జవాన్ల త్యాగాలు వృథా కానివ్వం: భదౌరియా

చైనా సరిహద్దులోని గల్వాన్‌ లోయలో దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ల త్యాగాలను వృథా కానివ్వమని వైమానిక దళాధిపతి ఆర్‌కేఎస్‌ భదౌరియా ...

Updated : 20 Jun 2020 10:57 IST

హైదరాబాద్‌: చైనా సరిహద్దులోని గల్వాన్‌ లోయలో దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ల త్యాగాలను వృథా కానివ్వమని వైమానిక దళాధిపతి ఆర్‌కేఎస్‌ భదౌరియా స్పష్టం చేశారు. దుండిగల్‌ ఎయిర్ ఫోర్స్‌ అకాడమీలో నిర్వహించిన పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు భదౌరియా ముఖ్యఅతిథిగా హాజరై.. వైమానిక దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ప్రస్తుతం సరిహద్దుల్లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని తెలిపారు. తదుపరి ఎలాంటి చర్యలకైనా త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.

చైనా బలగాల అనూహ్య దాడిలో మన జవాన్లు ప్రాణాలు కోల్పోయారన్న భదౌరియా... ఎన్ని సవాళ్లు ఎదురైనా దేశ సేవే ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. మెక్‌మోహన్‌ రేఖ వెంట చిన్నపాటి ఘర్షణ తలెత్తినా వెంటనే సహకారమందిస్తామన్నారు. దుండిగల్‌ అకాడమీలో శిక్షణ పొందిన 123 మందిని నేరుగా క్షేత్రంలోకి దింపుతామన్నారు. ఇతర శిక్షణ కేంద్రాల నుంచి కూడా యువసైనికులను సరిహద్దులోకి తరలిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో నూతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగం మరింత అవసరమన్నారు. ఎలాంటి పరిస్థితులు సంభవించినా ఎదుర్కొనే సత్తా మనకు ఉందన్నారు. సరైన సమయంలో తగిన చర్యలు కూడా ఉంటాయని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో పూర్తి అప్రమత్తంగా ఉన్నామని, బలగాలను మోహరించామని వెల్లడించారు. పరిస్థితిపై తమకు సంపూర్ణ అంచనా ఉందని వివరించారు. ఈసందర్భంగా కర్నల్‌ సంతోష్‌బాబు బృందానికి నివాళులర్పించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని