కోడిగుడ్లతో గిన్నిస్‌ రికార్డు కొట్టాడు

మీ చేతికి కోడి గుడ్లను ఇస్తే ఏం చేస్తారు?అమ్లెట్‌ వేసుకోవడమో.. కూరలో వేసుకోవడమో చేస్తారు? లేదా గుడ్డు సొనతో..

Updated : 08 Dec 2022 16:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మీ చేతికి కోడి గుడ్లను ఇస్తే ఏం చేస్తారు?అమ్లెట్‌ వేసుకోవడమో.. కూరలో వేసుకోవడమో చేస్తారు? లేదా గుడ్డు సొనతో జుట్టుకు, ముఖం కోసం చేసే సౌందర్య సాధనాల్లో ఉపయోగిస్తారు. కానీ యమెన్‌కు చెందిన ఓ కుర్రాడు.. ఆ గుడ్లతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు కొట్టాడు. అదెలగబ్బా అనుకుంటున్నారా? అయితే అతడి రికార్డు గురించి తెలుసుకుందాం పదండి..

ఇటీవల మలేషియాలోని కౌలాలంపూర్‌లో నిర్వహించిన గిన్నిస్‌ రికార్డు కార్యక్రమంలో 21ఏళ్ల  మహ్మద్‌ ముక్బుల్‌ కోడి గుడ్లు కిందపడకుండా ఒకదానిపై మరొకటి మొత్తం మూడు కోడిగుడ్లను నిలబెట్టాడు. దీంతో అత్యధిక కోడి గుడ్లను పడకుండా నిలబెట్టిన వ్యక్తిగా ముక్బుల్‌ను గుర్తిస్తూ గిన్నిస్‌ రికార్డు సంస్థ సర్టిఫికెట్‌ ఇచ్చింది. చూడటానికి చాలా సులభంగా అనిపించినా.. కొంచెం గుండ్రంగా ఉండే వస్తువులను ఒకదానిపై ఒకటి నిలబెట్టడం కష్టమైన పని. కావాలంటే మీరూ ట్రై చేయండి. అది దాదాపు అసాధ్యం. ఇలా వస్తువులను ఒకదానిపై ఒకటి పెట్టాలంటే  ప్రతి వస్తువుకు సంబంధించిన బరువు కేంద్రాన్ని గుర్తించగలగాలి. అలా అన్ని వస్తువుల బరువు కేంద్రాన్ని గుర్తించి కిందపడకుండా వాటిని నిలబెట్టాలి. ఇందుకోసం ఎంతో ఏకాగ్రత.. సహనం కావాలి. వాటిని ముక్బుల్‌ ప్రదర్శిస్తూ మూడు కోడిగుడ్లను ఒకదానిపై ఒకటి పేర్చి రికార్డు సాధించాడు. 

ఆరేళ్ల వయసు నుంచి ముక్బుల్ వస్తువులను బ్యాలెన్స్‌ చేస్తూ ఒకదానిపై మరొకటి పేర్చేవాడట. 15 ఏళ్ల వయసు వచ్చాక దీనిని బాగా ప్రాక్టీస్‌ చేయడం మొదలుపెట్టాడు. రాళ్లు.. సెల్‌ఫోన్లు, నాణేలు ఇలా ఏ వస్తువునైనా ఒకదానిపై మరొకదాన్ని నిలబెడుతూ ఆ వీడియోలను సోషల్‌మీడియోలో పోస్టు చేసేవాడు. ముక్బుల్‌ ప్రతిభకు నెటిజన్లు కూడా ఫిదా అయ్యారు. అయితే తన ప్రతిభను ప్రపంచం గుర్తించాలన్న ఉద్దేశంతో గిన్నిస్‌ రికార్డు సాధించాలని భావించాడు. ఈ మేరకు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుకు దరఖాస్తు చేసుకోవడంతో స్పందించిన సంస్థ ఇటీవల కార్యక్రమం నిర్వహించి ముక్బుల్‌ ప్రతిభను గుర్తించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని