ఈ స్టోర్‌ కొవిడ్‌-19 ప్రత్యేకం!

కరోనా(కొవిడ్‌ 19) వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ప్రజల్ని అన్ని విధాల ఇబ్బంది పెడుతోంది. దీని బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు మాస్కులు, శానిజైజర్లు, డిసిన్పెక్టర్స్‌ను వాడుతున్నారు. సాధారణంగా సర్జికల్‌మాస్కులు, శానిటైజర్లు మెడికల్‌ షాపుల్లో, డిజైన్‌మాస్కులు బట్టల

Published : 03 Jul 2020 13:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా(కొవిడ్‌ 19) వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ప్రజల్ని అన్ని విధాల ఇబ్బంది పెడుతోంది. దీని బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు మాస్కులు, శానిటైజర్లు, డిసిన్ఫెక్టర్స్‌ను వాడుతున్నారు. సాధారణంగా సర్జికల్‌ మాస్కులు, శానిటైజర్లు మెడికల్‌ షాపుల్లో.. డిజైన్ ‌మాస్కులు బట్టల దుకాణాల్లో అమ్మడం చూస్తున్నాం.. కానీ కరోనా కట్టడికి ఉపయోగించే అన్ని వస్తువులు ఒకే చోట లభించేలా ఫ్లోరిడాలో ఏకంగా కొవిడ్‌ 19 ఎసెన్షియల్స్‌ స్టోర్‌ను ఏర్పాటు చేశారు. 

మియామిలోని ఎవెంచుర షాపింగ్‌ మాల్‌లో ఈ స్టోర్‌ ఏర్పాటైంది. ఇందులో కరోనా దరిచేరకుండా మనం ఉపయోగించే శానిటైజర్లు, డిసిన్ఫెక్టర్స్‌, గ్లౌవ్స్‌, ఫేస్‌ షీల్డ్స్‌, స్మార్ట్‌ఫోన్‌ స్టెరిలైజర్స్‌, థర్మామీటర్స్‌, యూవీ లైట్‌ డివైజెస్‌, షూ కవర్‌ డిస్పోజల్స్‌, సింగల్‌ యూజ్‌ బాడీ కవర్స్‌, మాస్కులు తదితర వస్తువులన్నీ ఇక్కడ లభిస్తాయి. కస్టమర్లకు నచ్చిన డిజైన్లలో డిజైనర్‌ మాస్కులను క్షణాల్లో కుట్టి ఇచ్చేస్తున్నారు. అయితే బయట లభించే వాటి ధర కన్నా ఇక్కడి వస్తువుల ధర ఎక్కువే. 60ఎంఎల్‌ శానిటైజర్‌ ధర రూ.450కు పైగానే ఉంటుంది. సాధారణ ఫేస్‌ మాస్క్ సుమారు‌ రూ.2వేల చొప్పున అమ్ముతున్నారు. కరోనా కోసం ప్రత్యేకంగా ఓ దుకాణం ఏర్పాటు కావడం విశేషంగా కనిపిస్తున్నా.. ఈ స్టోర్‌ ఏర్పాటుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘ఒకవైపు కరోనా వైరస్‌తో లక్షల మంది చనిపోతుంటే.. ఈ సంక్షోభంతో వ్యాపారం చేస్తారా? డబ్బులు సంపాదించడానికి ఇంత నీచంగా వ్యవహరిస్తారా’’అంటూ మండిపడుతున్నారు.

అయితే ఈ విమర్శలను కొవిడ్‌ 19 ఎసెన్షియల్స్‌ స్టోర్‌ యజమాన్యం తోసిపుచ్చింది. ‘‘ప్రస్తుతం కరోనా నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే వస్తువులకు డిమాండ్‌ పెరిగింది. ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర్లు వాడుతున్నారు. అవన్నీ మా స్టోర్‌లో అందుబాటులో ఉంచాం అంతే. ఇంత పెద్ద షాపింగ్‌మాల్‌లో మాది కేవలం ఓ స్టోర్‌. అయినా ప్రజలు వాస్తవాన్ని అర్థం చేసుకుంటున్నారు. అవసరమున్న వాళ్లు కొనుగోలు చేస్తున్నారు. కొనుగోళ్లు కొనసాగినంత కాలం ఈ స్టోర్‌ను నడిపిస్తాం’’అని స్టోర్‌ మేనేజర్‌ బెనిమెట్కీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని