కరోనా బాధితులకు రూ. 2వేల సాయం నిలిపివేత

కరోనా బారినపడి ఆసుపత్రులు, క్వారంటైన్‌ కేంద్రాలలో ఉండి కోలుకున్న వారికి ‘ఆసరా’ కింద ఇచ్చే రూ.2,000 ఆర్థిక సాయాన్ని ఆపేశారు. పాజిటివ్‌ కేసుల వృద్ధితో ఆర్థికభారం పెరిగిందని...

Published : 06 Sep 2020 08:31 IST

వ్యయం పెరిగినందువల్లే అంటున్న అధికారులు

అమరావతి: కరోనా బారినపడి ఆసుపత్రులు, క్వారంటైన్‌ కేంద్రాలలో ఉండి కోలుకున్న వారికి ‘ఆసరా’ కింద ఇచ్చే రూ.2,000 ఆర్థిక సాయాన్ని ఆపేశారు. పాజిటివ్‌ కేసుల వృద్ధితో ఆర్థికభారం పెరిగిందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు తాత్కాలికంగా ఈ సాయాన్ని నిలిపేసినట్లు వైద్యారోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. కొవిడ్‌ నుంచి కోలుకున్న వారంతా 2వారాలపాటు ఇళ్లలోనే ఉండి... పౌష్ఠికాహారం తీసుకొనేందుకు వీలుగా ప్రతి ఒక్కరికి రూ.2వేలు అందచేస్తామని సీఎం జగన్‌ ఏప్రిల్‌ నెలాఖరులో ప్రకటించారు. ఈమేరకు మే 4న వైద్యారోగ్య శాఖకు రూ.10 కోట్లు మంజూరు చేశారు. వెంటనే కలెక్టర్ల ఆధ్వర్యంలో చెల్లింపులు మొదలయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం... మూడు నెలల్లో బాధితులకు రూ.20 కోట్ల వరకు చెల్లించారు.

జులై నుంచి డిశ్ఛార్జి అయిన వారి బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుంటున్నా... డబ్బులు మాత్రం సరిగ్గా జమ చేయడంలేదు. ఈలోగా క్వారంటైన్‌ కేంద్రాలు తగ్గి, కొవిడ్‌ సంరక్షణ కేంద్రాలు పెరిగాయి. ఇళ్లల్లోనే ఉంటూ చికిత్స పొందేవారూ పెరిగారు. అంతలోనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి కరోనా నుంచి కోలుకున్న వారికిస్తున్న రూ.2వేలను నాలుగు రోజుల నుంచి ఇవ్వడంలేదని అనంతపురం జిల్లా కలెక్టర్‌ చెప్పినట్లు అక్కడి సమాచార శాఖ అధికారులు ఇటీవల ప్రకటన జారీ చేశారు. ‘బాధితుల సౌకర్యార్థం ఆసుపత్రులు, కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో నాణ్యత కలిగిన భోజనం పంపిణీ, పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరచడం, ఇతర సౌకర్యాల కల్పన కోసం అధిక వ్యయమవుతోంది’ అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

నేరుగా ఖననం చేస్తేనే రూ.15 వేలు!
వైరస్‌తో మరణించిన వారి భౌతికకాయాలకు ప్రభుత్వంద్వారా ఖననం జరిగితే... బాధిత కుటుంబాలకు రూ.15 వేలను సైతం కొన్నిచోట్ల ఇవ్వడంలేదు. మృతదేహాలను బాధితులు స్వయంగా ఖననం చేస్తేనే సాయం ఇస్తామని పలుచోట్ల ఆసుపత్రుల అధికారులు చెబుతున్నట్లు తెలిసింది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts