పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం

పరవాడలోని జవహరలాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం సంభవించింది. రాంకీ ఎస్‌‌ఈటీపీ సాల్వెంట్‌ ఫార్మాకంపెనీలో భారీపేలుళ్లు సంభవించాయి.

Updated : 06 Dec 2023 15:34 IST

ఎగసిపడుతున్న మంటలు

విశాఖపట్నం: పరవాడలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం సంభవించింది. రాంకీ ఎస్‌ఈటీపీ సాల్వెంట్‌ ఫార్మాకంపెనీలో భారీపేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల కారణంగా భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికులు, సంస్థ సిబ్బంది భయాందోళనలు చెందుతున్నారు. ఎల్జీ పాలిమర్స్‌ ఘటన మరువకముందే తాజా ఘటన స్థానికుల్లో తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. పలుమార్లు పేలుళ్లు సంభవిస్తుండటంతో అగ్నిమాపక సిబ్బంది సమీపంలోకి వెళ్లలేకపోతున్నారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి దూరంగా నిలిచిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. పేలుడు శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. సమీపంలోని కంపెనీలకు మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని పరిసర కంపెనీల సిబ్బంది, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పేలుళ్ల కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలముకున్నాయి.

ఎప్పటి మాదిరిగానే రాత్రి పదిగంటలకు నైట్‌ షిప్ట్‌ మొదలైన కొద్దిసేపట్లోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో విధుల్లో నలుగురు సిబ్బంది ఉన్నారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో పనిచేస్తున్న సిబ్బంది గాయపడినట్టు సమాచారం. గాయపడిన మల్లేశ్వరరావు(33)ను గాజువాకలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పరవాడ ఫార్మాసిటీలోని వేర్వేరు కంపెనీల్లో మందులు తయారు చేసే క్రమంలో వచ్చే ఒక రకమైన వృథా ఆయిల్‌ను తిరిగి శుభ్రం చేసే ప్రక్రియ ఈ కంపెనీలో జరుగుతుంది. ఇటీవల రసాయన వాయువులు లీకై ఇద్దరు మృతి చెందిన సాయినాథ్‌ లైఫ్‌సైన్సెస్‌ కంపెనీకి సమీపంలోనే ఈ పరిశ్రమ ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.పెద గంట్యాడ, అనకాపల్లి నుంచి వచ్చిన అగ్నిమాపక శకటాల సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు.

 

 

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని