2020: రోదసి రంగానికి ఆటంకం.. ఆశాజనకం

కరోనా మహమ్మారి 2020లో విలయమే సృష్టించింది. దాని ప్రకంపనలకు కుదేలు కాని రంగమే లేదు. రోదసి సంస్థలు అందుకు అతీతమేమీకాదు. అనేక దేశాల అంతరిక్ష సంస్థలు తాము చేపట్టే....

Published : 27 Dec 2020 01:42 IST

40 ఏళ్ల తర్వాత చంద్రుడి ఉపరితల నమూనాలు నేలకు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా మహమ్మారి 2020లో విలయమే సృష్టించింది. దాని ప్రకంపనలకు కుదేలు కాని రంగమే లేదు. రోదసీసంస్థలు అందుకు అతీతమేమీకాదు. అనేక దేశాల అంతరిక్ష సంస్థలు తాము చేపట్టే ప్రయోగాలను వాయిదా వేసుకోగా పరిమిత సంఖ్యలో జరిగినవి మాత్రం అపరిమిత ఫలితాలను ఇచ్చి భవిష్యత్తుపై ఆశలు పెంచాయి. 40 ఏళ్ల తర్వాత చంద్రుడి ఉపరితల నమూనాలు నేలకు చేరాయి. చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన చాంగే-5, అమెరికన్‌ ప్రైవేటు రోదసీ సంస్థ స్పేస్‌ ఎక్స్‌ వాణిజ్య అంతరిక్ష యాత్రను విజయవంతంగా నిర్వహించాయి. చంద్రుడి ఉపరితల నమూనాలు భూమికి చేరింది ఈ ఏడాదిలోనే. జాబిల్లిపై అన్వేషణలో భాగంగా నవంబర్‌ 24న చైనా చేపట్టిన చాంగే-5 ప్రయోగం విజయం సాధించింది. చంద్రుడి నమూనాలతో చాంగే-5 క్యాప్సుల్‌ ఈనెల 17న భూమిపైకి చేరింది. 

40 ఏళ్ల క్రితం అమెరికా ఇద్దరు వ్యోమగాములను చంద్రుడిపైకి పంపి నమూనాలను సేకరించింది. అనంతరం సోవియట్‌ యూనియన్‌ కూడా 1976లో చంద్రుడిపై పరిశోధనలు చేసి అక్కడి మట్టి నమూనాలను భూమికి తీసుకురాగలిగింది. ఈ రెండు దేశాల తర్వాత చంద్రుడి నుంచి మట్టి నమూనాలను సేకరించిన మూడో దేశంగా చైనా నిలిచింది. ప్రస్తుత ప్రయోగం ద్వారా జాబిల్లి ఉపరితలం నుంచి దాదాపు రెండు కిలోల మట్టి, రాళ్లను తీసుకొచ్చినట్లు సమాచారం. చైనా అంతరిక్ష ప్రయోగాల చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన ప్రయోగంగా చాంగే-5 నిలిచింది. అమెరికా, సోవియట్‌ యూనియన్‌ చంద్రుడిపై దిగిన ప్రదేశం కంటే చైనా వ్యోమనౌక దిగిన ప్రదేశం భిన్నమైనదని ఆ దేశ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ ప్రయోగం విజయవంతమవడం రానున్న రోజుల్లో మానవ సహిత ప్రయోగాలకు ఊతమిస్తుందని చైనా అంతరిక్ష ప్రయోగ కేంద్రం పేర్కొంది. 

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఒసికిస్‌ రెక్స్‌ అనే వాహన నౌకను 2016 సెప్టెంబర్‌ 8న సౌర వ్యవస్థలోని ఓ గ్రహశకలమైన బెన్నుపైకి పంపింది. 32 కోట్ల 10 లక్షల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం అనంతరం ఈ ఏడాది అక్టోబర్‌ 20న అది బెన్నుపై దిగింది. నైటింగేల్‌ అనే ప్రదేశంలో దిగిన వెంటనే ‘టచ్ అండ్ గో’ ట్యాగ్‌ పేరిట అక్కడి నమూనాల సేకరణకు సంబంధించిన ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసింది. నమూనా సేకరణకు ముందుగానే చేసిన ప్రోగ్రాం ఆధారంగా ఒసిరిస్‌ రెక్స్‌లోని రోబో చెయ్యి సాయంతో క్షణాల వ్యవధిలో బెన్ను నమూనాలు 60 గ్రాముల మేర సేకరించి, వెంటనే తిరిగి బెన్ను కక్ష్యలోకి చేరింది. ఈ ఒసిరిస్‌ రెక్స్‌ మార్చి 2021లో భూమి వైపు తన ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది. 2023 సెప్టెంబర్‌ 24న భూమిపై ఉన్న ఉతా ఎడారి ప్రాంతంలో అడుగుపెట్టనుంది. బెన్ను ద్వారా సౌర వ్యవస్థ గుట్టు తెలుస్తుందని నాసా ఆశిస్తోంది.

మరిన్ని విశేషాల కోసం కింది వీడియోను చూడండి...

ఇవీ చదవండి...

కరోనా ఎఫెక్ట్‌: 2021లో వీటిపై దృష్టి పెట్టాల్సిందే


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని