‌ పాట్రోల్) వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అన్ని దక్షిణాది రాష్ట్రాలకు ఈ దళాలు విస్తరించాయి. 

ఆ దళాలు ఏం చేసేవి?

ఈ బానిసల గస్తీ దళాల్లో కేవలం శ్వేతజాతీయులు మాత్రమే ఉండేవారు. ఆయుధాలు కలిగిన ఈ దళాలు ఆఫ్రికన్లపై కర్కశంగా వ్యవహరించేవి. ఎవరైనా పారిపోయేందుకు ప్రయత్నిస్తే.. వారిని పట్టుకొని తీవ్రంగా కొట్టి తిరిగి యజమానులకు అప్పగించేవారు. అలా తప్పించుకుని పారిపోయినందుకు మళ్లీ శిక్షలు పడేవి. అలాంటి వ్యక్తుల్ని కుటుంబం నుంచి వేరు చేసి ప్రత్యేక గదుల్లో ఉంచేవారు. కొన్నిసార్లు వాళ్ల గదుల్లోకి అనుమతి లేకుండా గస్తీ దళాలు చొరబడి తనిఖీలు చేసేవి.. అనుమానుతులని వేధించేవి. అంతేకాదు.. సెలవుల సమయంలో ఆఫ్రికన్ బానిసలపై గస్తీ దళాల్లోని సభ్యులు ప్రత్యేక నిఘా పెట్టేవారు. యజమానులకు వ్యతిరేకంగా పోరాటం కోసం ఎవరైనా గుంపులుగా చర్చలు పెట్టుకుంటే వారిని దళాలు తరిమికొట్టేవి. ఈ క్రమంలో ఆఫ్రికన్లు వారి చేతిలో చిత్రహింసలకు గురయ్యారు.

పోలీసు వ్యవస్థలో చేరి..

1776లో అమెరికాకు స్వాతంత్ర్యం రావడంతో బానిసత్వాన్ని రద్దు చేశారు. అయినా దక్షిణా రాష్ట్రాల్లో బానిసల గస్తీ దళాల దౌర్జన్యాలు కొనసాగాయి. అయితే 1861-65 అమెరికా అంతర్యుద్ధం అనంతరం ఈ దళాలు కనుమరుగయ్యాయి. అదే సమయంలో పోలీసు వ్యవస్థలో గస్తీ దళాల్లో పనిచేసిన అనేక మంది వారి వారసులు పోలీసులుగా చేరారు. నల్లజాతీయులు కూడా పోలీసు శాఖలో ఉద్యోగాలు సంపాదించినా వారు ఉండే ప్రాంతాల్లోనే విధులు అప్పగించేవారు. జాత్యంహకారాన్ని ప్రేరేపించే ప్రభుత్వాలే ఉండటంతో నల్లజాతీయులపై శ్వేతజాతి పోలీసుల వివక్ష అంతకంతకూ పెరిగిపోయింది. అనవసరంగా నల్లజాతీయులను వేధించడం.. ఎదురుదాడులు చేస్తున్నారన్న నెపంతో కాల్చి చంపడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో వందలాది ఆఫ్రికన్‌ అమెరికన్లు‌ జాత్యంహకారానికి బలయ్యారు. శతాబ్దాలు మారినా ఆ స్లేవ్‌ పాట్రోల్ మూలాలు ఇంకా ఇప్పటి పోలీసుల్లో ఉన్నాయని పలువురు మండిపడుతున్నారు. జాత్యంహకారంతోనే పోలీసులు తమపై వేధింపులకు, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని