ప్రైవేటు ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు నిలిపివేత

నగరంలోని పలు ప్రైవేటు ల్యాబ్‌లు తాత్కాలికంగా కరోనా పరీక్షలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఇవాళ్టి నుంచి ఈనెల 5వ తేదీ వరకు నాలుగు రోజులపాటు...

Updated : 02 Jul 2020 11:51 IST

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రైవేటు ల్యాబ్‌లు తాత్కాలికంగా కరోనా పరీక్షలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. ఇవాళ్టి నుంచి ఈనెల 5వ తేదీ వరకు నాలుగు రోజులపాటు శాంపిల్స్‌ సేకరణ నిలిపివేస్తున్నట్టు వెల్లడించాయి.

ఐసీఎంఆర్‌ తెలంగాణ వ్యాప్తంగా 18 ప్రైవేటు ల్యాబ్‌లకు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అనుమతిచ్చింది. దీంతో గత 15 రోజుల నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ అధికారుల బృందం ప్రైవేటు ల్యాబ్‌ల కరోనా పరీక్షల నిర్వహణను పరిశీలించి.. లోపాలను గుర్తించింది. 48 గంటల్లో  లోపాలను సవరించు కోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కొన్ని ల్యాబ్‌లు తప్పులను సరిదిద్దుకున్నాయి.

ఈ నేపథ్యంలో... కరోనా శాంపిల్స్‌ సేకరించే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు డిజ్‌ ఇన్‌ఫెక్షన్‌ కోసం నాలుగు రోజుల పాటు స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు నిలిపివేస్తున్నట్టు ప్రైవేటు ల్యాబ్‌లు ప్రకటించాయి. ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బంది శాంపిల్స్‌ సేకరించి పంపిస్తే పరీక్షలు నిర్వహిస్తామని తెలిపాయి. నేరుగా ల్యాబ్‌కు వచ్చి పరీక్షలు చేయించుకేనే అనుమానితుల శాంపిల్స్‌ మాత్రం సేకరించబోమని స్పష్టం చేశాయి. ఈనెల 6 నుంచి తిరిగి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించాయి. దీనికి సంబంధించి వైద్యారోగ్యశాఖ అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని