Published : 11 Jul 2020 16:28 IST

సకల హంగుల ఆటో.. ఆనంద్‌ మహీంద్రా ఫిదా!

ఇంటర్నెట్‌డెస్క్‌: మనం నిత్యం వినియోగించే ఆటోల్లో మహా అయితే ఏముంటాయ్‌? పాటల కోసం స్పీకర్లు.. వెలుగులు జిమ్మే లైట్లు.. మహా అయితే వైఫై, ఫ్యాన్‌ వంటి సదుపాయాలు కనిపిస్తాయి. కరోనా మహమ్మారి పుణ్యమా అని ప్రస్తుతం కొవిడ్‌కు ముందు.. తర్వాత అనే పరిస్థితులు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టే నిత్య జీవితంలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇలానే ముంబయికి చెందిన ఓ ఆటో డ్రైవర్‌ తన ఆటోను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్ది ప్రశంసలు అందుకుంటున్నాడు.

కరోనా వైరస్‌ విజృంభణ వేళ ప్రయాణికులకు అవసరమైన అన్ని సదుపాయాలనూ తన ఆటోలో సమకూర్చాడు ముంబయికి చెందిన ఆటో డ్రైవర్‌ సత్యవాణ్ గైట్. ఆహ్లాదాన్ని పంచేందుకు ఓ వైపు మొక్కలు.. తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసేందుకు రెండు డస్టబిన్లు ఉంచాడు. పరిశుభ్రత కోసం హ్యాండ్‌ శానిటైజర్‌, చేతులు కడుక్కోవడానికి ఓ వాష్‌ బేసిన్‌, చిన్నపాటి వాటర్‌ ట్యాంక్‌, హ్యాండ్‌వాష్‌ వంటి సదుపాయాలు కల్పిస్తున్నాడు. ప్రయాణికుల కోసం వైఫై, మొబైల్‌ ఛార్జింగ్‌ పాయింట్‌, మొబైల్‌ కనెక్ట్‌ చేసుకునేందుకు వీలుగా ఓ టీవీ, బ్లూటూత్‌ స్పీకర్లు, తాగేందుకు మంచినీరు, కూలింగ్‌ ఫ్యాన్‌ వంటి సదుపాయాలు అందిస్తున్నాడు.

అంతేకాదు ఆటోకు వెలుపలి భాగంలో కరోనాకు సంబంధించి బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ హెల్ప్‌లైన్‌ నంబర్లు మరాఠీ, ఆంగ్ల భాషల్లో ముద్రించాడు. కరోనాపై పోరాడుతున్న వారియర్స్‌కు ధన్యవాదాలు తెలుపుతూ కొన్ని వాక్యాలు కూడా తన ఆటోపై రాసి వారికి సంఘీభావం తెలుపుతున్నాడు. అంతేకాదు సీనియర్‌ సిటిజన్లకు కిలోమీటర్‌ వరకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం అందిస్తున్నాడు ఈ ఆటో డ్రైవర్‌. స్వచ్ఛభారత్‌ నినాదానికి పెద్దపీట వేస్తూ, ప్రస్తుత పరిస్థితులకు ఆటోను ఈ విధంగా తీర్చిదిద్దడం మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రాను ఆకట్టుకుంది. ట్విటర్‌ వేదికగా ఆయన దీనికి సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. 30వేల మందికి పైగా లైక్‌ చేయగా.. 3 లక్షలకు పైగా ఈ వీడియోను వీక్షించారు.

 


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని