మరణంతో బయటపడ్డ క్రీడాకారుడి గుట్టు

ఓ ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకొని, ఒకరికి తెలీకుండా ఇంకొకరితో చాటుమాటుగా నడిపిన వ్యవహారం అతడి మరణంతో బట్టబయలైంది.

Published : 16 Jun 2020 01:25 IST

సిల్చార్‌: ఓ ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకొని, ఒకరికి తెలీకుండా ఇంకొకరితో చాటుమాటుగా నడిపిన వ్యవహారం అతడి మరణంతో బట్టబయలైంది. ఆయన మృతదేహాన్ని రికార్డుల ప్రకారం భార్యగా చెలామణి అవుతున్న ఇంకో మహిళకు పంపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.  దాంతో అతడి కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే..

నరేశ్ అకులా ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారుడు.  2006 నుంచి 2008 మధ్య ఒడిశా తరఫున సంతోష్ ట్రోఫీలో పాల్గొన్నారు.  ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్‌ కార్పొరేషన్‌(ఓఎన్‌జీసీ) తరఫున ఐ-లీగ్‌కు ప్రాతినిధ్యం వహించారు. 2009 నుంచి ఓఎన్‌జీసీలో ఉద్యోగం చేస్తోన్న నరేశ్..రెండు సంవత్సరాల క్రితం అసోంలోని సిల్చార్‌కు బదిలీ అయ్యాడు. కాగా, చనిపోవడానికి ముందురోజు రాత్రి తన సోదరుడితో మాట్లాడుతూ.. ఇంటికి రావాలని ఉన్నట్లు చెప్పారు. కరోనా కారణంగా క్వారంటైన్‌లో ఉంచుతారని, కొద్ది రోజులు ఆగి రమ్మని సోదరుడు సూచించినట్లు సమాచారం. కానీ తెల్లవారే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, అతడు మరణించినట్లు కుటుంబానికి వార్త అందింది. గంజాంలో నరేశ్‌కు భార్య, కూతురు, తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. 
మరణవార్త తెలియగానే కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పంపమని కోరగా..రికార్డుల ప్రకారం మిజోరంలో ఉన్న అతడి భార్యకు పంపినట్లు అధికారుల నుంచి సమాధానం వచ్చింది. ‘ఆ వార్త మమ్మల్ని షాక్‌కు గురిచేసింది. నా సోదరుడికి 2012లో వివాహమైంది. అతడికి భార్య, నాలుగేళ్ల కూతురు ఉన్నారు’ అని అతడి సోదరుడు బిష్ణు మీడియాకు తెలిపారు. దీనిపై పెట్రోలియం మంత్రిత్వ శాఖను సంప్రదించగా.. కుటుంబ సభ్యులు చెప్పిన మహిళ పేరు కాకుండా, భార్యగా మరో మహిళ పేరుతో ఉన్న మిజోరం చిరునామాకు జూన్‌ 11న అతడి మృతదేహాన్ని పంపినట్లు సమాధానం వచ్చిందని బిష్ణు వాపోయారు. అప్పటికే వారు నరేశ్ వివాహానికి సంబంధించిన ఫొటోలను పంపుతూ మంత్రిత్వ శాఖ కల్పించుకోవాలని కోరినా ప్రయోజనం లేకపోయింది. చివరకు, అతడి అంత్యక్రియలు వీడియో కాల్ ద్వారా చూడొచ్చంటూ అధికారులు కంటితుడుపు నిర్ణయం తీసుకోవడం చాలా బాధించిందని నరేశ్ తండ్రి  ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలుస్తామని కుటుంబసభ్యులు వెల్లడించారు. 

కాగా, ‘నాలుగు సంవత్సరాల క్రితం నరేశ్ జీవితంలో ఇంకో మహిళ ఉందన్న విషయం అతడి స్నేహితుల ద్వారా మాకు  తెలిసింది. దానిపై ప్రశ్నించినప్పుడల్లా తప్పించుకొని తిరిగేవాడు. పని ఒత్తిడి వల్ల ఇంటికి రాలేకపోతున్నానని చెప్పి, ఇంటికి రావడం తగ్గించడంతో మాకు అనుమానం పెరిగింది’ అని మృతుడి సోదరుడు వెల్లడించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఓఎన్‌జీసీ ప్రతినిధి వెల్లడించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని