Updated : 02/05/2021 07:49 IST

అంతట ఉత్కంఠ.. అచ్చంపేటలో హడావిడి

అధికారుల ఉరుకులు, పరుగులు

భూకబ్జా ఆరోపణలతో క్షేత్రస్థాయిలో సర్వే

డిజిటల్‌ సర్వే చేస్తున్న అధికారులు

న్యూస్‌టుడే- వెల్దుర్తి, తూప్రాన్‌ : శనివారం ఉదయం నుంచే ఉన్నతాధికారులు మెదక్‌ జిల్లా అచ్చంపేటకు చేరుకోవడం మొదలుపెట్టారు. మరోవైపు ఎక్కడా శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రెవెన్యూ, సర్వే బృందాలుగా విడిపోయి చకచకా సర్వే చేస్తుండగా.. అటువైపు ఎవరూ రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. సర్వే చేస్తున్న భూముల వద్దకు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తిరుగుతూ వేగంగా పూర్తయ్యేలా చూశారు. ఇవీ మాసాయిపేట మండలం అచ్చంపేటలో కనిపించిన శనివారం కనిపించిన దృశ్యాలు. జిల్లా కలెక్టర్‌ హరీశ్‌తో పాటు అదనపు కలెక్టర్‌ రమేష్‌, తూప్రాన్‌ ఆర్డీవో శ్యాంప్రకాశ్‌ల పర్యవేక్షణలో తహసీల్దార్లు శ్రీదేవి, మాలతి, భిక్షపతి, విజయలక్ష్మి, ఇతర రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టారు. మెదక్‌ ఏఎస్పీ కృష్ణమూర్తి, తూప్రాన్‌ డీఎస్పీ కిరణ్‌కుమార్‌లు శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేశారు. సిబ్బందికి అవసరమైన సూచనలు చేస్తూ సర్వే పనులకు ఎవరూ ఆటంకం కలిగించకుండా చూశారు. నిఘా విభాగానికి చెందిన ఉన్నతాధికారులు అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో పర్యటించారు. ఈ పరిణామాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? వారి స్పందన ఏంటి? అనే సమాచారాన్ని వారు సేకరించారు. మంత్రి ఈటల రాజేందర్‌ భూములను కబ్జా చేశారంటూ ఆరోపణలు రావడం, సీఎం కేసీఆర్‌ విచారణకు ఆదేశించడంతో, గంటల వ్యవధిలోనే క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టడం, చకచకా నివేదికలు ఇవ్వడంతో స్థానికులూ ఈ అంశాలన్నింటినీ ఆసక్తిగా గమనించారు. రానున్న రోజుల్లో ఈ భూములను తమకే ఇస్తారా? ప్రభుత్వ పరం చేస్తారా? అని చర్చించుకుంటూ కనిపించారు. ఇక ఈ భూములతో సంబంధం లేని స్థానికులు సైతం ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు అచ్చంపేట పంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చారు. రెవెన్యూ ఉన్నతాధికారులంతా ఊరికి రావడంతో కొందరు తమ సమస్యలనూ వారికి చెప్పే ప్రయత్నం చేశారు. భూ దస్త్రాల ప్రక్షాళన సమస్యలను వారి దృష్టికి తెచ్చారు. అవి తర్వాత చూస్తామని, ప్రస్తుతం కబ్జా ఆరోపణలకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే చెప్పాలని అధికారులు వారికి వివరించారు.

గ్రామస్థులు ఏమంటున్నారంటే..

మా భూమిలో నుంచి రోడ్డు పోశారు

- కత్తెర యాదగిరి, అచ్చంపేట

నాకు సర్వే నంబరు 130లో అరెకరం అసైన్డు భూమి ఉంది. అందులో జనరేటర్‌ గది నిర్మించారు. నేను సర్వే చేయించి కడీలు నాటితే వాటిని తొలగించారు. ఇదే విషయాన్ని విజిలెన్స్‌ అధికారులకు వివరించా. నా వద్ద ఉన్న ఆధారాలను వారికి ఇచ్ఛా నేను నా భూమిని ఎవరికీ విక్రయించలేదు. మా భూములు మాకే అప్పగించాలని కోరుతున్నా.

మూడెకరాల భూమి మాకు కాకుండా పోయింది

- రామచంద్రం, అచ్చంపేట

మా తండ్రి పేరిట రెండు సర్వే సంఖ్యల్లో కలిపి 3 ఎకరాల భూమి ఉంది. దీనిని మాకు కాకుండా చేస్తున్నారు. రోడ్లు వేయడం, చుట్టూ గోడలు నిర్మించడం లాంటి పనులు చేస్తున్నారు. మాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మా గ్రామంలో చాలా మంది మాలాగే ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు వచ్చి మా సమస్యను విన్నారు.

‘రాజకీయంగా దెబ్బ తీయడానికి కుట్ర’

మెదక్‌, న్యూస్‌టుడే: వంద ఎకరాల అసైన్డ్‌ భూములను కబ్జా చేశారని అవాస్తవాలు చెబుతూ కొందరు నేతలు ఈటల రాజేందర్‌ రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయాలని కుట్ర పన్నుతున్నారని ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ అన్నారు. శనివారం సంఘం నేతలతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ నాయకుడు ఎదుగుదలను చూసి అధికార పార్టీ ఓర్వలేకపోతోందని ఆరోపించారు. భూ ఆక్రమణపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా ఉపాధ్యక్షులు సీతారాం, సురేశ్‌, ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, జిల్లా కార్యదర్శి శ్రీకాంత్‌, జిల్లా యువజన అధ్యక్షుడు సాయిరాం, బాధ్యులున్నారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని