పడుకుని అలా న్యాయమూర్తి ముందుకు..

టీ షర్టు ధరించి, మంచం మీద పడుకుని వర్చువల్ హియరింగ్‌కు హాజరైన ఓ న్యాయమూర్తిని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ‘కనీస కోర్టు మర్యాదలు’ పాటించాలని..

Published : 21 Jun 2020 01:11 IST

మందలించిన ఉన్నత న్యాయస్థానం

దిల్లీ: టీ షర్టు ధరించి, మంచం మీద పడుకుని వర్చువల్ హియరింగ్‌కు హాజరైన ఓ న్యాయవాదిని సుప్రీంకోర్టు మందలించింది. ‘కనీస కోర్టు మర్యాదలు’ పాటించాలని సూచించింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరయ్యే న్యాయవాదులు ‘ప్రదర్శించదగిన’ దుస్తులను మాత్రమే ధరించాలని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే.. హరియాణా రేవారిలోని ఫ్యామిలీ కోర్టులో ఓ కేసు పెండింగ్‌లో ఉంది. ఆ కేసును బిహార్‌ జెహానాబాద్‌లోని కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ జూన్‌ 15న ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ వేసే క్రమంలో ఓ న్యాయవాది టీషర్టు ధరించి, మంచం మీద పడుకుని వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. దీంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేయడంతో సదరు న్యాయవాది క్షమాపణలు కోరారు. ఈ సందర్భంగా జస్టిస్‌ రవీంద్ర భట్ మాట్లాడుతూ.. ‘వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగే కోర్టు విచారణలలో హాజరయ్యే న్యాయవాదులు పద్ధతిగా కనిపించాలి. సమాజం ఇబ్బందిపడే విధంగా వ్యవహరించకూడదు. మంచి దుస్తులు ధరించి, కోర్టు మర్యాదలు పాటించాలి’ అని పేర్కొన్నారు.  

కరోనా మహమ్మారి విజృంభణతో పనితీరును పరిమితం చేసిన సుప్రీం కోర్టు, ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేసులను పరిష్కరిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రాజస్థాన్ హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన బెయిల్ విచారణలో ఒక న్యాయవాది ఇదే తరహాలో హాజరవడంపై ఆ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని