కూరి... కోరి వడ్డించండి... 

లేలేత కూరగాయల్లో కాస్త మసాలాను కూరి వండితే... ఘుమఘుమలతో పాటుగా రుచీ అదిరిపోతుంది. వీటి ముందు మాంసాహార వంటకాలూ దిగదుడుపే. ఇక్కడున్నవన్నీ అలాంటివే.

Updated : 14 Feb 2021 00:22 IST

లేలేత కూరగాయల్లో కాస్త మసాలాను కూరి వండితే... ఘుమఘుమలతో పాటుగా రుచీ అదిరిపోతుంది. వీటి ముందు మాంసాహార వంటకాలూ దిగదుడుపే. ఇక్కడున్నవన్నీ అలాంటివే.

మసాలా గుత్తివంకాయ

కావాల్సినవి: లేత వంకాయలు- పావుకేజీ,  వేరుసెనగపప్పు- టేబుల్‌స్పూన్‌, ధనియాలు- రెండు టీస్పూన్లు, ఎండుకొబ్బరి- చిన్నముక్క, నువ్వులు- టేబుల్‌స్పూన్‌, అల్లం- చిన్నముక్క, వెల్లుల్లి- ఎనిమిది, టొమాటో, ఉల్లిపాయ- ఒక్కోటి చొప్పున, పచ్చిమిర్చి- రెండు, కొత్తిమీర- గుప్పెడు, పసుపు- పావు టీస్పూన్‌, కారం- రెండు టీస్పూన్లు, ఉప్పు- సరిపడా, చింతపండు- నిమ్మకాయంత, దాల్చినచెక్కలు- రెండు, లవంగాలు- మూడు, యాలకులు- రెండు, సాజీర- రెండు టీస్పూన్లు, బిర్యానీఆకు- ఒకటి.  
తయారీ: వేరుసెనగపప్పు, ధనియాలు ఎండుకొబ్బరి, నువ్వులను తక్కువ మంట వేయించాలి. చల్లారిన తర్వాత మిక్సీజార్‌లో వేసి పొడిచేయాలి. దీంట్లో అల్లంముక్క, వెల్లుల్లి, టొమాటో, ఉల్లిపాయ, కొత్తిమీర పచ్చిమిర్చి వేసి, కొద్దిగా నీళ్లు పోసి కాస్త బరకగా మిక్సీపట్టి పక్కన పెట్టుకోవాలి. వంకాయలు పూర్తిగా విడిపోకుండా రెండు గాట్లు పెట్టుకోవాలి. వీటిని ఉప్పునీళ్లలో వేసి పది నిమిషాలపాటు ఉంచితే వగరు పోతుంది. చింతపండును నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. వంకాయల్లో రెండు స్పూన్ల మసాలా పేస్టు పెట్టి మిగిలిన దాన్ని పక్కన పెట్టుకోవాలి. కడాయిలో నూనె వేడిచేసి దాల్చిచెక్క, లవంగాలు, యాలకులు, సాజీరా, బిర్యానీ ఆకు వేయించాలి. దీంట్లో వంకాయలను వేసి మూతపెట్టి ఐదు నిమిషాలపాటు మగ్గించాలి. తర్వాత జాగ్రత్తగా రెండోవైపు తిప్పి కాసేపు మగ్గించాలి. వంకాయలు బాగా వేగిన తర్వాత మిగిలిన మసాలా పేస్టు వేయాలి. తర్వాత కొన్ని నీళ్లు, చింతపండు గుజ్జు వేసి బాగా కలిపి ఉడికించాలి. వంకాయల మెత్తగా అయిన తర్వాత దించేయాలి. చివరగా కాస్త కొత్తిమీర తరుగు చల్లుకోవాలి. ఈ కూర అన్నం, బిర్యానీలోకి  చాలా రుచిగా ఉంటుంది.

గుత్తి కాకరకాయ

కావాల్సినవి: లేత కాకరకాయలు- పావుకేజీ, ఉప్పు- టేబుల్‌స్పూన్‌, పసుపు- అర టేబుల్‌స్పూన్‌, మసాలా కోసం: వేయించి వేరుసెనగపప్పు- వంద గ్రా., ఎండుకొబ్బరి- వంద గ్రా., వెల్లుల్లి- ఒకటి, జీలకర్ర- టేబుల్‌స్పూన్‌, నువ్వులు- రెండు టీస్పూన్లు, కారం- రెండు టేబుల్‌స్పూన్లు, పంచదార- టీస్పూన్‌, నిమ్మరసం- రెండు టేబుల్‌స్పూన్లు.
తయారీ: కాకరకాయలను చెక్కుతీసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. గాటుపెట్టుకుని గింజలను తీసేయాలి. ఉప్పు, పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని కాకరకాయల లోపలా బయటా రాయాలి. వీటిని అరగంటపాటు పక్కన పెట్టుకుంటే చేదు పోతుంది. వేరుసెనగపప్పు, నువ్వులు, ఎండుకొబ్బరి, జీలకర్రలను నూనె లేకుండా వేయించి మిక్సీ పట్టాలి. దీంట్లో వెల్లుల్లి, కారం, పంచదార, ఉప్పు, పసుపు వేయాలి. ఈ పొడిలో నిమ్మరసం పోసి బాగా కలపాలి. అరగంట తర్వాత కాకరకాయల్లోని నీటిని పిండేసి పక్కన పెట్టుకోవాలి. వీటిల్లో నిండుగా మసాలా పొడి పెట్టుకోవాలి. కడాయిలో నూనె వేడిచేసి ఈ కాకరకాయలను వేయించాలి. మధ్యస్థంగా ఉండే మంట వీటిని మాడకుండా వేయించాలి. పది నిమిషాల తర్వాత మెల్లగా మరోవైపు తిప్పాలి. ఇప్పుడు మిగిలిన మసాలా పొడిని వేసి జాగ్రత్తగా కలపాలి. పదినిమిషాలపాటు తక్కువ మంట మీద వేయించి దించేయాలి.

క్యాప్సికమ్‌ మసాలా

కావాల్సినవి: క్యాప్సికమ్‌- అరకేజీ, చిన్నముక్కల్లా కోసిన ఉల్లిపాయలు, టొమాటోలు- రెండు చొప్పున, చింతపండు- చిన్న నిమ్మకాయంత, ఎండుకొబ్బరి- చిన్నముక్క, సాజీర- టీస్పూన్‌, నువ్వులు- టేబుల్‌స్పూన్‌, గరంమసాలా పొడి- టీస్పూన్‌, కారం- టేబుల్‌స్పూన్‌, పసుపు, జీలకర్రపొడి- టీస్పూన్‌ చొప్పున, ఉప్పు- సరిపడా, ధనియాల పొడి, అల్లంవెల్లుల్లి పేస్టు- టేబుల్‌స్పూన్‌ చొప్పున, చీల్చిన పచ్చిమిర్చి- రెండు, కొత్తిమీర, కరివేపాకు- కొద్దిగా.
తయారీ: క్యాప్సికమ్‌లను గాటుపెట్టుకుని విత్తనాలను తీసేయాలి. కడాయి వేడిచేసి నువ్వులను దోరగా వేయించి చల్లార్చాలి. తర్వాత నువ్వులు, ఎండుకొబ్బరిలో కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో నూనె వేడిచేసి పచ్చిమిర్చి ముక్కలు, సాజీరా, ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. దీంట్లో కరివేపాకు, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి క్యాప్సికమ్‌లో కూరాలి. వీటిని మధ్యస్థంగా ఉన్న మంట మీద ఐదు నిమిషాలపాటు మగ్గనివ్వాలి. ఇవి కాస్త ఉడికిన తర్వాత టొమాటో ముక్కలు వేయాలి. తర్వాత కారం, ధనియాలు, జీలకర్ర, గరంమసాలా పొడి, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. తర్వాత నువ్వులు, కొబ్బరి పేస్టు వేసి చింతపండు పులుసు పోసి కలపాలి. దీంట్లో కొంచెం నీళ్లు పోసుకుని కలిపి పది నిమిషాలపాటు తక్కువ మంట మీద ఉడికించాలి. చివర్లో కొత్తిమీర తరుగు చల్లుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని