తెలంగాణ చిత్తశుద్ధిని శంకించొద్దు: మంత్రి ఈటల

ఆరోగ్య రంగంలో కేరళ, తమిళనాడుతో తెలంగాణ పోటీ పడుతోందని తెలంగాణ ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల గురించి ఆయన మీడియాతో ...

Published : 24 Jun 2020 17:38 IST

హైదరాబాద్‌: ఆరోగ్య రంగంలో కేరళ, తమిళనాడుతో తెలంగాణ పోటీ పడుతోందని తెలంగాణ ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల గురించి ఆయన మీడియాతో మాట్లాడారు. గాంధీ ఆస్పత్రిపై అనవసరంగా బురద జల్లుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత లేనివాళ్లే ఇలా గందరగోళం చేస్తున్నారు... బాధ్యత గలవారైతే సమాజానికి సహకరించాలని మంత్రి కోరారు. ప్రజలందరూ గాంధీ, కింగ్‌ కోఠి సహా మా ఆస్పత్రులకు రండి. ఇతర ఆస్పత్రులకు అవసరం లేదు. ఎంత ఖర్చయినా భరించి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తాం. కరోనా పరీక్షలు, చికిత్సకు ఎంత ఖర్చయినా రాజీపడే పరిస్థితి లేదని మంత్రి ఈటల చెప్పారు.

దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారు

‘‘గాంధీ ఆస్పత్రిలో వేలాదిమందికి ఓపీ సేవలు అందిస్తున్నాం. వందలాది మంది ఇన్‌పేషంట్లకు సేవలు అందిస్తున్నాం. హైదరాబాద్‌లో ఏదో అవుతోందని.. దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రతిష్ఠకు మసిపూసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ చిత్తశుద్ధిని ఎవరూ శంకించొద్దు’’ అని మంత్రి కోరారు. కరోనా లక్షణాలు ఉంటే పీహెచ్‌సీల్లో సంప్రదిస్తే... నమూనాలు సేకరిస్తారని తెలిపారు. అంతేకానీ లక్షణాలు లేకుండా పరీక్షలు చేయించుకోవద్దన్న మంత్రి... డబ్బులు మీవే అయినా పరీక్షలు చేయించుకోవద్దన్నారు.

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడినవారే...

‘‘ప్రభుత్వ వైద్యంలో రూపాయి ఖర్చు లేకుండా అన్ని రకాల సేవలు అందిస్తున్నాం. ప్రజలందరూ ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. కరోనా పాజిటివ్‌ వచ్చిన ఇంటిలోని వాళ్లపై సామాజిక బహిష్కరణ విధించడం సరికాదు. అంతిమసంస్కారాలకు అడ్డుకోవడం సరికాదు. మనం మనుషులమా? కాదా అనేది ఆలోచించుకోవాలి. మృతి చెందిన వ్యక్తుల్లో వైరస్‌ ఉండదని నిపుణులు చెబుతున్నారు’’ అని మంత్రి గుర్తు చేశారు.

బురద జల్లడం సరికాదు...

‘‘మరణించినవారి చరిత్ర తీసుకుంటే ఆరోగ్యవంతులు ఎవరూ లేరు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారే ఎక్కువగా మరణించారు. మూత్రపిండాలు, హృద్రోగులు, ఇతర వ్యాధులు ఉన్నవారే చనిపోతున్నారు. కొవిడ్‌తో చనిపోతే కనీసం చూడటానికి కూడా దగ్గరివాళ్లు కూడా ధైర్యం చేయడం లేదు. కానీ ప్రభుత్వ వైద్యులు మాత్రం సేవలందిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేయడం మంచిది కాదు’’ అని ఈటల తెలిపారు.

త్వరలో టిమ్స్‌ ప్రారంభం...

‘‘నాలుగైదు రోజుల్లో టిమ్స్‌ను ప్రారంభిస్తాం. ఇప్పటికే టిమ్స్‌లో అవుట్‌ పేషెంట్లకు సేవలు అందిస్తున్నాం. పేదలకు కార్పొరేట్‌ స్థాయి కంటే మెరుగైన సేవలు అందించడానికి టిమ్స్‌ ఏర్పాటు చేశాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో టిమ్స్‌ను తీర్చిదిద్దాం. వెయ్యి బెడ్లకు ఆక్సిజన్‌ సౌకర్యం కల్పించాం. 50 పడకలకు వెంటిలేటర్ల సౌకర్యం కల్పించాం. టిమ్స్‌లో పని చేసే వైద్యులు, వైద్య సిబ్బందికి మంచి క్యాంటీను ఏర్పాటు చేశాం’’ అని మంత్రి ఈటల చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని