పర్వత శ్రేణులు.. ఎన్నో అందాలు
పైర గాలి వీచే పచ్చని మైదానాలు.. ఎత్తైన కొండలు.. లోతైన జలపాతాలు.. మనకు ఎప్పుడూ మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేవే. మేఘాలను తాకుతున్నాయా అన్నట్టు ఉండే పర్వత శ్రేణులు తమ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తాయి. ప్రకృతి సోయగంలో...
ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా..?
పైర గాలి వీచే పచ్చని మైదానాలు.. ఎత్తయిన కొండలు.. లోతైన జలపాతాలు.. మన మనసుకు ఎప్పుడూ ఆహ్లాదాన్ని కలిగించేవే. మేఘాలను తాకుతున్నాయా అన్నట్టు ఉండే పర్వత శ్రేణులు తమ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తాయి. ప్రకృతి సోయగంలో తామూ భాగమంటూ తమ ప్రత్యేకతను చాటుకుంటాయి. అయితే కరోనా నేపథ్యంలో పర్యాటకం కుంటుపడిది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న పలు సుందరమైన పర్వత శ్రేణులకు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలను తెలుసుకుందామా..!
కిర్క్‌జుఫెల్,ఐస్‌ల్యాండ్
మనమంతా ఎవరెస్ట్, ఫుజి, కిలిమంజారో పర్వతాల గురించి వినే ఉంటాం. అయితే అవన్నీ భారీ ఎత్తయిన పర్వతాలు. వాటిని అధిరోహించడానికి పర్వతారోహకులు చాలా కష్టపడాల్సిందే. అయితే కిర్క్‌జుఫెల్ మాత్రం తక్కువ ఎత్తు మాత్రమే కాకుండా ఎంతో సుందరమైంది కూడానూ.. యూరోపియన్ ద్వీపమైన ఐస్‌ల్యాండ్‌లో ఉన్న కిర్క్‌జుఫెల్ పర్వతశ్రేణి ఎత్తు 1,519 అడుగులు.
ది పిటన్స్, సెయింట్ లూసియా
సెయింట్ లూసియాలో చూడాల్సిన ప్రదేశం ది పిటన్స్. దట్టమైన పచ్చిక బయళ్లు మధ్య రెండు అగ్నిపర్వతాలతో 2,168 అడుగుల ఎత్తయిన సుందర ప్రాంతమే ది పిటన్స్. సుమారుగా 245 వైవిధ్యమైన మొక్కలు, ఎనిమిది రకాల చెట్లు, 27 రకాల పక్షి జాతులు ఈ పర్వత శ్రేణుల్లో నిక్షిప్తమై ఉన్నాయి.
ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఇలా...
దట్టమైన పొదలు, జలపాతాలు, అటవీ లోయలు, శిఖరాలు, గుహలు.. ఇవన్నీ ఒక్క చోట ఉంటే.. ఆ ఊహే ఎంతో అద్భుతంగా ఉంది కదా.. ఇలాంటి దృశ్యాలు ఆస్ట్రేలియాలో కనిపిస్తాయి. ప్రపంచంలో హెరిటేజ్ ప్రాంతాల్లో ఒక్కటైన బ్లూ మౌంటైన్స్ పర్వత శ్రేణులు. త్రి సిస్టర్స్‌గా ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతంలో ఇలాంటి సుందర ప్రదేశాలకు కొదువలేదనే చెప్పొచ్చు. ఆదివాసీల చరిత్ర ప్రకారం.. మీహ్ని, విమ్లా, గున్నెడో అనే ముగ్గురు అక్కచెల్లెళ్లు ప్రజలకు రక్షణగా రాయి మాదిరిగా మారారని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. బ్లూ మౌంటైన్స్ ఎత్తు 3,024 అడుగులు.
బల్లలా కనిపిస్తుందని..
దక్షిణాఫ్రికా రాజధాని కేప్‌టౌన్ నుంచి చూస్తే టేబుల్ మౌంటైన్ ఎంత అందంగా కనిపిస్తుందో మాటల్లో చెప్పలేం. దాని ఆకారం అచ్చం బల్లలానే ఉంటుంది. కాబట్టే దానికి ఆ పేరు వచ్చిందేమో అనిపిస్తుంది. టేబుల్ మౌంటైన్ సుమారుగా 200 మిలియన్ల సంవత్సరాల పురాతమైందిగా చరిత్రకారులు పేర్కొంటారు. 16వ శతాబ్దంలోనే పోర్చుగీసు అన్వేషకుడు ఆంటానియో డి సల్డాన అధిరోహించాడు.
ధోర్ పీక్, బఫిన్ మౌంటైన్స్, కెనడా
ఆయువటక్ నేషనల్ పార్క్ పరిసర ప్రాంతంలో మౌంట్ ధోర్ (ధోర్ పీక్) ఉంది. ఈ పర్వతానికి గాడ్ ఆఫ్ థండర్‌గా పిలిచే ధోర్ పేరును చరిత్రకారులు పెట్టారు. ధోర్ పర్వతారోహణ ఎంతో కష్టసాధ్యమైంది. నిలువగా ఉండే మౌంటైన్‌ను ఎక్కడమంటే సామాన్యమైన విషయం కాదు. 5,500 అడుగుల ఎత్తయిన పర్వతాన్ని 1985లో అమెరికాకు చెందిన నలుగురు పర్వతారోహుల బృందం ఎంతో కష్టపడి 33 రోజుల్లో ఎక్కి చరిత్ర సృష్టించింది. 4,100 అడుగుల ఎత్తయిన శిఖరం అంచును తాకాలంటే పెద్ద సాహసం చేయాల్సిందే.
మౌంట్ సినాయ్: రహస్య పర్వతం..
భూమి మీద అంతుచిక్కని పర్వతాల్లో మౌంట్ సినాయ్ ఒకటి. దీనికి జబల్ ముసా అని కూడా పిలుస్తారు. ఈజిప్ట్‌లోని సినాయ్ పెనిన్‌సుల వద్ద ఈ పర్వతం ఉంది. బైబికల్ మౌంట్ సినాయ్‌గా అక్కడి స్థానికులు అభివర్ణిస్తారు. యూదు, క్రిస్టియన్, ఇస్లామిక్ మతాలకు సంబంధించి పవిత్ర స్థలాల్లో ఇదొకటిగా భావించడం విశేషం. మోషే పది ఆజ్ఞలను ఇక్కడి నుంచే పొందినట్లు బైబిల్‌లో ఉంది. మౌంట్ సినాయ్ పర్వతం ఎత్తు 7,496 అడుగులు.
జగ్స్‌పిట్జ్, జర్మనీ
జర్మనీలో అత్యంత ఎత్తయిన పర్వతం జగ్స్‌పిట్జ్. దీని ఎత్తు 9,717 అడుగులు. వెట్టర్‌స్టైన్ పర్వత శ్రేణిలో ఒక భాగమైన జగ్స్‌పిట్జ్ ఆస్ట్రియా-జర్మనీ సరిహద్దులో ఉంటుంది. ఇరు దేశాల సరిహద్దు వద్ద చెక్‌పాయింట్ ఉంటుంది. పర్వతం అధిరోహణకు ప్రత్యేక వాహనాలు అందుబాటులో ఉన్నాయి. నాలుగు దేశాలు జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఇటలీలోని 400 శిఖరాలను వీక్షించేందుకు అక్కడి ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి.
పది శిఖరాల మధ్యలో సరస్సు..
వరుసగా పది శిఖరాలు, లోయలతో రమణీయంగా ఉండే ప్రదేశం కెనడాలోని అల్బెర్టాలో వ్యాలీ ఆఫ్ టెన్ పీక్స్. అంతేకాకుండా ఎంతో ప్రసిద్ధిగాంచిన మరైన్ సరస్సు శిఖరాల మధ్య ఉండటం మరో విశేషం. పది శిఖరాల్లో ఎత్తయిన డెల్టాఫామ్ మౌంటైన్, మౌంట్ టుజో, టొన్సా ఉన్నాయి. పది శిఖరాలకు గౌరవసూచికగా 1969, 1979 సంవత్సరాల్లో విడుదల చేసిన కెనడా 20 డాలర్ల నోటు వెనుకవైపు ముద్రించడం గమనార్హం. వ్యాలీ ఆఫ్ ది టెన్ పీక్స్ ఎత్తు దాదాపు 11,234 అడుగులు.
ఆ తెగకు ఎంతో పవిత్ర స్థలం.. మౌంట్ కుక్
ఎన్నో ప్రకృతి వింతలకు, అందాలకు పెట్టింది పేరు న్యూజిలాండ్. మౌంట్ కుక్ పర్వతం కూడా దీనికి మినహాయింపు కాదు. దేశంలో అత్యంత ఎత్తయిన పర్వతం మౌంట్ కుక్ (12,217 అడుగులు)కు ఆ పేరును ఇక్కడే స్థిరపడిపోయిన యూరోపియన్లు పెట్టారని చరిత్ర చెబుతోంది. అయితే స్థానిక మౌరి తెగ పరిభాషలో మాత్రం ‘ఔరాకి’ అని సంబోధిస్తారు. తమ పూర్వీకుల నుంచి అత్యంత పవిత్రమైన స్థలంగా మౌంట్ కుక్‌ను అక్కడి ప్రజలు పూజిస్తారు.
ఇంద్రధనస్సు లాంటి పర్వత శ్రేణి.. ‘వినికుంకా’
బాగా ఎండ వచ్చి ఒక్కసారిగా వర్షం పడేలా ఉన్న సమయంలో ఆకాశమంతా ఇంద్ర ధనస్సులా మారుతుందో.. అలాంటి అద్భుతం పర్వతశ్రేణిలో నిత్యం మనకు కనిపిస్తుంటే ఎలా ఉంటుందో ఓ సారి ఊహించుకోండి. అలాంటి అనుభూతి పెరులోని ‘వినికుంకా’ పర్వతం చూసినప్పుడు కలుగుతుందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రకృతి గొప్పదనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కృత్రిమంగా తయారు చేసినట్లు కాకుండా వివిధ రంగుల బ్యాండ్స్ పరుచుకున్నాయా అన్నట్లు ఉండే అలాంటి సుందర దృశ్యాలు చూస్తే కాని తనివి తీరదు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇలా రంగు రంగుల బ్యాండ్స్ ఎల్లవేళలా కనిపించకపోవడం విశేషం. వినికుంకా పర్వతశ్రేణి ఎత్తు 17,100 అడుగులు.
-ఇంటర్నెట్ డెస్క్, ఈనాడు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
KTR: తెలంగాణకు ఏమీ ఇవ్వని మోదీ మనకెందుకు: మంత్రి కేటీఆర్
-
India News
Immunity boosting: మళ్లీ కరోనా కలకలం.. ఈ ఫుడ్‌తో మీ ఇమ్యూనిటీకి భలే బూస్ట్!
-
Movies News
Anushka Sharma: పన్ను వివాదంలో లభించని ఊరట.. అనుష్క శర్మ పిటిషన్ కొట్టివేత
-
Sports News
Cricket: అత్యంత చెత్త బంతికి వికెట్.. క్రికెట్ చరిత్రలో తొలిసారేమో!
-
General News
Telangana News: రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు