ట్రంకు పెట్టెల్లో ‘ఖజానా.. ఉద్యోగిదే’!

బుక్కరాయసముద్రంలో ఓ ఇంట్లో 8 ట్రంకు పెట్టెల్లో దాచిన బంగారం, వెండి ఆభరణాల నిధి ఖజానా శాఖ ఉద్యోగిదేనని పోలీసులు తేల్చారు. జిల్లా ఖజానా శాఖ ఉద్యోగి మనోజ్‌కుమార్‌ తన కారు డ్రైవర్‌ నాగలింగం మామ ఇంట్లో పెట్టెలు దాచగా..

Updated : 20 Aug 2020 08:22 IST

 2.42 కిలోల బంగారం, 84 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం

అనంతపురం: బుక్కరాయసముద్రంలో ఓ ఇంట్లో 8 ట్రంకు పెట్టెల్లో దాచిన బంగారం, వెండి ఆభరణాల నిధి ఖజానా శాఖ ఉద్యోగిదేనని పోలీసులు తేల్చారు. జిల్లా ఖజానా శాఖ ఉద్యోగి మనోజ్‌కుమార్‌ తన కారు డ్రైవర్‌ నాగలింగం మామ ఇంట్లో పెట్టెలు దాచగా.. పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలోని నగల విలువను మంగళవారం అర్ధరాత్రి వరకు లెక్కించి ఆ వివరాలను బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఓఎస్డీ రామకృష్ణప్రసాద్‌ వెల్లడించారు. పెట్టెల్లో 2.42 కిలోల బంగారు ఆభరణాలు, 84.10 కిలోలు వెండి ఆభరణాలు, రూ.15,55,560 నగదు, రూ.49.10 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రూ.27.05 లక్షల విలువైన బాండ్లు లభించాయి. వీటితోపాటు 2 కార్లు, 7 మోటారు సైకిళ్లు, 4 ట్రాక్టర్లు సీజ్‌ చేశారు. ఇందులో మూడు ఖరీదైన బైక్‌లు ఉన్నాయి. మూడు 9ఎంఎం పిస్టల్స్‌, తూటాలు, ఒక ఎయిర్‌ గన్‌ స్వాధీనం చేసుకొని.. అవి నకిలీవిగా తేల్చారు. ఈ సొత్తు మొత్తం ఖజానా శాఖలో పని చేసే సీనియర్‌ అకౌంటెంట్‌ మనోజ్‌కుమార్‌కు చెందినవిగా విచారణలో తేలిందని ఓఎస్డీ తెలిపారు. నిందితుడు జిల్లా కేంద్రంలోని సాయినగర్‌లో ఉంటున్నారు. బుక్కరాయసముద్రానికి చెందిన డ్రైవర్‌ వద్ద పెట్టెలు దాచాడనే సమాచారంతో మంగళవారం రాత్రి దాడి చేసినట్లు వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఖజానా ఉద్యోగి ఇంత భారీగా ఎలా సంపాదించాడన్న విషయాన్ని తేల్చడానికి అవినీతి నిరోధక విభాగానికి కేసును బదలాయిస్తున్నామని ఓఎస్డీ వివరించారు. సమావేశంలో అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, తాడిపత్రి డీఎస్పీ ఏ.శ్రీనివాసులు, సీసీఎస్‌ డీఎస్పీ ఈ.శ్రీనివాసులు, సీఐ శ్యామరావు, బుక్కరాయసముద్రం సీఐ సాయిప్రసాద్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని