రెచ్చగొట్టేందుకే 3 రాజధానుల అంశం: జయదేవ్‌

రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టేందుకే మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వం మళ్లీ తెరపైకి తీసుకొచ్చిందని తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌ ఆరోపించారు. అమరావతి..

Published : 19 Jun 2020 01:29 IST

అమరావతి: రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టేందుకే మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వం మళ్లీ తెరపైకి తీసుకొచ్చిందని తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌ ఆరోపించారు. అమరావతి కోసం పోరాడినందుకు గతంలో తనను అరెస్టు చేసినట్లే.. ఇప్పుడు తమ నేతలను కేసుల పేరుతో వేధిస్తున్నారని విమర్శించారు. విపక్ష నేతలను చంపడమొక్కటే మిగిలిందని వ్యాఖ్యానించారు. ‘ఈటీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ రాజకీయాలు సహా దేశవ్యాప్త లాక్‌డౌన్‌, భారత్‌- చైనా సరిహద్దు వివాదం వంటి పలు అంశాలపై ఆయన మాట్లాడారు.

‘‘రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం, నేతలు చట్టాన్ని గౌరవించడం లేదు. వైకాపా ప్రభుత్వం ఎంతటి దారుణాలైనా చేస్తుంది. అచ్చెన్నాయుడి అరెస్టు తీరు బాధాకరం. ఆయనను ప్రభుత్వం చాలా దారుణంగా హింసించింది. శస్త్రచికిత్స చేసుకున్న వ్యక్తిని దాదాపు 24 గంటల పాటు ఇబ్బందులకు గురిచేసింది. ఈ ప్రభుత్వానికి న్యాయం, అభివృద్ధి పట్టడం లేదు. ఇప్పటి వరకు ప్రతిపక్షాలను ఎవరినీ చంపలేదు సంతోషం. ఇకముందు అది కూడా చేస్తారేమో. ప్రభుత్వం జవాబుదారీతనం చూపించాల్సిన అవసరం ఉంది’’ అని గల్లా జయదేవ్‌ అన్నారు.

‘‘లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేసింది మనదేశమే. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఆశాజనకంగా లేదు. వనరులు, నిధులు ఉన్నప్పటికీ సరిగా వినియోగించలేదు. లాక్‌డౌన్‌ వల్ల పరిశ్రమలు దెబ్బతిన్నాయి. టర్నోవర్‌ ఎక్కువ ఉన్న సంస్థలకు ఇబ్బందేమీ లేదు. శీతాకాలం పార్లమెంట్‌ సమావేశాలు జరపాలి. సమావేశాలకు తక్కువ మంది హాజరయ్యేలా చూడాలి. గత సమావేశాల్లో ఎలాంటి చర్చలూ జరగలేదు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయలో భారత్‌-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంపై జయదేవ్‌ స్పందిస్తూ.. చైనాకు చాలా దేశాలతో సరిహద్దు వివాదాలు, అంతర్గతంగా ఎన్నో సమస్యలు ఉన్నాయని తెలిపారు. అయితే మనదేశాన్ని చైనా అకారణంగా రెచ్చగొడుతోందని మండిపడ్డారు. చైనా ప్రజల దృష్టిని దారి మళ్లించేందుకే సరిహద్దు వివాదాలు సృష్టిస్తోందని ఆరోపించారు. భారత్‌ వెనకడుగు వేయకూడదని.. గట్టిగా బదులివ్వాల్సిందేనని గల్లా జయదేవ్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని