విద్యుత్‌ బిల్లులపై కేసీఆర్‌కు జీవన్‌రెడ్డి లేఖ

విద్యుత్‌ బిల్లులను టెలిస్కోపిక్‌ విధానంలోకి మార్చాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. టెలిస్కోపిక్‌, నాన్‌...

Published : 17 Jun 2020 16:36 IST

హైదరాబాద్‌: విద్యుత్‌ బిల్లులను టెలిస్కోపిక్‌ విధానంలోకి మార్చాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. టెలిస్కోపిక్‌, నాన్‌ టెలిస్కోపిక్‌ విధానాల్లో విద్యుత్‌ బిల్లులు వేయడం ద్వారా ఎంత వ్యత్యాసం ఉంటుందనే విషయాన్ని ఉదాహరణతో సహా లేఖలో వివరించారు. కరోనా విపత్కర సమయంలో ఇలా నాన్‌ టెలిస్కోపిక్‌ విధానంలో అధికంగా విద్యుత్‌ బిల్లులు వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో టెలిస్కోపిక్‌ విధానంలోనే విద్యుత్‌ వినియోగానికి బిల్లులు వేసేవారని ఈ సందర్భంగా జీవన్‌ రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నాన్‌ టెలిస్కోపిక్‌ విధానాన్ని పాటిస్తున్నారని అన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో అధిక విద్యుత్‌ బిల్లులు చెల్లించడం ప్రజలకు భారంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే విద్యుత్‌ బిల్లులను టెలిస్కోపిక్‌ విధానంలోకి మార్చాలని డిమాండ్‌ చేశారు. ఇతర ఏవిధమైన అదనపు ఛార్జీలు గానీ, వడ్డీలు గానీ వేయకుండా వాయిదాల పద్ధతిలో చెల్లింపునకు వినియోగదారులకు అవకాశం ఇవ్వాలని జీవన్‌ రెడ్డి లేఖలో విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని