
ప్రజలందరి మనిషి.. వైఎస్ఆర్
రేపు ‘నాలో.. నాతో.. వైఎస్‌ఆర్’ పుస్తకావిష్కరణ
అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయలక్ష్మి ‘నాలో.. నాతో.. వైఎస్‌ఆర్’ పుస్తకాన్ని రచించారు. బుధవారం వైఎస్‌ఆర్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో సీఎం జగన్ చేతుల మీదుగా పుస్తకావిష్కరణ జరగనుంది. ఈ మేరకు ప్రతినిధులు పత్రికా ప్రకటన విడుదల చేశారు. మహానేత గురించి ప్రజల నుంచి సమాచారం తెలుసుకున్నానని విజయలక్ష్మి పుస్తకం తొలి పలుకుల్లో తెలిపారు. డాక్టర్ వైఎస్‌ఆర్ ఒక తండ్రిగా, భర్తగా ఎలా ఉండేవారో పుస్తకంలో వివరించారు. నిజ జీవితంలో వైఎస్‌ఆర్ వేర్వురు పాత్రల్లో ఎలా ఉండేవారో, ప్రతి ఒక్కరితో ఎంత ఆత్మీయంగా మెలిగేవారో అందులో పొందుపరిచారు. ప్రతి అడుగు వెనుకా ఉన్న ఆలోచనను, అనుభవాల నుంచి ఆయన నేర్చుకున్న పాఠాలను పుస్తకంలో విశ్లేషించారు. ఇంట గెలిచి రచ్చ గెలిచిన తీరును, ఇంట్లో వారి అవసరాలను అర్థం చేసుకున్నట్లే ప్రజలను కూడా కుటుంబసభ్యులుగా భావించి వారి అవసరాలను తీర్చిన విధానాన్ని వివరించారు.
రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ప్రగతిని కోరుకుని, అన్ని ప్రాంతాల్లో ఇంటింటా అందరికి మేలు చేయబట్టే తమ కుటుంబసభ్యుల్లా వైఎస్ఆర్‌ను ఆదరించారని ముందుమాటలో వైఎస్ విజయలక్ష్మి చెప్పారు. ఆయన్ను ప్రేమించిన తెలుగు ప్రజలందరికీ ఈ పుస్తకాన్ని అంకితం చేస్తున్నట్లు తెలిపారు. తమ వివాహం, ఆనాటి పరిస్థితులు, పేదల డాక్టర్‌గా వైఎస్ఆర్, రాజకీయాల్లోకి రంగ ప్రవేశం, నాయకత్వ లక్షణాలు, పేదల పట్ల కరుణ, రాజకీయాల్లో ఆటుపోట్లు, కుటుంబంలో ఆత్మీయతలు, పిల్లల చదువులు, వివాహాలు, దైవం పట్ల భక్తిశ్రద్ధలు, అందరివాడిగా గడిపిన జీవితం, మహా నేత మరణంతో ఎదురైన పెను సవాళ్లు, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేవరకు జరిగిన పరిణమాలను పొందుపరిచారు. మరణం లేని మహా నేత గురించి, తాను మరణించినా తన పథకాల్లో ఎప్పటికీ జీవించే ఉంటారని పేర్కొన్నారు. తెలుగువారంతా తమ కుటుంబమే అనుకున్న మహానేత గురించి రాబోయే తరాలకు స్పూర్తి ఇవ్వాలనే సత్సంకల్పంతో పుస్తకాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నట్లు విజయలక్ష్మి తెలిపారు. ఈ పుస్తకం ఎమ్మెస్కో పబ్లికేషన్స్ ద్వారా లభ్యమవుతుంది.