నాన్నను విడిచి ఉండలేం

అన్యోన్య కుటుంబాన్ని కరోనా కకావిలకం చేసింది. ఇంటి పెద్ద మృతితో మిగతా వారు కలత చెందారు. ప్రాణపదంగా ప్రేమించే భర్త లేని జీవితం వ్యర్థమని భావించిన భార్య, తండ్రి ప్రేమకు ..

Updated : 20 Aug 2020 08:21 IST

కరోనాతో ఇంటి పెద్ద మరణించారని మనస్తాపం

కొవ్వూరు పట్టణం: అన్యోన్య కుటుంబాన్ని కరోనా కకావిలకం చేసింది. ఇంటి పెద్ద మృతితో మిగతా వారు కలత చెందారు. ప్రాణపదంగా ప్రేమించే భర్త లేని జీవితం వ్యర్థమని భావించిన భార్య, తండ్రి ప్రేమకు దూరమయ్యామని పిల్లలు మనస్తాపంతో గోదావరిలో దూకి గల్లంతయ్యారు. పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుందీ ఘటన. కొవ్వూరు మండలం పశివేదలకు చెందిన పరిమి వీర వెంకట నరసింహారావు (50) రైతు. వారం కిందట ఒళ్లు వెచ్చబడింది. సాధారణ జ్వరమని భావించి వైద్యం చేయించుకున్నా తగ్గలేదు. శ్వాసలో ఇబ్బంది తలెత్తడంతో ఈ నెల 14న రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చేరారు. ఊపిరితిత్తుల స్కానింగ్‌ చేయించుకోగా కరోనా సోకిందని తేలింది. ఆ రోజు అక్కడే ఉండి 15న ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ 16న మరణించారు. అంత్యక్రియలు అక్కడే పూర్తయ్యాయి. ఆయన భార్య సునీత (45), కుమారుడు ఫణికుమార్‌ (25), కుమార్తె లక్ష్మీఅపర్ణ (23)కు వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు చేశారు. వారికి నెగెటివ్‌ అని తేలింది. నరసింహారావు మృతిని జీర్ణించుకోలేని వారు ముగ్గురూ మంగళవారం రాత్రి 11 గంటలకు కొవ్వూరు వంతెనపై నుంచి గోదావరిలో దూకారు. పశివేదలలో వీరు బయలు దేరేటప్పుడు చూసిన గ్రామస్థులు అనుమానించారు. వారు ఎంతకూ తిరిగి రాకపోవడం, వంతెనపై కారు నిలిపి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. నాన్నను విడిచి ఉండలేం. మమ్మల్ని క్షమించు మామయ్యా... అమ్మమ్మ, తాతయ్య జాగ్రత్త అంటూ రాసిన డైరీ పోలీసులకు దొరికింది.

అన్యోన్య కుటుంబం
క్రమశిక్షణ, ఆధ్యాత్మిక భావనలతో గడిపే భర్త నరసింహారావంటే సునీతకు ప్రాణం. ఎక్కడికైనా ఇద్దరూ కలిసి వెళ్లడం అలవాటు. ఫణికుమార్‌ మైనింగ్‌ జియాలజీ విభాగంలో ఇంజినీరింగ్‌ చదివి గుజరాత్‌లో ఉద్యోగం చేస్తున్నారు. లక్ష్మీఅపర్ణ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. తండ్రి అంటే ఇద్దరికీ ఎంతో ప్రేమ. ఎక్కడున్నా ఆయనతో మాట్లాడనిదే వారికి రోజు పూర్తికాదు. ఇంతటి అన్యోన్య కుటుంబాన్ని కరోనా కకావికలం చేసింది. తండ్రిని వదిలి ఉండలేక క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వారిని ప్రమాదంలోకి నెట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని