పింఛనులో కోత సమంజసం కాదు

రాష్ట్ర ప్రభుత్వానికి ఏ చట్టం ప్రకారం విశ్రాంత ఉద్యోగుల పింఛనులో కోత విధించే అధికారం ఉందని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. రాజ్యాంగంలో గానీ, చట్టాల్లో గానీ, సుప్రీం కోర్టు తీర్పుల్లో గానీ ఎక్కడైనా ఉందా? అని తెలంగాణ ప్రభుత్వాన్ని సూటిగా

Published : 15 Jun 2020 15:19 IST

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వానికి ఏ చట్టం ప్రకారం విశ్రాంత ఉద్యోగుల పింఛనులో కోత విధించే అధికారం ఉందని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. రాజ్యాంగంలో గానీ, చట్టాల్లో గానీ, సుప్రీం కోర్టు తీర్పుల్లో గానీ ఎక్కడైనా ఉందా? అని తెలంగాణ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. విశ్రాంత ఉద్యోగులకు పింఛను కోతకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు చట్ట విరుద్ధంగా ఉన్నట్టు ప్రాథమికంగా స్పష్టమవుతోందని పేర్కొంది. పింఛనులో కోత విధించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ ఎస్ చౌహాన్, జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి ధర్మాసనం  సోమవారం విచారణ చేపట్టింది. 

ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు జోక్యంతో పింఛనులో కోతను 50 శాతం నుంచి 25 శాతానికి తగ్గించామని ధర్మాసనానికి తెలిపారు. అయితే, మిగతా 25 శాతం ఎప్పుడు చెల్లిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వాన్ని అడిగి చెబుతానని, అందుకు జులై 2 వరకు గడువు ఇవ్వాలని ఏజీ కోరారు. ఎలాంటి ఇతర ఆధారం లేని విశ్రాంత ఉద్యోగులు పింఛను కోత వల్ల ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు పేర్కొంది. కోత ఏమాత్రం సమంజసం కాదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ నిర్ణయం చట్టబద్ధంగా కనిపించడం లేదని అభిప్రాయపడింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని, కేంద్రం కూడా జీఎస్టీ బకాయిలు చెల్లించడం లేదని ఏజీ తెలిపారు. కేంద్రం తప్పు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుందా? అని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటిస్తే తప్ప పింఛనులో కోత విధించరాదని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయాలు, జీవోలు చట్టాలకు అనుగుణంగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. పింఛను కోతను ఏ చట్టం లేదా సుప్రీంకోర్టు తీర్పుతో సమర్థించుకుంటారో ఎల్లుండిలోగా తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విచారణ బుధవారానికి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని