వైఎస్‌ఆర్‌కు నివాళులర్పించిన సీఎం జగన్‌

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 71వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి కుటుంబసభ్యులతో ...

Updated : 08 Jul 2020 11:39 IST

కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 71వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి నివాళులర్పించారు. కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ జీవిత విశేషాలతో విజయమ్మ రాసిన ‘నాలో.. నాతో.. వైఎస్‌ఆర్‌’ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు.అనంతరం ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ట్రిపుల్ ఐటీలో  కొత్తగా నిర్మించిన అకాడెమిక్‌ కాంప్లెక్స్‌ భవనాలను జగన్‌ ప్రారంభించారు. ట్రిపుల్‌ఐటీ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.‌

అంతకుముందు వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ సీఎం జగన్‌ ట్విటర్‌లో పోస్టు చేశారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణం లేని మహానేత అని కొనియాడారు. ఆరోగ్య శ్రీ, 104, 108, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రైతులకు ఉచిత విద్యుత్‌, జలయజ్ఞం తదితర పథకాల రూపంలో ప్రజల దృష్టిలో ఆయన ఇంకా జీవించే ఉన్నారని అన్నారు. రైతు పక్షపాతి వైఎస్‌ఆర్‌ జయంతిని రైతుదినోత్సవంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.

రైతు దినోత్సవం సందర్భంగా సీఎం ప్రారంభించే కార్యక్రమాలు

రైతు భరోసా కేంద్రాల్లో(ఆర్‌బీకే) రూ.1,572 కోట్లతో, 65 హబ్‌లవద్ద రూ.78 కోట్ల వ్యవసాయ యంత్రాల ఏర్పాటు.

శ్రీకాకుళం జిల్లా నైరా, తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట, కర్నూలు జిల్లా తంగడంచల్లో రూ.42కోట్ల వ్యయంతో వ్యవసాయ యంత్ర పరికరాల శిక్షణా కేంద్రాల ఏర్పాటు.. ఏడాదికి 1,500 మందికి శిక్షణ.

రైతులకు వ్యవసాయ, అనుబంధ రంగాలపై సమాచారం తెలిపేందుకు డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ రైతు భరోసా మాస పత్రిక.

రైతులకు సలహాల కోసం 155251 టోల్‌ఫ్రీ నంబర్ల పోస్టర్ల ఆవిష్కరణ.

8 చోట్ల చేపల రేవులు, నాలుగు చోట్ల చేపల దిగుమతి కేంద్రాల నిర్మాణానికి నాబార్డు ఆర్థిక సాయంపై అవగాహన ఒప్పందం.

కొత్తగా 1,021 ఆర్‌బీకేల్లో కృత్రిమ గర్భధారణ సేవలు, అధిక పోషక విలువలున్న పశుగ్రాస వంగడాల పరిచయం.

అయిదు చక్కెర కర్మాగారాల పరిధిలోని రైతుల ఖాతాల్లోకి రూ.54.6 కోట్ల బకాయిల జమ.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని