ప్రయోగాలు ఆ ప్రాణులపైనే ఎందుకు?
కాలక్రమంలో అనేక వైరస్‌లు.. బ్యాక్టీరియాలు మానవళీపై దాడి చేస్తున్నాయి. నిత్యం ఏదో ఒక కొత్త వ్యాధి ప్రబలడం.. దానికి ఔషధం లేదా వ్యాక్సిన్ కనుగొనడం వైద్యరంగంలో పరిపాటిగా మారిపోయింది. ఇప్పటికే శాస్త్రవేత్తలు ఎన్నో వ్యాధులకు మందులు.. వ్యాక్సిన్లు కనుగొన్నారు.. మరికొన్నింటికి ఇంకా పరిశోధనలు
కాలక్రమంలో అనేక వైరస్‌లు.. బ్యాక్టీరియాలు మానవాళిపై దాడి చేస్తూనే ఉన్నాయి. నిత్యం ఏదో ఒక కొత్త వ్యాధి ప్రబలడం.. దానికి ఔషధం లేదా వ్యాక్సిన్ కనుగొనడం.. వైద్యరంగంలో పరిపాటిగా మారిపోయింది. ఇప్పటికే శాస్త్రవేత్తలు ఎన్నో వ్యాధులకు మందులు.. వ్యాక్సిన్లు కనుగొన్నారు.. మరికొన్నింటికి ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని పీడిస్తుండటంతో దీనికి వ్యాక్సిన్ కనుగొనేందుకు అనేక దేశాలు పోటీ పడుతున్నాయి. శాస్త్రవేత్తలంతా ఇదే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, చైనా శాస్త్రవేత్తలు కోతులపై ప్రయోగాలు జరిపి వ్యాక్సిన్ అభివృద్ధిలో పురోగతి సాధించారు. కొన్నిసార్లు పరిశోధనలు చేయాలన్నా.. మందు తయారు చేయాలన్నా మానవుడు కాకుండా కొన్ని ప్రాణులపై ప్రయోగాలు చేయాల్సి వస్తుంటుంది. ఇలా ప్రయోగాల సమయంలో.. ఔషధ తయారీల్లో ఏయే ప్రాణులను ఎందుకు ఉపయోగిస్తున్నారో గమనిస్తే...
నాన్-హ్యూమన్ ప్రిమేట్స్
మానవునికి సంబంధించిన చాలా పరిశోధనల్లో ఎక్కువగా నాన్-హ్యూమన్ ప్రిమేట్స్ అంటే.. దాదాపు మానవులకు సరితూగే జంతువులైన కోతులు, చింపాజీలవంటి వాటిపై ప్రయోగాలు చేస్తుంటారు. క్యాన్సర్, ఎయిడ్స్, పార్కిన్సన్, మధుమేహం, అల్జిమర్స్, మానసిక వ్యాధులకు పరిష్కారాలను వీటి ద్వారానే పొందగలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే తయారు చేసిన ఏ వ్యాక్సిన్‌నైనా ముందు కోతికి ఇస్తారు. ఆ తర్వాత వ్యాధి కారకాలను కోతిలోకి ప్రవేశపెడతారు. వాటిని తట్టుకొని కోతి బతికిందంటే.. వ్యాక్సిన్ ప్రయోగం విజయవంతమైనట్లు.. అలాకాకుండా కోతి అనారోగ్యానికి గురైతే.. దానిని చంపేస్తారు. ఔషధాల పనితనం.. నాణ్యతను తెలుసుకునేందుకు కూడా కోతులపైనే ప్రయోగాలు చేస్తారు. 2017లో ఒక్క యూఎస్‌లోనే 74,498 కోతులపై ప్రయోగాలు జరిగినట్లు అక్కడి నివేదకలు వెల్లడించాయి. యూకేలో ఏడాదికి 3వేలకుపైగా కోతులపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ప్రయోగాల్లోనూ కోతులపై కీలకమైన ప్రయోగాలు జరుగుతున్నాయి.
పందులు
పందులను ఎక్కువగా సర్జరీ ప్రాక్టీస్‌లో వినియోగిస్తారట. గాయాల చికిత్స, అవయవాల మార్పిడి, ప్లాస్టిక్ సర్జరీ వంటి విషయాల్లో వీటిపై ప్రయోగాలు చేస్తారు. వీటి అవయవాలు సైజు మనిషి అవయవాల పరిమాణంలోనే ఉంటాయట. దీంతో అవయవాల మార్పిడి ప్రక్రియని అభివృద్ధి చేయడంకోసం పందులను వినియోగిస్తున్నారు. అలాగే టాక్సికాలజీ, ఫార్మాకాలజీ పరిశోధనల్లోనూ వీటిని ప్రయోగ వస్తువుగా వాడతారు. 2018లో అమెరికన్ నివేదిక ప్రకారం మునపటికన్నా 4శాతం ఎక్కువగా పందులపై ప్రయోగాలు జరుగుతున్నాయట.
ఒపోస్సమ్స్
ఎలుకలాగే కనిపించే ఈ ఒపోస్సమ్స్ మానవుడి జన్యువు.. జీవ ప్రక్రియను పోలి ఉంటాయి. ఇదే వైద్యరంగ పరిశోధనలకు ఉపయోగపడే అంశం. ప్రస్తుతం ఎక్స్-ఇనాక్టివేషన్ అనే ప్రాజెక్టులో భాగంగా వీటిపై ప్రయోగాలు చేస్తున్నారు. ఎక్స్ క్రోమోజోమ్స్ కొన్నిసార్లు క్యాన్సర్‌కు దారి తీస్తున్నాయి. దీనికి గల కారణాలు.. నివారణ కోసం ఒపోస్సమ్స్‌తో పరిశోధనలు చేస్తున్నారు. అంతేకాదు.. చర్మ సంబంధిత వ్యాధులు, చర్మ క్యాన్సర్ ప్రయోగాల్లోనూ వీటినే ఉపయోగిస్తున్నారు.
కుందేళ్లు
కుందేళ్లు చడిచప్పుడు చేయకుండా తిరుగుతుంటాయి. పరిమాణంలోనూ మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఉంటాయి. అందుకే ప్రయోగాల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా నొప్పి.. నొప్పి నివారణ ప్రయోగాల్లో వీటి పాత్ర కీలకం. ఎందుకంటే నొప్పులను కుందేళ్లు బాగా ప్రదర్శించగలవట. అలాగే విషం, ఇరిటేషన్ వంటి అంశాల పరిశోధనలకూ కుందేళ్లు ఉపయోగపడుతున్నాయి. 2017 నుంచి వీటి వినియోగం 11 శాతం పెరిగిందని యూఎస్ నివేదికొకటి పేర్కొంది.
ఎలుకలు
చాలా పరిశోధనల్లో ఎక్కువగా ఎలుకలే ప్రయోగవస్తువుగా మారిపోతుంటాయి. ఎందుకంటే ఎలుకలోని జన్యువులు.. మానవుడి జన్యువులు చూడటానికి ఒకేలా ఉంటాయి. అలాగే మనిషికి ఉండే లక్షణాలు, శరీర నిర్మాణం, జీవ ప్రక్రియ ఎలుకలకూ ఉంటాయట. దీంతో ఔషధాలు, వ్యాక్సిన్లు మనిషిలో ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడం కోసం ఎలుకలపై ప్రయోగాలు చేస్తున్నారు.
హార్స్ షూ క్రాబ్స్
ఈ జీవితో ఎలాంటి ఉపయోగం లేదు.. కానీ దీని రక్తం పరిశోధనల్లో చాలా కీలక పాత్ర వహిస్తోంది. హార్స్ షూ క్రాబ్ రక్తం నీలిరంగులో ఉంటుంది. ఇందులోని లిములస్ అమిబోసైట్ ప్రోటీన్‌ను ఫార్మాస్యూటికల్ కంపెనీలు తమ ప్రయోగాల్లో ఎక్కువగా వాడుతుంటాయి. కంపెనీలు అవి తయారు చేసే వ్యాక్సిన్లలో బ్యాక్టీరియాలు.. లేదా బ్యాక్టీరియాల్లోని విషపూరిత రసాయనాలు ఉన్నాయో లేదో ఈ ప్రోటిన్ ద్వారా గుర్తిస్తాయి. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో వీటిని కూడా ఉపయోగిస్తున్నారట.
పాములు
పాము విషం ఏ జీవినైనా చంపేస్తుందని అందరికీ తెలుసు. కానీ అదే విషం కొన్ని వ్యాధులను నయం చేస్తోంది. రక్తపోటు, రక్తం గడ్డకట్టడం, క్యాన్సర్, నొప్పులు, పార్కిన్సన్స్, అల్జిమర్స్ వంటి వ్యాధులకు తయారు చేసే ఔషధాల్లో పాము విషాన్ని కూడా వాడతారట. హైపర్‌టెన్షన్‌ను తగ్గించే మందులను బ్రెజిల్‌లో ఎక్కువగా కనిపించే పిట్ వైపర్ పాముల నుంచి తీసిన విషంతో తయారు చేస్తారట.
చేపలు
మెదడు అభివృద్ధి, మనిషి ఎదుగుదలకు ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ముఖ్యమైన పోషకం. అలాగే గుండె సంబంధిత వ్యాధులను నియంత్రించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ప్రధానంగా అయిలీ చేపల్లో లభిస్తుంది. మనం తినే ఆహారంలో చేపలు ఉండేలా చూసుకుంటే ఆరోగ్యానికి మంచిది. కొన్నిసార్లు ఔషధం రూపంలో ఈ ఒమెగా-3ని తీసుకుంటుంటారు. ఇందుకోసం ఫార్మాస్యూటికల్ కంపెనీలు అయిలీ చేపలను పెద్దమొత్తంలో కొనుగోలు చేసి వాటి కణజాలాల నుంచి ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ను సేకరించి మందులు తయారు చేస్తారు. ఇవే కాదు.. సాలె పురుగులు, కొన్ని సముద్ర జీవులు తదితర జీవులపై కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి.
- ఇంటర్నెట్ డెస్క్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Brahmanandam: ఏ జీవిగా పుట్టించినా నవ్వించాలనే కోరుకుంటా: బ్రహ్మానందం
-
Movies News
Kangana Ranaut: ఎవరినైనా బాధ పెట్టుంటే క్షమించండి: కంగనా రనౌత్
-
Politics News
New Front: నవీన్ పట్నాయక్‌తో మమత భేటీ.. కూటమిపై చర్చించారా..?
-
Sports News
Wasim Jaffer: సూర్యకుమార్‌కు బదులు సంజూ శాంసన్‌ని తీసుకోండి: వసీం జాఫర్
-
India News
Anand Mahindra: తోలుబొమ్మ ‘నాటు నాటు’.. ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్
-
World News
Russia: ‘పుతిన్‌ను అరెస్టు చేయడమంటే.. యుద్ధాన్ని ప్రకటించినట్లే!’