పీవీ శతజయంతి: పవన్‌ ఏమన్నారంటే

‘‘సరళీకృత ఆర్ధిక విధానాల ద్వారా పీవీ నరసింహారావు దేశాన్నిస్వావలంబన వైపు మళ్లించిన తీరు, క్లిష్ట సమయంలో ప్రధానిగా భాద్యతలు చేపట్టి ప్రభుత్వాన్ని నడిపిన విధానం అద్భుతం’’

Updated : 27 Jun 2020 20:01 IST

అమరావతి: ‘‘సరళీకృత ఆర్ధిక విధానాల ద్వారా పీవీ నరసింహారావు దేశాన్నిస్వావలంబన వైపు మళ్లించిన తీరు, క్లిష్ట సమయంలో ప్రధానిగా భాద్యతలు చేపట్టి ప్రభుత్వాన్ని నడిపిన విధానం అద్భుతం’’ అంటూ పీవీ నరసింహారావును జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌  కొనియాడారు. ఆదివారం పీవీ నరసింహారావు శతజయంతి సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను సంవత్సరంపాటు నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టిపెట్టిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావుకి అభినందనలు తెలియజేశారు. 

‘‘భారత జాతి గర్వించదగిన తెలుగు ముద్దు బిడ్డ పీవీ నరసింహారావు... భారతరత్న పురస్కారానికి అర్హుడు. స్వాతంత్ర్య ఉద్యమకారునిగా, తెలంగాణ విముక్తి పోరాట యోధునిగా, 17 భాషలపై పట్టు ఉన్న భాషాకోవిదునిగా, రాజనీతిజ్ఞుడుగా, పాత్రికేయునిగా, కవిగా, రచయితగా, న్యాయకోవిదునిగా... ఇలా ఇన్ని సలక్షణాలు కలిగిన వారు బహు అరుదుగా ఉంటారు. అందులో పీవీ అగ్రగణ్యులు’’ అని పవన్‌ అన్నారు.

పదవులకు వన్నె తెచ్చారు...

‘‘మౌనంగా ఉంటూనే సమస్యలకు పరిష్కారం చూపే ఆయన ప్రజ్ఞ ఊహలకు అందనిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగానే కాదు... లెక్కకుమిక్కిలి  పదవులను అధిరోహించిన పీవీ... ఆ పదవులకు వన్నె తీసుకువచ్చి వాటికి ఔన్నత్యాన్ని తెచ్చిపెట్టారు. ప్రధాని పీఠాన్ని అధిరోహించిన తొలి తెలుగు బిడ్డగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి జయంతి సందర్బంగా నా తరఫున, జనసేన పార్టీ తరఫున నీరాజనాలు అర్పిస్తున్నాను’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని