Updated : 27 Jun 2020 19:10 IST

కష్టాల కడలి దాటి.. కల నిజం చేసుకొని!

ఆమె జీవితం యువతులకు ఆదర్శం

ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో సాధించాలన్న లక్ష్యముంటుంది. దాన్ని సాధించడం కోసం ఎంతో కష్టపడతారు. అదే మహిళల విషయానికొస్తే.. చాలా మంది కలలు కల్లలుగానే మిగిలిపోతుంటాయి. పురుషాధిక్య సమాజంలో తమ కలను నెరవేర్చుకునే మహిళలు తక్కువనే చెప్పాలి. అలాంటి వారిలో రీతూ రథి తనెజా ఒకరు. గుర్గావ్‌లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రీతూ.. పైలట్‌ అవ్వాలని చిన్నతనంలో ఏర్పరచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంతోపాటు.. 30లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్న పాపులర్‌ యూట్యూబర్‌గా ఎదిగింది. భార్యగా.. ఓ బిడ్డకు తల్లిగా వ్యక్తిగత జీవితాన్ని తాను కోరుకున్నట్లుగా ఆస్వాదిస్తున్న రీతూకు ఇవన్నీ అంత సులువుగా దక్కలేదు. చిన్నతనం నుంచి ఎన్నో ఆట్లుపోట్లు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకుంది. సాటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రీతూ తన విజయ గాథ పంచుకున్నారు.

రీతూని ఉన్నత చదువులు చదవించకుండా పెళ్లి చేసి పంపించమని ఆమె తల్లిదండ్రులకు బంధువులు పదే పదే చెప్పేవారట. అయినా రీతూను బాగా చదివించాలని ఆమె తల్లిదండ్రులు భావించారు. పాఠశాలలో చదువుకునే సమయంలోనే ఓ స్నేహితురాలు పైలట్‌ అవ్వమని సలహా ఇచ్చిందట.. దీంతో పైలట్‌ అవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్న రీతూ.. చదువుపై మరింత శ్రద్ధ పెట్టింది. ఈ క్రమంలో అమెరికాలో పైలట్‌ శిక్షణకు రీతూ దరఖాస్తు చేసుకుంది. అయితే అంతదూరం అమ్మాయిని ఒక్కదాన్నే పంపడానికి ఆమె తల్లిదండ్రులు ఇష్టపడలేదు. డబ్బు కూడా బాగా ఖర్చవుతుందని వెనకడుగు వేశారు. కానీ వారికి రీతూనే ధైర్యం చెప్పింది. తన పెళ్లి కోసం దాచిన డబ్బును తన చదువు కోసం ఖర్చు పెట్టమని కోరింది. ఏదో ఒక రోజు వారు గర్వించే విధంగా చేస్తానని మాటిచ్చింది. 

ఆశలకు గండిపడింది..

కానీ, బంధువులు వారిని సూటిపోటి మాటలన్నారు. రీతూను విదేశాలకు పంపిస్తే తను మగవారితో కలిసి తిరుగుతుందని, చెడిపోతుందని.. పెళ్లి చేసి పంపించేయండని సలహాలిచ్చారు. అయినా రీతూపై నమ్మకంతో తల్లిదండ్రులు ఆమెను శిక్షణ కోసం అమెరికాకు పంపించారు. ఏడాది శిక్షణ అనంతరం రీతూ భారత్‌కు తిరిగొచ్చింది. కానీ ఇక్కడ తను అనుకున్నట్లు జరగలేదు. ఎంత ప్రయత్నించినా పైలట్‌ ఉద్యోగాలు ఖాళీ లేకపోవడంతో ఉద్యోగం లభించలేదు. దీంతో మళ్లీ బంధువుల వెక్కిరించడం మొదలుపెట్టారు. తాము చెప్పినట్లుగా ‘పెళ్లి చేసి పంపిస్తే సరిపోయేది.. ఇప్పుడు చూడు ఏం జరిగిందో’ అంటూ ఎగతాళి చేశారు. 

అప్పులు చేస్తూ కాలం వెళ్లదీసి..

రీతూకు మరో కష్టం వచ్చిపడింది. తనకు అండగా నిలిచిన తల్లి.. మెదడు సంబంధిత వ్యాధితో కన్నుమూసింది. తండ్రి కుంగిపోయాడు. ఆర్థికంగానూ కష్టాలు మొదలయ్యాయి. అప్పులు చేస్తూ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటి నుంచి గట్టెక్కాలని భావించిన రీతూ ఉద్యోగ పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల కోసం బాగా చదువుకుంది. అలా తన కష్టం ఫలించి ఓ ఎయిర్‌లైన్స్‌లో కో-పైలట్‌గా ఉద్యోగం సంపాదించింది. నాలుగు నెలల్లో 60కిపైగా విమానాలు నడిపి తక్కువ కాలంలోనే పైలట్‌గా ప్రమోషన్‌ పొందింది. ఆ నిమిషంలో ‘నాకూ మంచి రోజులు వచ్చాయి’ అని అనుకున్నా అని రీతూ ఆ మధుర క్షణాన్ని గుర్తుచేసుకుంది.

వృత్తి.. చిన్న కుటుంబం.. సరదాలు!

తన వృత్తిలో భాగంగా కలసిన మరో పైలట్‌నే రీతూ ఇష్టపడి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వారిద్దరికీ రెండేళ్ల పాప. చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అన్నట్లు ఎంతో సంతోషంగా వారి జీవితం సాగుతోంది. వృత్తి, వ్యక్తిగత జీవిత విశేషాలు.. సరదాలు ఇతరులతో పంచుకోవడం కోసం వారిద్దరూ కలిసి యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఛానెల్‌కు 30లక్షల మంది సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు. ‘‘నా కూతురు కెప్టెన్‌ అని మా నాన్న చెప్పుకొంటున్న ప్రతిసారీ నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. నేను కేవలం కెప్టెన్‌నే కాదు, యూట్యూబర్‌ని, భార్యని, ఓ తల్లిని నేను చేసే, చేయగలిగే పనులపై ఎవరు పరిమితులు విధించలేరు’’అని రీతూ రథి తనెజా ఎంతో గర్వంగా.. ఆత్మవిశ్వాసంతో చెబుతోంది. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts