ఇస్లామాబాద్‌లో హిందూ దేవాలయ నిర్మాణం

పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో మొట్టమొదటి హిందూ దేవాలయ నిర్మాణ పనులు మంగళవారం మొదలయ్యాయి. రూ.10 కోట్ల వ్యయంతో..

Published : 24 Jun 2020 17:48 IST

పనులు ప్రారంభించిన పాక్‌ ప్రభుత్వం

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో మొట్టమొదటి హిందూ దేవాలయ నిర్మాణ పనులు మంగళవారం మొదలయ్యాయి. రూ.10 కోట్ల వ్యయంతో పాక్‌ ప్రభుత్వం శ్రీ కృష్ణుడి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించింది. 20 వేల చదరపు అడుగుల్లో ఈ గుడి నిర్మితమవుతోంది. మానవ హక్కుల పార్లమెంటరీ కార్యదర్శి లాల్ చంద్ మల్హి ఆలయ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇస్లామాబాద్‌తోపాటు నగర పరిసర ప్రాంతాల్లో 1947కి పూర్వం పలు హిందూ ఆలయాలు ఉండేవి. కానీ ప్రస్తుతం అవి లేవు. గత రెండు దశాబ్దాలుగా రాజధానిలో హిందువుల జనాభా గణనీయంగా పెరిగింది. దీంతో వారికోసం దేవాలయాలయాలను నిర్మించనున్నాం’ అని తెలిపారు. 

ఈ దేవాలయ నిర్మాణానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని మత వ్యవహారాల శాఖ మంత్రి పీర్ నూరుల్ హక్ ఖాద్రి స్పష్టం చేశారు. ఆలయ నిర్మాణానికి ప్రత్యేక మంజూరుపై ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ చర్చించినట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న ఆలయానికి ఇస్లామాబాద్‌లోని హిందూ పంచాయతీ ‘శ్రీ కృష్ణ మందిర్‌’ అని నామకరణం కూడా చేసింది. క్యాపిటల్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీడీఏ) ఈ గుడికి సంబంధించిన స్థలాన్ని 2017లోనే హిందూ పంచాయతీకి కేటాయించింది. కానీ, సీడీఏ, ఇతర సంబంధిత అధికారుల నుండి సైట్ మ్యాప్, పత్రాల ఆమోదంలో ఆలస్యం జరగడంతో సహా పలు కారణాలతో నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని