దేశంలోని విభిన్న రైల్వే స్టేషన్లు ఇవీ..!

భారతీయ రైల్వే.. దేశంలో అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ. నిత్యం వందల రైళ్లు కొన్ని లక్షల మంది ప్రయాణికులను ఎక్కించుకొని ఒక చోట నుంచి మొదలై.. వందలు, వేల కిలోమీటర్లు ప్రయాణించి గమ్యస్థానానికి చేరుకుంటాయి. ఈ క్రమంలో ఎన్నో రైల్వే స్టేషన్లు

Updated : 18 Sep 2020 14:26 IST

భారతీయ రైల్వే.. దేశంలో అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ. నిత్యం వందల రైళ్లు కొన్ని లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తాయి. ఈ క్రమంలో ఎన్నో రైల్వే స్టేషన్లు మనకు తారసపడతాయి. అయితే, కొన్ని రైల్వేస్టేషన్లు మాత్రం ప్రత్యేకతను సంతరించుకున్నాయి. వాటిలో కొన్ని అతి పెద్ద రైల్వేస్టేషన్లుగా ఖ్యాతి గడిస్తే.. మరికొన్ని పేరుతో.. వినూత్న సేవలతో.. నేపథ్యంతో వేటికవి భిన్నత్వాన్ని చాటుకుంటున్నాయి. అలాంటి రైల్వే స్టేషన్ల గురించి తెలుసుకుందాం.. పదండి!

సొంతగా స్టేషన్‌ కట్టేశారు

సాధారణంగా రైల్వేస్టేషన్లను ప్రభుత్వం నిర్మిస్తుంటుంది. కానీ హరియాణాలోని గుడ్‌గావ్‌ తాజ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌ను స్థానికులే నిర్మించుకున్నారు. వారి గ్రామానికి రైల్వేస్టేషన్‌ ఏర్పాటు చేయాలని గ్రామస్థులు 25 ఏళ్లు అధికారుల చుట్టూ తిరిగారు. అయినా ఫలితం లేకపోవడంతో వాళ్లే స్టేషన్‌ నిర్మించాలని నిర్ణయించుకున్నారు. చాందాలు వేసుకొని రూ.21 లక్షలు సమకూర్చుకొని స్టేషన్‌ను నిర్మించారు. ఆ తర్వాత రైల్వే అధికారులను సంప్రదించారు. తమ స్టేషన్లో రైళ్లని ఆపాలని విన్నవించుకున్నారు. దీంతో 2010 జనవరి 5 నుంచి తాజ్‌ నగర్‌ రైల్వే స్టేషన్‌ల్లో రైళ్లు ఆగడం మొదలుపెట్టాయి. అలా సొంత ఖర్చుతో తాజ్‌నగర్‌ గ్రామస్థులు ఏర్పాటు చేసుకున్న రైల్వేస్టేషన్‌ అక్కడి చుట్టుపక్కల వారికి కూడా ఉపయోగకరంగా మారింది.


ఆదాయం పెంచడానికి రెండుమూడు టికెట్లు 

రైల్వే నిర్వహణ అంత సులువు కాదు. ఇందుకోసం రైల్వేశాఖ బాగానే ఖర్చు చేస్తోంది. ఆదాయం రాని రైల్వేస్టేషన్ల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. అలాంటి నిర్ణయానికి బలైపోయిన రైల్వే స్టేషనే రషీద్‌పురా ఖోరి. రాజస్థాన్‌లో ఉన్న ఈ రైల్వేస్టేషన్ నుంచి ఆదాయం లేకపోవడంతో 2005లో రైల్వే శాఖ మూసివేసింది. దీంతో స్థానికంగా ఉండే 20 వేల మందిపై ఈ ప్రభావం పడింది. రైల్వే స్టేషన్‌ను తిరిగి ప్రారంభించాలని వారంతా అధికారులను కోరారు. ఎట్టకేలకు 2009లో అధికారులు రైల్వే స్టేషన్‌ తిరిగి ప్రారంభించడానికి ఒప్పుకొన్నారు. కానీ స్టేషన్‌ నుంచి కనీసం మూడు లక్షల ఆదాయం రావాలని షరతు పెట్టారు. దీనికి ఒప్పుకొన్న ఆ గ్రామ ప్రజలు ఆదాయం పెంచడం కోసం ఒక్కొక్కరు రెండు, మూడు టికెట్లు  కొంటున్నారు. ఖర్చులు తగ్గించడం కోసం అక్కడ రైల్వే సిబ్బందికి బదులు గ్రామస్థులే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. 


అత్యంత ఎత్తులో ఉన్న స్టేషన్‌ ఇది

ఘుమ్‌ రైల్వే స్టేషన్‌.. ఇది భారతదేశంలో అత్యంత ఎత్తయిన ప్రాంతంలో ఉన్న స్టేషన్‌. డార్జిలింగ్‌ హిమాలయాల్లో భూమికి 7,407 అడుగుల ఎత్తులో ఈ స్టేషన్‌ ఉంది. దీని నిర్మాణం 1879లో ప్రారంభించి మూడేళ్లలో పూర్తి చేశారు. డార్జిలింగ్‌ లేదా సిలిగురి నుంచి ఘుమ్‌కు రైళ్లో వెళ్తున్నప్పుడు ప్రకృతి అందాలు ప్రయాణికులను కట్టిపడేస్తుంటాయి. పర్యాటకులు ఎక్కువగా ఈ ప్రాంతానికి వెళ్తుంటారు.


రైల్వే స్టేషనా? కోటనా?

పురాతన కాలం నాటి రైల్వే స్టేషన్లు భారీ రాజమహాల్‌లా కనిపిస్తుంటాయి. కానీ ఒడిశాలోని కటక్‌ రైల్వేస్టేషన్‌ మాత్రం ఏకంగా కోట రూపంలో నిర్మించారు. అది 14వ శతాబ్దంలో నిర్మించిన బారామతి కోటను పోలి ఉండటం విశేషం. 


కార్పొరేట్‌ భవనంలో రైల్వే స్టేషన్‌

ముంబయి సమీపంలోని వశి రైల్వేస్టేషన్‌ పెద్ద ఐటీ కంపెనీల భవన సముదాయంలో ఉంది. ఈ రైల్వే స్టేషన్‌పై అంతస్తులు, పక్క గదుల్లో అంతర్జాతీయ ఐటీ కంపెనీలు ఉన్నాయి. ముంబయి సీఎస్‌టీ, థానే నుంచి ఇక్కడి రైళ్ల రాకపోకలు సాగుతుంటాయి. రోజుకు 75వేల మంది ఇక్కడి నుంచి సీఎస్‌టీకి ప్రయాణిస్తుంటారట. 


ఈ స్టేషన్‌కు పేరు లేదు

దేశంలో కొన్ని వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ప్రతి స్టేషన్‌ను ఆ ఊరి పేరుతోనే పిలుస్తారు. కానీ పశ్చిమ బెంగాల్‌లోని ఓ రైల్వేస్టేషన్‌కు అసలు పేరే లేదు. పర్బా బర్దమన్‌ జిల్లాలో రైనానగర్‌, రైనా అనే రెండు గ్రామాలకు మధ్యలో నుంచి బంకురా-మసగ్రాం రైల్వే లైన్‌ వెళ్తుంది. అయితే ఈ ప్రాంతంలోని రైల్వేస్టేషన్‌కు మొదట్లో రైనానగర్‌ అని పిలిచే వారు. అయితే తమ స్థలంలో రైల్వేస్టేషన్‌ కట్టి ఎదురు గ్రామం పేరెలా పెడతారు? మా గ్రామం పేరు పెట్టాలని రైనా గ్రామస్థులు పట్టుబట్టారు. ఈ గొడవలు భరించలేక రైల్వేశాఖ ఆ రైల్వేస్టేషన్‌కు ఉన్న పేరును తీసేసి, కొత్త పేరేమి పెట్టకుండా వదిలేసింది. ప్రస్తుతం అక్కడి రైల్వే స్టేషన్‌ బోర్డు పేరు లేకుండా ఖాళీగా దర్శనమిస్తుంది. దీంతో ఈ ప్రాంతం గుండా వెళ్లే ప్రయాణికులు ఈ స్టేషన్‌ చూసి ఆశ్చర్యపోతుంటారు. అయితే అక్కడికి వెళ్లాలంటే రైల్వేశాఖ రైనానగర్‌ పేరు మీదనే టికెట్‌ ఇస్తోంది.


పెద్ద పేరు.. చిన్న పేరు

ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు సరిహద్దులో ఓ చిన్న రైల్వేస్టేషన్‌ ఉంది. స్టేషన్‌ చిన్నదే అయినా దాని పేరు మాత్రం దేశంలో అతిపెద్దది. ఆ పేరేంటంటే.. వెంకట నరసింహారాజువారిపేట. ఇంగ్లిష్‌లో 28 అక్షరాలతో అతిపెద్ద పేరున్న రైల్వేస్టేషన్‌గా గుర్తింపు పొందింది. అలాగే అతి తక్కువ అక్షరాలతో పేరున్న రైల్వే స్టేషన్‌ ఒడిశాలో ఉంది. ఆ స్టేషన్‌ పేరు ఐ.బీ. అంటే ఇంటెలిజెన్స్‌ బ్యూరో అనుకునేరు.. కాదండి వట్టి ఐ.బీ. మాత్రమే. 


న్యూజిలాండ్‌లోనిది కాదిది.. ఇక్కడిదే

వెల్లింగ్టన్‌ రైల్వే స్టేషన్‌.. ఇది న్యూజిలాండ్‌ ఉండే రైల్వే స్టేషన్‌ కాదండి.. తమిళనాడులోని ఊటీలో ఉన్న స్టేషన్‌. ఊటీకి ఎత్తైన కొండలతో.. సుందరమైన ప్రాంతంగా పేరుంది. ఊటీలోని ఈ వెల్లింగ్టన్‌ ప్రాంతంలో న్యూజిలాండ్‌లో ఉండే ప్రకృతి సోయగాలు కనిపిస్తాయి. అందుకే ఈ ప్రాంతానికి, రైల్వే స్టేషన్‌కు ఆ పేరు పెట్టారు. 


ఒడిశాలో సింగపూర్‌ రోడ్‌..

సింగపూర్‌ రోడ్‌ ఎక్కడుటుంది? సింగపూర్‌లోనే ఉంటుంది అంటే పప్పులో కాలేసినట్టే. సింగపూర్‌ రోడ్‌ ప్రాంతం ఒడిశా రాష్ట్రంలోని రాయగడ సమీపంలో ఉంది. ఆ ఊరితో ఎవరికి పెద్దగా ప్రాముఖ్యత లేకపోయినా.. కొరాపుట్‌-రాయగడ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు మాత్రం ఆ రైల్వేస్టేషన్‌ను చూడగానే సింగపూర్‌కి వచ్చామా అన్ని ఫీలింగ్‌ తెప్పిస్తోంది.


ఒకే స్టేషన్‌.. రెండు ఊర్లు

సాధారణంగా ఒక ఊరికి ఒకటే రైల్వేస్టేషన్‌ ఉంటుంది. కానీ మహారాష్ట్రలో రెండు ఊర్లకి కలిపి ఒకే రైల్వే స్టేషన్‌ ఉంది. అదెలా సాధ్యం అంటారా! అహ్మద్‌నగర్‌ జిల్లాలో శ్రీరామ్‌పూర్‌, బేలాపూర్‌ రెండు ఊర్ల మధ్య నుంచి రైల్వే లైన్‌ వెళ్లింది. ట్రాక్‌ ఒకవైపు శ్రీరాంపూర్‌, మరోవైపు బేలాపూర్‌ ఉంటాయన్నమాట. దీంతో ఎవరి వైపు ఉన్న రైల్వే స్టేషన్‌కు వారి ఊరి పేరు పెట్టారు. దీంతో ఒకే రైల్వే స్టేషన్‌లో రెండు ఊర్లపేర్లు కనిపిస్తాయి. కానీ అధికారికంగా బేలాపూర్‌ రైల్వేస్టేషనే గుర్తిస్తారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని