Updated : 22 Jul 2020 13:34 IST

యుద్ధం జరిగింది 44 నిమిషాలే

చరిత్రలో అతి చిన్న యుద్ధమిది

చరిత్ర తిరిగేస్తే అధికారం కోసం జరిగిన ఎన్నో యుద్ధాలు కనిపిస్తాయి. రాజ్యాల మధ్య, దేశాల మధ్య, కుటుంబసభ్యుల మధ్య ఆధిపత్యం కోసం లక్షలాదిమంది సైనికులతో.. రోజుల తరబడి జరిగిన యుద్ధాల గురించి పుస్తకాల్లో చదివాం, విన్నాం. ఇదంతా ఒకవైపు... మరోవైపు అంటే చరిత్రలోనే అతి చిన్న యుద్ధం గురించి తెలుసా? అయితే ఆ యుద్ధం ఎక్కడ జరిగింది? ఎందుకు జరిగింది? ఎవరు గెలిచారు?

టాంజానియాలోని జంజిబర్‌ నగరం ఒకప్పుడు జంజిబర్‌ సుల్తానేట్‌ పేరుతో స్వతంత్ర రాజ్యంగా ఉండేది. 1896లో ఆగస్టు 25న అప్పటి జంజిబర్‌ సుల్తానేట్‌ సుల్తాన్‌ హమద్‌ బిన్‌ తువైనీ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆయన అప్పటి బ్రిటిష్‌ పాలకులకు మద్దతుగా ఉండేవారు. హమద్‌ బిన్‌ తువైనీ మరణానంతరం రాజ్యానికి చక్రవర్తిగా సుల్తాన్‌ ఖలీద్‌ బిన్‌ బర్గాష్‌ సింహాసనాన్ని అధిష్ఠించాడు. అది బ్రిటిష్‌ అధికారులకు అసలు ఇష్టం లేదు. ఆయనకు బదులు తమకు నమ్మకస్తుడైన హమూద్‌ బిన్‌ మహ్మద్‌ను చక్రవర్తిని చేయాలని భావించారు. దీంతో తమతో జంజిబర్‌ సుల్తానేట్‌ చేసుకున్న ఒప్పందాన్ని అడ్డుపెట్టుకొని ఖలీద్‌ను దింపే ప్రయత్నం చేశారు. ఆ ఒప్పందం ప్రకారం.. చక్రవర్తి చనిపోతే, ఆయన స్థానంలో రాజు అయ్యేవారికి బ్రిటన్‌ అధికారుల అనుమతి ఉండాలి. అనుమతి లేకపోతే రాజు అయ్యే అవకాశముండదు. కానీ ఖలీద్‌ బ్రిటన్‌ నిబంధనలు పట్టించుకోకుండా తానే జంజిబర్‌ చక్రవర్తినని ప్రకటించుకున్నాడు. 

అల్టిమేటం పెట్టి.. యుద్ధానికి దిగి

ఖలీద్‌ చర్యలపై బ్రిటన్‌ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సింహాసనం దిగి.. రాజభవనాన్ని ఖాళీ చేయాలని అల్టిమేటం ఇచ్చారు. ఆ హెచ్చరికల్ని ఖలీద్‌ భేఖాతర్‌ చేశాడు. తన సైన్యాన్ని రాజభవనం ముందు మోహరించాడు. ఆల్టిమేటం సమయం ముగియడంతో ఆగస్టు 27న ఉదయం బ్రిటన్‌ అధికారులు మూడు యుద్ధ నౌకలు, రెండు గన్‌బోట్లు, 150 మెరైన్స్‌, సైనికులతోపాటు బ్రిటన్‌కు మద్దతు పలికే జంజిబర్‌ సైన్యాన్ని ఒక్కచోటుకు చేర్చి యుద్ధానికి సిద్ధమయ్యారు. మరోవైపు ఖలీద్‌ తనకు మద్దతిచ్చే సైనికులతోపాటు రాజభవనంలో పనిచేసే వారిని, ప్రజలను బ్రిటన్‌తో చేసే యుద్ధంలో పాల్గొనమని సూచించాడు. దీంతో ఖలీద్‌ సైన్యం 2,800 మంది అయ్యారు. 

కోటను కూల్చి... ఓడను ముంచి

బ్రిటన్‌కు చెందిన సైన్యం రాజభవనం వద్దకు ఉదయం 9:02 చేరుకొని భవనంపై కాల్పులు జరపడం మొదలుపెట్టింది. దాదాపు భవనాన్ని సగానికిపైగా ధ్వంసం చేసేసింది. ఖలీద్‌ సైన్యం అడ్డుకోవానికి ఎంత ప్రయత్నించినా బ్రిటన్‌ సైన్యం చేతిలో ఓడిపోయింది. మరోవైపు జంజిబర్‌ రాజ్యానికి చెందిన రాయల్‌ ఓడను బ్రిటన్‌ తమ నేవీ సైన్యంతో సముద్రంలో ముంచేసింది. చివరికి భవనంపై ఉన్న పతాకాన్ని దించేసి 9 గంటల 46 నిమిషాలకు యుద్ధాన్ని ముగించింది. అంటే కేవలం 44 నిమిషాల్లోనే ఖలీద్‌ సైన్యాన్ని బ్రిటన్‌ ఓడించింది. ఈ క్రమంలో ఖలీద్‌ సైన్యంలో 500 మంది మృత్యువాతపడ్డారు. బ్రిటన్‌ సైన్యంలో ప్రాణనష్టం జరగలేదు. అయితే ఖలీద్‌ టాంజానియాకు పారిపోతుండగా అతడిని అదుపులోకి తీసుకొన్నారు. వెంటనే హమూద్‌ బిన్‌ను చక్రవర్తిని చేసి జంజిబర్‌ రాజ్యాన్ని తమ ఆధీనంలో ఉండేలా చేసుకున్నారు. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని