లాక్‌డౌన్‌ తర్వాత వస్తా అన్నాడు.. ఇంతలోనే!

అతనికి పెళ్లై ఏడు నెలలే అయ్యింది. లాక్‌డౌన్‌ తర్వాత ఇంటికి వస్తానంటూ తన బామ్మతో ఎంతో సంతోషంగా చెప్పాడు. ఇంతలోనే ఊహించని ఉపద్రవం అతన్ని కానరాని లోకాలకు వెళ్లేలా చేసింది. భారత్‌-చైనా సరిహద్దు వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకున్న ఉద్రిక్తతలో వీర మరణం పొందిన ఓ సైనికుడి కథ ఇది....

Updated : 18 Jun 2020 15:30 IST

భోపాల్‌: అతనికి పెళ్లై ఏడు నెలలే అయ్యింది. లాక్‌డౌన్‌ తర్వాత ఇంటికి వస్తానంటూ తన బామ్మతో ఎంతో సంతోషంగా చెప్పాడు. ఇంతలోనే ఊహించని ఉపద్రవం అతన్ని కానరాని లోకాలకు తీసుకువెళ్లింది. భారత్‌-చైనా సరిహద్దు వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకున్న ఉద్రిక్తతలో వీర మరణం పొందిన ఓ సైనికుడి కథ ఇది. సరిహద్దుల్లో చైనా దళాలతో వీరోచితంగా పోరాడుతూ 20 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. ఆ ఘర్షణలో మధ్యప్రదేశ్‌లోని రీవాకు చెందిన దీపక్‌ కుమార్‌ సింగ్‌ వీర మరణం పొందాడు. దీపక్‌ మృతితో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. 
దీపక్‌ కుమార్‌ తల్లి కొన్నేళ్ల క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి అతను తన బామ్మ పూల్‌ కుమారి సంరక్షణలో పెరిగాడు. ఈ నేపథ్యంలో దీపక్‌ కుమార్ మరణ వార్త విన్న పూల్‌ కుమారి శోకసంద్రంలోకి వెళ్లిపోయింది. ‘‘నేను కొద్ది రోజుల క్రితం అతనితో ఫోన్‌లో మాట్లాడాను. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత సెలవు తీసుకొని ఇంటికి వస్తానని చెప్పాడు. అయితే అతని మరణవార్త మాకు తెలిసింది. దీపక్‌ అందరితో చాలా ప్రేమగా మాట్లాడేవాడు. ఇంట్లో ప్రతి ఒక్కరినీ గౌరవించేవాడు. అందరూ అతన్ని చాలా ఇష్టపడేవారు’’ అంటూ పూల్‌ కుమారి కన్నీటి పర్యంతమయ్యారు. దీపక్‌ కుమార్‌కు 2019 నవంబర్‌ 30న వివాహమైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దీపక్‌ భార్య రేఖా సింగ్‌ మధ్యప్రదేశ్‌లోని ఓ పాఠశాలలో పనిచేస్తున్నట్లు చెప్పారు. దీపక్‌ కుమార్‌ పార్థివదేహం గురువారం స్వగ్రామానికి చేరుతుందని ఆర్మీ అధికారులు చెప్పినట్లు వారు వివరించారు. 
దీపక్‌ కుమార్‌ది  రైతు కుటుంబం. 2013లో సైన్యంలో చేరాడు. వాళ్ల పెద్ద అన్నయ్య ప్రకాశ్‌ కూడా ఆర్మీలోనే పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ప్రకాశ్‌ రాజస్థాన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని