తెలంగాణ గరీబోళ్ల రాష్ట్రం కాదు: కేసీఆర్‌ 

తెలంగాణ గరీబోళ్ల రాష్ట్రం కాదు.. 100 శాతం ధనిక రాష్ట్రమేనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో మొక్కలు నాటి ఆరోవిడత హరితహారం కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. 630 ఎకరాల్లో ఏర్పాటు చేసిన అర్బన్‌ ఫారెస్టు పార్కును

Published : 26 Jun 2020 00:19 IST

నర్సాపూర్‌: తెలంగాణ గరీబోళ్ల రాష్ట్రం కాదు.. 100 శాతం ధనిక రాష్ట్రమేనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో మొక్కలు నాటి ఆరోవిడత హరితహారం కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. 630 ఎకరాల్లో ఏర్పాటు చేసిన అర్బన్‌ ఫారెస్టు పార్కును సీఎం ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ...  ‘‘92 వేల ఎకరాల అడవిని పోగొట్టుకున్నాం. సినిమా షూటింగ్‌ల కోసం నర్సాపూర్‌ అటవీప్రాంతాన్నే ఎంపిక చేసుకునేవారు. గతంలో నర్సాపూర్‌ అడవుల్లో చాలా సినిమాల షూటింగ్‌లు జరిగాయి. సమష్టి కృషితోనే నర్సాపూర్‌ అటవీ ప్రాంతానికి పునరుజ్జీవం కలుగుతుంది. అడవులు ఉన్నజిల్లా మెదక్‌.. అడవులను కాపాడుకునే బాధ్యత అందరిపై ఉంది. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కథానాయకులు కావాలి.  ప్రజల నుంచి సహకారం కోరుతున్నా.  ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు ఇవ్వాలి. నాటిన ప్రతి మొక్కకు కుటుంబ సభ్యుల పేర్లు పెట్టాలి. సామాజిక అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. నాటిన మొక్కలు రక్షించేందుకు ట్యాంకర్లు ఇచ్చాం. ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేసిన ప్రత్యేక రాష్ట్రం  దేశంలో తెలంగాణ ఒక్కటే’’ అని సీఎం వివరించారు.

కలప దొంగలపై కఠిన చర్యలు.. 

 ‘‘కలప దొంగలను క్షమించే ప్రసక్తేలేదు. కలప స్మగ్లర్ల ఆటకట్టించేందుకు ఇంటెలిజెన్స్‌లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశాం. అడవులను స్మగ్లర్లకు అప్పగించిన పార్టీలే మళ్లీ విమర్శలు చేస్తున్నాయి. మిషన్‌ భగీరథ నీళ్లు వస్తాయంటే ఎవరూ నమ్మలేదు. దేశంలో 55 శాతం ధాన్యం తెలంగాణలోనే పండింది. సాగునీరు, రైతుబంధు సాయంతో రైతుల్లో ధైర్యం వచ్చింది. హైదరాబాద్‌లో ఉన్నవాళ్లు మళ్లీ గ్రామాల వైపు చూస్తున్నారు. రైతు బాగుపడితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. సంకల్పం ఉంటే అన్నీ సమకూరుతాయి. రైతులు సంఘటితమైతే అద్భుతశక్తిగా ఎదుగుతారు. నేను మొండి వాణ్ని.. అనుకుంటే పట్టుబడతా.. సాధిస్తా’’ అని సీఎం తెలిపారు.

నియంత్రిత సాగుతో అద్భుత ఫలితాలు..

‘‘రైతు పండించిన పంటకు మద్దతు ధర రైతుకే దక్కాలి. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలనే సాగు చేయాలి. నియంత్రిత సాగుతో అద్భుత ఫలితాలు వస్తాయి. తెలంగాణ వ్యవసాయం గురించి దేశమంతా చెప్పుకోవాలి. లాక్‌డౌన్‌ వల్ల ఆదాయం లేకపోవడంతో సగం వేతనాలు ఇచ్చాం. ఇప్పుడు మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నాయి.  విద్యుత్‌ సమస్య పరిష్కరించాం.. ఇక ముందు తెలంగాణలో విద్యుత్‌ సమస్య పునరావృతం కానివ్వం. మెదక్‌ జిల్లాలోని గ్రామాలకు రూ.20లక్షల చొప్పున, ఏడు మండల కేంద్రాలకు రూ.కోటి చొప్పున మంజూరు చేస్తున్నా. గ్రామాలకు పూర్వ వైభవం రావాలి’’ అని సీఎం కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు