Published : 17 Jun 2020 01:18 IST

తల్లిగా బాధఉన్నా.. గర్విస్తున్నా: సంతోష్‌ తల్లి 

సూర్యాపేట: భారత్‌ - చైనా బలగాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో సూర్యాపేటకు చెందిన సంతోష్‌ బాబు వీరమరణం పొందడంపై ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. అయితే, తమ కుమారుడి మరణంపై ఆ మాతృమూర్తి స్ఫూర్తిదాయకంగా స్పందించారు. ‘‘నా కుమారుడు దేశం కోసం పోరాడి అమరుడైనందుకు సంతోషంగా ఉంది.. కానీ తల్లిగా బాధగానూ ఉంది’ అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారా వీరమాత. తమకు ఉన్న ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడం బాధగా ఉన్నా దేశం కోసం ప్రాణాలర్పించడం ఆనందంగా ఉందని ఆ దంపతులు అన్నారు. 

‘అమ్మా.. బాగున్నావా?’ అన్నాడు!

తమకు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మరణవార్త తెలిసిందని వెల్లడించారు. మరికొన్ని రోజుల్లోనే హైదరాబాద్‌కు రావాల్సి ఉండగా.. కరోనా వల్ల రావడం లేటవుతుందని చెప్పాడని తెలిపారు. చివరిసారిగా తనతో ఆదివారం రాత్రి 10గంటల సమయంలో ఫోన్‌ చేసి ‘అమ్మా బాగున్నావా?’ అని అడిగినట్టు ఆయన తల్లి గుర్తుచేసుకున్నారు. అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చేవాడనీ.. తనతో ఎక్కువగా మాట్లాడుతుండేవాడన్నారు. చైనాతో సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని తమతో చెప్పాడనీ.. జాగ్రత్తగా ఉండు నాన్నా.. అని సంతోష్‌కు చెప్పినట్టు ఆ తల్లి గుర్తుచేసుకున్నారు. 

విధుల వివరాల్ని ఎంతో రహస్యంగా ఉంచేవాడు!

తన కుమారుడు ఎంతో ప్రతిభ కలిగిన వాడనీ.. 15 ఏళ్ల సర్వీసులోనే చాలా ప్రమోషన్లు వచ్చాయని సంతోష్‌ తండ్రి తెలిపారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు డిఫెన్స్‌లో పనిచేయాలనే కోరిక ఉండేదని ఆయన చెప్పారు. అప్పుడు కొన్ని కారణాల వల్ల తాను కాలేకపోయినా.. ఆ కలను తన కుమారుడి రూపంలో నెరవేర్చుకోగలిగానన్నారు. ఆరో తరగతి నుంచే డిఫెన్స్‌లో చేర్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. తన కుమారుడు ఎక్కడ పనిచేసినా ప్రతిభ చూపేవాడనీ.. ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండేవాడని మిత్రులే చెప్పేవారని గుర్తుచేసున్నారు. విధులకు సంబంధించిన వివరాలను ఎంతో రహస్యంగా ఉంచేవాడని గుర్తుచేసుకున్నారు. రేపు ఉదయం దిల్లీ నుంచి సంతోష్‌ భౌతికకాయాన్ని సూర్యాపేటకు తరలిస్తారని ఆయన తెలిపారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts