వరుసగా మూడో రోజు 19,000+ రికవరీ

భారత్‌లో కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,20,916కు చేరుకుంది. గత 24 గంటల్లో 27,114 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. అయితే అదే స్థాయిలో కోలుకొని ఇంటికి వెళ్తున్నవారి సంఖ్యా పెరగడం శుభ పరిణామం....

Updated : 11 Jul 2020 13:11 IST

ముంబయి: భారత్‌లో కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,20,916కు చేరుకుంది. గత 24 గంటల్లో 27,114 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. అయితే అదే స్థాయిలో కోలుకొని ఇంటికి వెళ్తున్నవారి సంఖ్యా పెరగడం శుభ పరిణామం.

దేశంలో కొన్ని రోజులుగా వరుసగా 25వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. చివరి మూడు రోజుల్లోనే లక్ష కేసులు అవ్వగా 14 రోజుల వ్యవధిలో ఐదు లక్షల కేసులు వచ్చాయి. కానీ ప్రస్తుతం ఉన్న క్రియాశీల కేసులు 2,83,407 మాత్రమే కావడం గమనార్హం. 5,15,386 మంది కరోనా వైరస్‌ నుంచి విముక్తి పొంది ఇళ్లకు వెళ్లిపోయారు. దాంతో రికవరీ రేటు 62.7 శాతానికి పెరిగింది.

వరుసగా మూడో రోజు 19,000 మందికి పైగా బాధితులు కోలుకోవడం గమనార్హం. గత 24 గంటల్లో 22,123 మంది కోలుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది. 2,38,461 కేసులున్న మహారాష్ట్రలో 1,32,625 మంది మెరుగయ్యారు. చికిత్స పొందుతున్నది 95,943 మందే. తమిళనాడులో 1,30,261 కేసులు నమోదవ్వగా 82,324 మంది వైరస్‌పై విజయం సాధించారు. అక్కడ 46,108 మందే చికిత్స పొందుతున్నారు. దిల్లీలో 1,09,140 కేసులుండగా 84,694 మంది ఇంటికెళ్లిపోయారు. అక్కడ క్రియాశీల కేసులు కేవలం 21,146 మాత్రమే. చికిత్స పొందుతున్న వారి కన్నా మెరుగైన వారి సంఖ్య ఎక్కువగా ఉండటం సానుకూల పరిణామం అని వైద్య వర్గాలు సంతోషిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని