పీవీ మన తెలంగాణ ఠీవీ: కేసీఆర్‌

360 డిగ్రీల వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి పీవీ..ఆయన మన తెలంగాణ ఠీవీ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు

Updated : 24 Sep 2022 15:20 IST

హైదరాబాద్‌: 360 డిగ్రీల వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి పీవీ..ఆయన మన తెలంగాణ ఠీవీ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘పీవీ నరసింహారావు నిరంతర సంస్కరణశీలి. సంస్కరణాభిలాషికి నిలువెత్తు నిదర్శనం. తన ఆస్తిని ప్రభుత్వానికి అప్పగించి సంస్కరణ శీలిగా నిలిచారు. ఏ రంగంలో ఉంటే  ఆరంగంలో సంస్కరణలు తెచ్చారు. విద్యాశాఖ పేరును హెచ్‌ఆర్‌డీగా మార్చింది ఆయనే. ఆయన ఒక డిప్లొమాట్‌, సంగీతంలోనూ ప్రవేశం ఉంది. సైన్స్‌, ఆస్ట్రానమీ రంగాల పట్ల కూడా పీవీకి చాలా ఆసక్తి ఉంది. 14 భాషలు అనర్గళంగా మాట్లాడగలిగే గొప్ప వ్యక్తి పీవీ. ఆయనను ఆదర్శంగా తీసుకుని అందరూ ముందుకెళ్లాలి’’ అని కేసీఆర్‌ సూచించారు.

పీవీ రాజకీయ ప్రస్థానంలో కుల, ధన బలం పార్శ్వమే లేదని వివరించారు. కుల, ధన బలం లేకుండానే ఆయన.. సీఎం, ప్రధాని అయ్యారని గుర్తు చేశారు. వాక్‌శుద్ధి, చిత్తశుద్ధి కలిగిన గొప్ప వ్యక్తి అని సీఎం కొనియాడారు. నిరంతర విద్యార్థి.. అధ్యయనశీలి.. సామాజిక దృక్పథం గల వ్యక్తి అని పేర్కొన్నారు. పీవీ ఆశయాల మేరకు రాష్ట్రంలో 900 గురుకులాలు ఏర్పాటు చేశామని తెలిపారు. నెహ్రూకు సమాంతర వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి పీవీ అని వెల్లడించారు. ఆయన శతజయంతి ఉత్సవాలు 51 దేశాల్లో జరుగుతున్నాయని కేసీఆర్‌ తెలిపారు.

సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, తెరాస పార్లమెంటరీ పక్ష నేత కేశవరావు, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, పీవీ కుమారుడు ప్రభాకర్‌రావు, కుమార్తె వాణీదేవి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

పీవీ శతజయంతి వార్తల కధనం  కోసం క్లిక్‌ చేయండి

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని